నితీష్ తిరిగి రావడం బీజేపీకి చెంపపెట్టు.. ప్రతిపక్షాలన్నీ ఏకమవుతాయి: సోనియాను కలిసిన తేజస్వీ యాదవ్

By Mahesh KFirst Published Aug 12, 2022, 7:56 PM IST
Highlights

బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఈ రోజు కాంగ్రెస్ అధ్యక్షులు సోనియా గాంధీతో సమావేశం అయ్యారు. అనంతరం, ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బిహార్‌లో బీజేపీ మినహాయిస్తే అన్ని పార్టీలు ఏకం అయ్యాయని, ఇదే రీతిలో దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలన్నీ ఏకం అవుతాయని అన్నారు. నితీష్ కుమార్ తిరిగి సోషలిస్ట్ ఫ్యామిలీకి తిరిగి రావడం బీజేపీకి చెంపపెట్టు అని వివరించారు.
 

న్యూఢిల్లీ: బిహార్ కొత్త డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఈ రోజు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. బిహార్‌లో రాజకీయ మార్పులు, ఇతర అంశాలపై చర్చించారు. సోనియా గాంధీతో భేటీ తర్వాత విలేకరులతో తేజస్వీ యాదవ్ మాట్లాడారు. బీజేపీపై విమర్శలు సంధించారు. నితీష్ కుమార్ తిరిగి సోషలిస్ట్ కుటుంబానికి తిరిగి రావడం బీజేపీకి చెంపపెట్టు అని అన్నారు. ప్రాంతీయ పార్టీలను బెదిరించడం లేదా కొనుగోలు చేసే కుట్రలకు బీజేపీ తెర లేపిందని ఆరోపించారు. తద్వార వెనుకబడిన తరగులు, దళితుల రాజకీయాలకు తెర దించాలని ప్రయత్నిస్తున్నదని ఆరోపణలు చేశారు. ఎందుకంటే.. చాలా వరకు ప్రాంతీయ పార్టీలు ఈ వర్గాలకే ప్రాతినిధ్యం వహిస్తున్నాయని తెలిపారు.

బిహార్‌లో బీజేపీ మినహా రాజకీయ పార్టీలు అన్నీ ఏకం అయ్యాయని తేజస్వీ యాదవ్ అన్నారు. నితీష్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని వివరించారు. ఇదే రీతిలో దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలన్నీ ఏకం అవుతాయని అన్నారు. 

తేజస్వీ యాదవ్ చేసిన ఉద్యోగాల హామీని బీజేపీ లేవనెత్తుతున్నదని విలేకరులతో తేజస్వీ ముందు ప్రస్తావించారు. ఇలా వారు ఉద్యోగాల గురించి లేవనెత్తడం మంచిదే అని వివరించారు. మత రాజకీయాలు, హిందూ ముస్లింల విభజనలపై రాజకీయాలు చేయడం కంటే ఇలాంటి ప్రశ్నాలే లేవనెత్తడం చాలా మంచిది అని తెలిపారు. మొత్తంగా తాము చేయడం వల్ల బీజేపీ ఇప్పుడిప్పుడే అసలైన సమస్యలపై మాట్లాడుతున్నదని అన్నారు. వీటిపై మాట్లాడకుండా ఉండలేని స్థితికి బీజేపీని తాము తీసుకెళ్లగలిగామని చెప్పారు. తాము తమ హామీలను నిలుపుకుంటామని తెలిపారు. కొంచెం సమయం ఆగాలని పేర్కొన్నారు.

ప్రాంతీయ పార్టీలు అన్నింటిని బలహీన పరిచి, వాటిని లేకుండా చేయాలని బీజేపీకి పెద్ద ప్రణాళిక ఉన్నదని తేజస్వీ యాదవ్ అన్నారు. ప్రాంతీయ పార్టీలు చాలా వరకు వెనుకబడిన తరగతులు, దళితులకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని, నితీష్ కుమార్ కూడా వెనుకబడిన వర్గానికి చెందిన వారేనని తెలిపారు. ఇప్పటికే బీజేపీ రామ్ విలాస్ పాశ్వాన్ పార్టీని విభజించారని అన్నారు.

అసలు ప్రాంతీయ పార్టీలే లేకుంటే దేశంలో ప్రతిపక్షమే లేకుండా పోతుందని అన్నారు. అది దేశంలో ప్రజాస్వామ్యమే లేకుండా చేస్తుందని తెలిపారు. అంటే.. బీజేపీ చేసిందే పాలన అన్నట్టు అని వివరించారు. ఇది చివరకు బీజేపీ నియంతృత్వ పాలనకు దారి తీస్తుందని చెప్పారు.

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో ప్రభుత్వాలను కూల్చి బీజేపీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఇప్పుడు జార్ఖండ్‌లోనూ బీజేపీ అదే పనిలో ఉన్నదని ఆరోపించారు. జార్ఖండ్‌లో జరుగుతున్న డ్రామాతో ఇది రూఢీ అవుతున్నదని పేర్కొన్నారు. ఈడీ, సీబీఐలు ఇప్పుడు స్థానిక పోలీసు స్టేషన్‌ల కంటే కూడా దిగజారిపోయాయని తెలిపారు.

click me!