
ముంబై: దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే ఇండియా కూటమి గెలవాల్సిన అవసరం ఉందని ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చెప్పారు. ముంబైలో ఇండియా కూటమి సమావేశం రెండు రోజులుగా సాగుతుంది.ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే శుక్రవారం నాడు మీడియాకు వివరించారు.ఇండియా కూటమికి 13 మందితో సమన్వయకమిటీని ఏర్పాటు చేసినట్టుగా ఆయన తెలిపారు.
ముంబైలో జరిగిన సమావేశంలో మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా ఆయన చెప్పారు. ఎన్నికల వ్యూహాలు, ప్రచారంలో ఇండియా కూటమిలోని పార్టీలు పరస్పరం సహకరించుకుంటాయని ఖర్గే చెప్పారు. త్వరలోనే ఇండియా కూటమి మరో సమావేశం ఉంటుందన్నారు.తదుపరి సమావేశం తేది, ప్రదేశాన్ని త్వరలోనే వెల్లడిస్తామన్నారు.వచ్చే ఎన్నికల్లో కూటమి ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకుందన్నారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ సర్కార్ దుర్వినియోగం చేస్తుందని ఆయన విమర్శించారు.ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై ఈడీ, ఐటీ, సీబీఐని ప్రయోగిస్తుందని ఖర్గే బీజేపీ సర్కార్ పై విమర్శలు చేశారు.ఎన్నో కీలక నిర్ణయాలను మోడీ సర్కార్ ఏకపక్షంగా తీసుకుందన్నారు. ప్రణాళిక రహితమైన లాక్ డౌన్ వల్ల వలస కార్మికులు ఇబ్బందులు పడ్డారని ఆయన చెప్పారు.
గ్యాస్ ధరలను మోడీ సర్కార్ రెట్టింపు చేసిందని ఆయన విమర్శించారు.అయితే ఎన్నికలు వస్తున్నాయని కంటితుడుపుగా రూ. 200 తగ్గించారని ఆయన విమర్శించారు. బీజేపీ పాలనలో గ్యాస్, పెట్రోల్ , డీజీల్ ధరలు విపరీతంగా పెరిగాయన్నారు.
ఇండియా కూటమి సమన్వయ కమిటీ
ఇండియా కూటమి సమన్వయ కమిటీని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, శరద్ పవార్, అభిషేక్ బెనర్జీ, స్టాలిన్, సంజయ్ రౌత్, తేజస్వి యాదవ్, లల్లన్ సింగ్, రాఘవ్ చద్దా,హేమంత్ సోరేన్, డి.రాజా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబాముఫ్తీతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ జాతీయ ఎజెండా, ఉమ్మడి ప్రచార అంశాలు,ఉమ్మడి కార్యక్రమాలను రూపొందించనుంది.