
Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను తీసుకురావడానికి ఆపరేషన్ గంగాను చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. దీని కోసం ప్రత్యేక విమానాల్లో భారతీయులను స్వదేశానికి తీసుకువస్తున్నది. భారతీయ పౌరుల రక్షణను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం.. అక్కడ చిక్కుకుపోయిన భారత పౌరులను స్వదేశానికి తీసుకురావడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను సైతం రంగంలోకి దించింది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపునకు చేపట్టిన ఆపరేషన్ గంగలో భాగంగా మరో రెండు విమానాలు దేశరాజధాని న్యూఢిల్లీ చేరుకున్నాయి. 420 మందితో హంగరీలోని బుడాపెస్ట్, రొమేనియాలోని బుకారెస్ట్ నుంచి వైమానిక దళానికి చెందిన రెండు సీ-17 విమానాలు (C-17 aircrafts) ఢిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్‌లో దిగాయి. స్వదేశానికి తిరిగివచ్చిన విద్యార్థులకు కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్ భట్ స్వాగతం పలికారు.
ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి ఆపరేషన్ గంగాను ముమ్మరంగా కొనసాగిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆపరేషన్ గంగలో భాగంగా ఇప్పటివరకు 6400 మంది భారతీయులు ఉక్రెయిన్ నుంచి తిరిగివచ్చారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో రెండు మూడు రోజుల్లో 7400 మంది భారతీయులు స్వదేశానికి తీసుకురానున్నామని తెలిపింది. మొత్తంగా ఇప్పటివరకు 18 వేల మంది భారతీయులు ఉక్రెయిన్‌ను వీడారని అధికారులు పేర్కొన్నారు. ఇంకా భారీ సంఖ్యలో భారతీయులు ఉక్రెయిన్ లోని ఉండిపోయారనీ, వారి రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భారతీయుల తరలింపునకు 30 విమాన సర్వీసులు నడుపుతున్నామని పేర్కొన్న అధికారులు.. ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి వారిని తరలిస్తున్నామని వెల్లడించారు. రానున్న 24 గంటల్లో 18 విమానాలు భారత్‌కు చేరుతాయని తెలిపారు.
ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరిగిన అవి సఫలం కాలేదు. రష్యా మరింత దూకుడుగా ప్రదర్శిస్తుండటంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే శాంతియుతంగా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని చాలా దేశాలు కోరుతున్నాయి. అయినప్పటికీ రష్యా ఏమాత్రం పట్టించుకోకుండా దూకుడుగా ముందుకు సాగుతూ.. ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తోంది. దీంతో ఆగ్రహించిన చాలా దేశాలు ఆ దేశంపై ఆంక్షల విధింపును పెంచుతున్నాయి. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, పలు యూరప్ దేశాలు ఆంక్షలు విధించాయి. మరిన్ని ఆంక్షల దిశగా ముందుకు సాగుతున్నాయి. ఈ యుద్ధం కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు, సైనికులు ప్రాణాలు కోల్పోయారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. రష్యా దాడి కారణంగా ఉక్రెయిన్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.