పాలస్తినాకు చెందిన హమాస్ ఉగ్రవాద సంస్థ దాడులతో అలజడిగా వున్న ఇజ్రాయెల్ నుండి భారతీయుల తరలింపు ప్రారంభమయ్యింది. ఆపరేషన్ అజయ్ లో భాగంగా 220 మంది ప్రయాణికులతో తొలి ప్లైట్ న్యూడిల్లీకి చేరుకుంది.
న్యూడిల్లీ : ఇజ్రాయెల్, పాలస్తినాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్ కు మధ్య భీకర యుద్దం జరుగుతోంది. దీంతో ఇరు దేశాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని భయానక పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఉన్నత చదువులు, ఉపాధి కోసం ఈ దేశాలకు వెళ్ళిన భారతీయులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. వీరిని సురక్షితంగా ఇండియాకు ఎయిర్ లిప్ట్ చేసేందుకు మోదీ సర్కార్ సిద్దమయ్యింది. ఇలా 'ఆపరేషన్ అజయ్' పేరిట ముందుగా ఇజ్రాయెల్ లోని భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియ ప్రారంభమయ్యింది.
గురువారం సాయంత్రం ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ విమానాశ్రయం నుండి 220మందికి పైగా భారతీయులను తీసుకుని మొదటి విమానం బయలుదేరింది. చాలా కుటుంబాలు పిల్లాపాపలతో కలిసి ఈ విమానంలో ఇండియాకు బయలుదేరారు. శుక్రవారం ఉదయం భారత రాజధాని న్యూడిల్లీకి చేరుకుంది ఈ ప్రత్యేక విమానం. భయానక పరిస్థితుల నుండి సురక్షితంగా బయటపడి స్వదేశానికి చేరుకున్న కొందరు భారతీయులు ఉద్వేగానికి లోనయ్యారు.
ఇజ్రాయెల్ నుండి బయలుదేరిన భారతీయులు విమానంలో భారత్ మాతా కీ జై, వందేమాతరం నినాదాలతో హోరెత్తించారు. తమను సురక్షితంగా కాపాడిన కేంద్ర ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
వీడియో
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఇజ్రాయెల్ నుండి వచ్చిన ప్రయాణికులకు స్వాగతం పలికారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్న మంత్రి క్షేమంగా స్వస్థలాలకు వెళ్లాలని సూచించారు. ఇలా స్వదేశానికి చేరుకున్న వారితో విమానాశ్రయంలో ఫోటో దిగారు కేంద్ర మంత్రి చంద్రశేఖర్.
ఇదిలావుంటే ఇజ్రాయెల్‌లో సుమారు 18 వేల మంది వరకు భారతీయులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీరందరినీ సురక్షితంగా ఇండియాకు తరలించే ఏర్పాట్లు చేసామని... ఆ దేశంలోని భారత దౌత్య కార్యాలయం వద్దకు వెళ్లి తమ పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్దతిలో అక్కడి నుంచి భారతీయులను ఇండియాకు ఆపరేషన్ అజయ్ కింద తీసుకువస్తామని తెలిపారు.
భారతీయులందరూ టెల్ అవిన్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ, అలాగే ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరింది. అలాగే ఇజ్రాయెల్ తో పాటు పాలస్తీనాలోని ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, స్థానిక అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని అధికారులు కోరారు. ఏదైనా సమస్య వస్తే రాయబార కార్యాలయం అత్యవసర నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం మాట్లాడారు. హమాస్ మిలిటెంట్లతో జరుగుతున్న యుద్ధం గురించి వివరించారు. ఈ సందర్భంగా హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలను మోడీ ఖండించారు. ఈ క్లిష్ట సమయంలో ఇజ్రాయెల్ కు మద్దతు ప్రకటించారు. అలాగే ఇజ్రాయెల్ లోని భారతీయ పౌరుల భద్రత, భద్రత అంశాన్ని ఆయన ప్రస్తావించారు.