న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మాథుర జిల్లాకు చెందిన యువతి కాజల్‌ను ఆమె గ్రామానికే చెందిన అనీష్ అనే యువకుడు గాఢంగా ప్రేమించాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమెను కోరాడు. కానీ, ఆమె తిరస్కరించింది. దీంతో తరుచూ ఆమె వెంట పడేవాడు. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆమెను బంధువుల ఇంటికి పంపించారు. ఇంతలో కాజల్ పెళ్లి కుదిరింది. పెళ్లికి నాలుగు రోజుల ముందు ఆమె మళ్లీ ఇంటికి వచ్చింది. అనీష్ మళ్లీ.. ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఒక వైపు పెళ్లి పనులు ప్రారంభం అయ్యాయి. కానీ, అనీష్ మాత్రం వెనుకడుగు వేయలేదు. తీరా కాజల్ పెళ్లి జరుగుతుండగా ఆమె ఇంటికి వెళ్లి షూట్ చేసి చంపేశాడు.
మాథుర జిల్లా నౌజ్‌హిల్ ఏరియాలోని ముబారిక్‌పూర్ గ్రామానికి చెందిన కాజల్‌ను వారి ఇంటికి సుమారు 400 మీటర్ల దూరంలో ఉండే అనీష్ అనే యువకుడు ఇష్టపడ్డాడు. కానీ, ఆమె ప్రేమను కాజల్ తిరస్కరించింది. బీఎస్సీ చదువుతున్న కాజల్‌ను అనీష్ తరుచూ తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఒత్తిడి చేసేవాడు. కానీ, ఆమె అంగీకరించలేదు. ఇటీవలే కాజల్‌కు పెళ్లి కుదిరింది. ఈ నెల 28వ తేదీన పెళ్లి. 24వ తేదీన ఆమె బంధువుల ఇంటి నుంచి తిరిగి తన ఇంటికి వచ్చింది. 28వ తేదీన పెళ్లి జరిగింది. నోయిడా నుంచి బారత్ ముగించుకున్న ఆ జంట కాజల్ ఇంటికి చేరే సమయానికి రాత్రి అయింది. రాత్రి సుమారు ఒంటి గంటకు వధువు, వరుడు వరమాలలు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలోనూ వధువు నవ్వులు చిందిస్తూ కనిపించింది. ఆ తర్వాత వధువు కాజల్‌ను తోటి ఆడపడుచులు ఫ్రెష్ కావడానికి గదిలోకి తీసుకెళ్లారు.
ఈ కార్యక్రమం జరుగుతుండగానే నలుగురు యువకులు వీరంగం చేశారు. బారాత్‌పై రాళ్లు విసిరారు. వరుడినీ వారు బెదిరించారు. కానీ, అక్కడున్న వారు బెదిరించడంతో ఆ దుండగులు పరుగు తీశారు. దీంతో ఒక్కసారిగా అలజడి రేగింది. ఒక్కసారిగా పెళ్లి పెద్దలు, బంధువులు అటువైపుగా పరుగులు తీశారు. ఆ దుండగులను పట్టుకోవడానికి వెళ్లారు. ఈ అలజడి విని కాజల్‌తోపాటుగా ఉన్న యువతులూ గదిలో నుంచి బయటకు పరుగులు తీశారు.
ఇదే అదునుగా మాటు వేసి ఉన్న అనీష్ కాజల్ ఉన్న గదిలోకి వెళ్లాడు. తుపాకీ తీసి ఆమె కంటిపై కాల్చాడు. ఆమె ఉన్నపళంగా నేలకూలిపోయింది. అనీష్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ బుల్లెట్ శబ్దం విని బంధువులు అంతా పరుగున కాజల్ ఉన్న గదికి వచ్చారు. అప్పటికే ఆమె రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్నది. వెంటనే ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానీ, అప్పటికే సమయం మించి పోయింది. కాజల్ మరణించింది.