పంద్రాగస్టున భారత్‌తోపాటు స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే దేశాలివే..!

By telugu teamFirst Published Aug 14, 2021, 6:34 PM IST
Highlights

ఆగస్టు 15న భారత్‌తో పాటు మరో ఐదు దేశాలు కూడా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటాయి. బహ్రెయిన్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, లీచ్‌టెయిన్‌స్టెయిన్, దక్షిణ కొరియా, ఉత్తర కొరియాలు ఇదే రోజున ఇండిపెండెన్స్ డే ఉత్సవాలు జరుపుకుంటాయి.

న్యూఢిల్లీ: భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఉత్సాహం మొదలైంది. దేశమంతా ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధమైంది. 200 ఏళ్లపాటు పాలించిన బ్రిటన్‌ నుంచి దేశానికి స్వాతంత్ర్యం తేవడానికి జరిగిన సుదీర్ఘ సంగ్రామంలో ఎంతో మంది యోధులు తమ ప్రాణాలు బలిదానాలిచ్చారు. ఎట్టకేలకు 1947 ఆగస్టు 15న భారత్‌ను బ్రిటన్లు వీడారు. పోతుపోతూ దేశాన్ని భారత్, పాకిస్తాన్‌లుగా విడగొట్టి వెళ్లారు. ఆగస్టు 15న మనదేశంతోపాటు మరో ఐదు దేశాలు స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించుకుంటాయి. ఆ దేశాలేవో చూద్దామా..

బహ్రెయిన్:
ఆగస్టు 15వ తేదీనే బ్రిటన్‌ల నుంచి గల్ఫ్ దేశం బహ్రెయిన్ కూడా స్వాతంత్ర్యం పొందింది. 1971 ఆగస్టు 15న బహ్రెయిన్‌కు స్వాతంత్ర్యం లభించింది. ఆ సంవత్సరం బహ్రెయిన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుని బ్రిటీషర్లతో ఫ్రెండ్‌షిప్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వాస్తవానికి బహ్రెయిన్ ఆగస్టు 14న స్వాతంత్ర్యం పొందిందని అంటుంటారు. కానీ, ఆగస్టు 15వ తేదీనే ఆ దేశం స్వాతంత్ర్య దినోత్సవంగా గుర్తించింది. గల్ఫ్‌లో ఆయిల్‌ను కనుగొని రిఫైనరీని (1931లో)నిర్మించిన తొలి దేశం బహ్రెయినే కావడం గమనార్హం.

రిపబ్లిక్ ఆఫ్ కాంగో:
ఆగస్టు 15న రిపబ్లిక్ ఆఫ్ కాంగో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 1960లో ఫ్రాన్స్ నుంచి ఈ దేశం సంపూర్ణ స్వాతంత్ర్యాన్నిపొందింది. 80ఏళ్లు ఫ్రాన్స్ ఈ దేశాన్ని పాలించింది. 1969 నుంచి కాంగో మార్క్సిస్టు-లెనినిస్టు దేశంగా ఉన్నప్పటికీ 1992 తర్వాత బహుళ పార్టీలతో ఎన్నికలు నిర్వహిస్తున్నది.

లీచ్‌టెన్‌స్టెయిన్:
1940 నుంచి లీచ్‌టెన్‌స్టెయిన్ ఇదే తేదీన జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నది. 1990లో ఆగస్టు 15న నేషనల్ హాలిడేగా అధికారికంగా గుర్తించారు. ఇందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి, అది అప్పటికే బ్యాంక్ హాలిడే. మరొకటి, 1940లో పాలిస్తున్న రాజకుమారుడి పుట్టిన రోజు. 1989లో ఆ రాజు మరణించిన తర్వాత ఇదే ఆనవాయితీ కొనసాగుతున్నది. ఈ రోజున వేలాది మంది దేశ పౌరులు ప్రిన్స్, ప్రెసిడెంట్ ప్రసంగాలను వాండూజ్ క్యాజిల్‌కు హాజరై ఆలకిస్తుంటారు.

దక్షిణ, ఉత్తర కొరియాలు:
దక్షిణ, ఉత్తర కొరియాలూ ఆగస్టు 15వ తేదీనే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరపుకుంటాయి. 1945 నుంచి 35ఏళ్లు జపాన్ పాలనలోనే కొరియా ఉన్నది. నేషనల్ లిబరేషన్ డే ఆఫ్ కొరియా పేరిట ఇరు దేశాలు ఇదే రోజున పబ్లిక్ హాలీడేను పాటిస్తాయి. 1945లో జపాన్ రెండో ప్రపంచ యుద్ధంలో లొంగిపోయిన తర్వాత కొరియాకు స్వాతంత్ర్యం లభించింది. అనంతరం మూడేళ్ల తర్వాత కొరియా రెండుగా చీలిపోయింది. సోవియెట్ మద్దతున్న ఉత్తర కొరియాగా, యూఎస్ మద్దతున్న దక్షిణ కొరియాలుగా విడిపోయాయి.

click me!