అమిత్ షా ఏమైనా రామమందిర  పూజారా? : మందిర నిర్మాణ ప్రకటనపై పవార్ ఫైర్  

By Rajesh KarampooriFirst Published Jan 8, 2023, 11:09 PM IST
Highlights

రామమందిర నిర్మాణ ప్రకటనలు, ఇతర విషయాలు హోంశాఖ పరిధిలోకి రావని, అయినా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా .. ఇలాంటి ప్రకటన ఎలా చేస్తారని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ మండిపడ్డారు. రామాలయ పూజారి పాత్రను అమిత్ షా వ్యవహరిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.  

అమిత్ షాపై శరద్ పవార్ ఫైర్: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ తేదీలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా  ప్రకటించడంపై విపక్షలు విమర్శలు గుప్పిస్తున్నాయి.  ఇప్పటికే ఈ విషయంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే.. కేంద్రమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.రామ మందిర ప్రారంభోత్సవ తేదీలను ప్రకటించడంలో హోంమంత్రి అర్హతలేంటనీ ప్రశ్నించారు.

తాజాగా.. ఈ విషయంపై ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ మండిపడ్డారు. రామ మందిర నిర్మాణ తేదీని ప్రకటించడం హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి రాదని, ఆలయ అధికారుల పరిధిలోకి వస్తుందని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. అయినప్పటికీ అమిత్ షా ఈ ప్రకటన ఎలా చేస్తారని నిలదీశారు. బహుశా మంత్రి అమిత్ షా రామాలయ పూజారిగా చేరి ఉంటారని, అందుకే ఈ ప్రకటన చేసి ఉంటారని పవార్ విమర్శలు గుప్పించారు.  

ఇంతకీ ఏం జరిగింది..? 

త్రిపురలో  గురువారం (జనవరి 6) నాడు బీజేపీ నిర్వహించిన ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ..  వచ్చే ఏడాది జనవరి 1 నాటికి అయోధ్యలో రామమందిరం సిద్ధమవుతుందని ప్రకటించారు. ఈ సమయంలో కాంగ్రెస్ మాజీ అధినేత రాహుల్ గాంధీపై విరుచుకుపడిన అమిత్ షా.. 'రాహుల్ గాంధీ వినండి.. జనవరి 1, 2024 నాటికి రామమందిరం ప్రారంభానికి  సిద్ధమవుతుందని అన్నారు.వచ్చే ఏడాది జనవరి నాటికి రామమందిరాన్ని తెరుస్తామని అమిత్ షా ప్రకటించారు. ఈ ఏడాది చివరి నాటికి వివిధ దశల్లో ఉన్న నిర్మాణ పనులు పూర్తవుతాయని, ఆ  దిశగా ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికే చాలావరకు రామాలయం పనులు పూర్తయ్యాయని అన్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించడంతో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.  

అమిత్ షా ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ కౌంటర్ 

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటనపై  కాంగ్రెస్ పార్టీ చీఫ్ మండిపడ్డారు. ఈ క్రమంలో ఖర్గే ప్రసంగిస్తూ.. అమిత్ షా దేశ భద్రతకు బదులు దేవాలయాల గురించి మాట్లాడుతున్నారని ఆరోపించారు.రామమందిర మహంత్ మీరేనా (అమిత్ షా?) అంటూ ప్రశ్నించారు. త్రిపురలో ఎన్నికలు జరుగుతున్నాయి.. అమిత్ షా అక్కడికి వెళ్లి రామమందిరం నిర్మిస్తున్నారని, దాని ప్రారంభోత్సవం 2024 జనవరి 1న అన్నారు. అందరికీ దేవుడిపై నమ్మకం ఉంది, కానీ ఎన్నికల సమయంలో ఎందుకు ప్రకటిస్తున్నారు? అని నిలాదీశారు. 

రామ మందిరానికి మహంత్ మీరేనా? అని ప్రశ్నించారు. మందిర విషయంలో మహంతులు, సాధువులను మాట్లాడనివ్వండి. గుడి ప్రారంభోత్సవం గురించి మాట్లాడటానికి మీరు( అమిత్ షా) ఎవరు? మీరు రాజకీయవేత్త. దేశాన్ని సురక్షితంగా ఉంచడం మీ పని, శాంతిభద్రతలను నిర్వహించండి, ప్రజలకు ఆహారాన్ని అందించండి, రైతుల పంటకు గిట్టుబాటు ధర అందించండని విమర్శించారు.

దేశంలో శాంతిభద్రతలకు భంగం కలిగించకుండా .. చాలా జాగ్రత్త వహించాలనీ, ప్రజలకు ఉపాధి కల్పిస్తామన్న కేంద్రం విఫలమైందని ఆరోపించారు. రాహుల్ గాంధీ .. దేశంలోని ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై రాహుల్ గాంధీ పోరాడుతున్నాడనీ, నరేంద్రమోడీ ప్రధాని అయినప్పటి నుంచి, అమిత్ షా హోంమంత్రి అయినప్పటి నుంచి ఎన్నికలలో మాత్రమే బిజీగా ఉన్నారని ఆరోపించారు. వారు ఇతర రాజకీయ పార్టీలను నాశనం చేస్తారనీ, వారిని ఎదురించే వారిపై ఈడీ, ఇతర ఏజెన్సీలను దాడులు చేస్తున్నారని ఆరోపించారు.  

click me!