
చెన్నై: కరోనా మహమ్మారి ఇంకా ప్రపంచాన్ని పట్టి పీడిస్తూనే ఉన్నది. దాని రంగులు మారుస్తూ సరికొత్త రూపాల్లో భయపెడుతూనే ఉన్నది. తాజాగా, ఒమిక్రాన్ ఉపవేరియంట్ బీఏ.4 కేసు హైదరాబాద్‌లో నమోదైంది. దక్షిణాఫ్రికా, యూరప్ దేశాలను వణికిస్తున్న ఈ వేరియంట్ మన దేశంలో తొలిసారి హైదరాబాద్ నగరంలో నమోదైంది. రెండో కేసు తమిళనాడులో వెలుగులోకి వచ్చినట్టు తాజాగా వైద్యాధికారులు వెల్లడించారు. తమిళనాడులో తొలి, దేశంలో రెండో బీఏ.4 సబ్ వేరియంట్ కేసు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మా
సుబ్రమణియన్ శనివారం (మే 21) ధ్రువీకరించారు. చెన్నైకి 30 కిలోమీటర్ల దూరంలో చెంగల్పట్టు జిల్లాకు చెందిన నవలూరు నివాసికి ఈ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ సోకింది.
కాగా, ఈ వేరియంట్ తొలి కేసు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నమోదైనట్టు శుక్రవారం అధికారులు వెల్లడించారు. దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాద్ ఎయిర్ పోర్టు చేరుకున్న ఓ వ్యక్తికి కరోనా పరీక్షలు చేయగా.. బీఏ.4 ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కేసు ఉన్నట్టు తేలిందని వివరించారు. వెంటనే ఆ వ్యక్తి కాంటాక్టులను కనుగొనడంలో అధికారులు మునిగిపోయారు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఆ వ్యక్తిలో కరోనా లక్షణాలేవీ లేవని అధికారులు చెప్పారు. ఆయన శాంపిల్‌ను మే 9వ తేదీన సేకరించినట్టు వివరించారు.
ఈ కేసుపై సోమవారం అంటే మే 23వ తేదీన ఇండియాన్ సార్స్ కోవ్ 2 జీనోమిక్స్ కన్సార్షియం (ఇన్సాకాగ్) ఓ బులెటిన్ విడుదల చేయనుంది.
బీఏ.4 వేరియంట్ తొలిసారిగా దక్షిణాఫ్రికాలో ఈ ఏడాది జనవరి 10వ తేదీన కనుగొన్నారు. ఆ తర్వాత ఈ వేరియంట్ దక్షిణాఫ్రికాలోని అన్ని ప్రావిన్సుల్లో కనిపించింది. అయితే, బీఏ.4, బీఏ.5 వేరియంట్లకు ప్రత్యేకంగా కొత్త లక్షణాలు ఉన్నట్టు తెలియరాలేదు. ఈ వేరియంట్ అధిక తీవ్రతను కలిగి ఉంటుందని చెప్పడానికీ ఆధారాలు లేవు. అయితే, శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం, ఈ కొత్త వేరియంట్లు మానవ రోగ నిరోధక శక్తిని మభ్యపెట్టి తప్పించుకునే సామర్థ్యం కలిగి ఉన్నట్టు తెలుస్తున్నది.