Odisha Train Accident: ప్రమాదానికి బాధ్యులైన వ్యక్తులను గుర్తించాం.. రైల్వే మంత్రి కీలక వ్యాఖ్యలు..

Published : Jun 04, 2023, 01:04 PM IST
Odisha Train Accident: ప్రమాదానికి బాధ్యులైన వ్యక్తులను గుర్తించాం.. రైల్వే మంత్రి కీలక వ్యాఖ్యలు..

సారాంశం

ఒడిశాలోని బాలాసోర్‌లో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాద ఘటనకు సంబంధించి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అశ్విని వైష్ణవ్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. ఎలక్ట్రానింగ్ ఇంటర్‌లాకింగ్‌లో మార్పు కారణంగా ప్రమాదం సంభవించిందని చెప్పారు.

ఒడిశాలోని బాలాసోర్‌లో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాద ఘటనకు సంబంధించి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అశ్విని వైష్ణవ్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. ఎలక్ట్రానింగ్ ఇంటర్‌లాకింగ్‌లో మార్పు కారణంగా ప్రమాదం సంభవించిందని చెప్పారు. రైల్వే భద్రతా విభాగ కమిషనర్ ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై విచారణ జరిపారని తెలిపారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తులను గుర్తించినట్టుగా చెప్పారు. ‘‘ఇది వేరే విషయం. ఇది పాయింట్ మెషీన్, ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ గురించి. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సమయంలో సంభవించిన మార్పు.. దాని వల్ల ప్రమాదం జరిగింది. సరైన విచారణ తర్వాత ఎవరు చేసారో, ఎలా జరిగిందో తెలుస్తుంది’’ అని అశ్విని వైష్ణవ్ తెలిపారు. 

ప్రమాద స్థలంలో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు. బుధవారం ఉదయానికి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని అన్నారు. ‘‘రైల్వే భద్రతా కమిషనర్ ఈ విషయంపై దర్యాప్తు చేశారు. దానిపై నేను వ్యాఖ్యానించడం సరికాదు. విచారణ నివేదిక రావాలి. కానీ ప్రమాదానికి కారణం గుర్తించబడింది. దానికి కారణమైన వ్యక్తులను గుర్తించారు. వాస్తవానికి ఇప్పుడు మా దృష్టి పునరుద్ధరణపై ఉంది. రెండు ప్రధాన లైన్లు, రెండు లూప్ లైన్లు ఉన్నాయి. పని జరుగుతోంది. మేము ఖచ్చితంగా నిర్దేశించుకున్న లక్ష్యం బుధవారం ఉదయం కంటే ముందే పునరుద్ధరణ పూర్తి చేస్తాం’’ అని అశ్విని వైష్ణవ్ చెప్పారు. 

కవచ్ పరికరంతో ప్రమాదాన్ని నివారించవచ్చని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను కూడా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తోసిపుచ్చారు. ‘‘కవచ్‌తో దీనికి సంబంధం లేదు. కారణం మమతా బెనర్జీ నిన్న చెప్పినది కాదు. ఆమెకు ఉన్న అవగాహన ప్రకారం ఆమె చెప్పారు’’ అని అన్నారు. 

ఇక, శుక్రవారం సాయంత్రం బాలాసోర్ జిల్లాలోని బహనాగా బజార్ స్టేషన్‌ సమీపంలో మూడు వేర్వేరు ట్రాక్‌లపై బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ప్రమాదానికి గురయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం.. రైలు ప్రమాదం‌లో 288 మంది ప్రాణాలు కోల్పోగా.. 1,000 మందికి పైగా గాయపడ్డారు. రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం.. పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రైల్వే శాఖ ప్రకారం.. ప్రమాద స్థలంలో పునరుద్ధరణ ప్రక్రియను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

ఇక, ఒడిశాలోని బాలాసోర్‌లో యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని అశ్విని వైష్ణవ్ ఈరోజు తెల్లవారుజామున చెప్పారు. శనివారం ఉదయం నుంచి అశ్విని  వైష్ణవ్ ప్రమాద స్థలంలోనే ఉన్నారు. అక్కడ చేపట్టిన సహాయక చర్యలు, పునరుద్దరణ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Space War: పాకిస్థాన్ మరో కుట్ర.. 16 నెలల్లో 6 శాటిలైట్లు.. భారత్‌పై చైనా సాయంతో నిఘా !
ప్రముఖ దర్శకుడు భారతీరాజా ఇకలేరు | Indian Cinema Legend Bharathiraja Passes Away| Asianet Telugu