
Nupur Sharma News: మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను అరెస్ట్ చేయాలంటూ... దాఖలైన పిటిషన్‌ను తక్షణమే విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ముందు లేవనెత్తింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ పిటిషనర్ అభ్యర్థనతో అసంతృప్తికి గురైంది. రిజిస్ట్రార్‌తో ఈ అంశాన్ని చేపట్టాలని కోరింది.
మహమ్మద్ ప్రవక్త గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మను అరెస్ట్ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను న్యాయమూర్తులు ఇందిరా బెనర్జీ, జేకే మహేశ్వరిలతో కూడిన వెకేషన్ బెంచ్ ముందుకు బుధవారం నాడు విచారణకు వచ్చింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. దీనిపై వెకేషన్ బెంచ్.. కోర్టు ముందు హాజరుపరచాల్సిన అవసరం ఏముందని న్యాయవాదిని ప్రశ్నించింది. దానిని రిజిస్ట్రార్ ముందు హాజరుపరచాలని సూచించింది.
పిటిషన్ వాదనలు విన్న వెకేషన్ బెంచ్.. అత్యవసర విచారణకు నిరాకరించింది. లిస్టింగ్ కోసం రిజిస్ట్రార్ ముందు హాజరుపరచాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అంతకుముందు జూలై 1న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జెబి పార్దివాలా ధర్మాసనం.. నూపుర్ శర్మపై విరుచుకుపడింది. దేశంలో జరుగుతున్న ఉద్రిక్తతలకు ఆమెనే బాధ్యురాలని పేర్కొంది. ఆ సమయంలో వెకేషన్ బెంచ్ నూపుర్ శర్మ వ్యాఖ్యల కారణంగా దేశ సామాజిక నిర్మాణం ప్రమాదంలో పడిందని, ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్యాలాల్ దారుణ హత్యకు కారణమని పేర్కొంది.
ఇదిలా ఉంటే.. నూపుర్ శర్మ పిటిషన్ విచారణలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్దీవాలా చేసిన వ్యాఖ్యలు లక్ష్మణ రేఖను దాటాయని పలువురు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మేరకు 117 మంది ప్రముఖులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు బహిరంగ లేఖ రాశారు.
వారిలో 15 మంది మాజీ న్యాయమూర్తులు కాగా.. 77 మంది మాజీ ఉన్నతాధికారులు, అలాగే.. మరో 25 మంది ఆర్మీ మాజీ అధికారులు. వారి లేఖలో నూపుర్‌శర్మ లేవనెత్తిన అంశాలకు.. జడ్జిలు చేసిన వ్యాఖ్యలకు.. చట్ట ప్రకారం ఎలాంటి సంబంధం లేదని, గతంలో ఎన్నడూ లేని విధంగా.. న్యాయమూర్తులు నిబంధనలనూ అతిక్రమించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. వేరే రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను బదిలీ చేసే అధికారం గానీ, వాటిని ఒకటిగా చేసే అధికారం గానీ హైకోర్టులకు లేదనే స్పష్టం చేశారు.
హైకోర్టుకు వెళ్లాలని సూచించిందంటూ ధ్వజమెత్తారు. ‘‘రాజ్యాంగం ప్రకారం అన్ని వ్యవస్థలూ తమ విధులు నిర్వర్తిస్తేనే ఏ దేశ ప్రజాస్వామ్యమైనా చెక్కుచెదరకుండా ఉంటుందని నమ్మే బాధ్యులైన పౌరులం మేము. ఇటీవల సుప్రీంకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు లక్ష్మణరేఖను దాటాయి. అందుకే మేం ఈ బహిరంగ ప్రకటన విడుదల చేయాల్సి వస్తోంది. నూపుర్‌శర్మ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్దీవాలా మునుపెన్నడూ లేనివిధంగా చేసిన దురదృష్టకర వ్యాఖ్యలు దేశంలోపల, వెలుపల అందరినీ దిగ్ర్భాంతికి గురిచేశాయి. వారు చేసిన వ్యాఖ్యలకు న్యాయవ్యవస్థలో ఏ విధంగానూ స్థానం లేదు. ఆ వ్యాఖ్యలు న్యాయవ్యవస్థలోని అన్ని నిబంధనలనూ అతిక్రమించినట్టుగా పిటిషన్‌తో సంబంధం లేకుండా.. నూపుర్‌శర్మను దోషిగా నిర్ధారిస్తూ న్యాయనిర్ణయం చేసినట్లుగా ఉన్నాయి.
దేశంలో ప్రస్తుత పరిస్థితులకు నూపుర్ శర్మనే పూర్తి బాధ్యురాలని సుప్రీం కోర్టు వ్యాఖ్యలకు ఎలాంటి హేతుబద్ధతా లేదనీ, ఈ వ్యాఖ్యల ద్వారా ఉదయ్‌పూర్‌లో జరిగిన హత్య కేసులో నిందితులకు వర్చువల్‌గా నిర్దోషిత్వాన్ని ప్రసాదించినట్టు ఉందనీ, ఎఫ్‌ఐఆర్ దాఖలైతే అరెస్టు ఎందుకు చేయలేదంటూ ధర్మాసనం చేసిన వ్యాఖ్యలతో న్యాయసమాజం తీవ్ర దిగ్భ్రాంతికి గురైందని లేఖలో పేర్కొన్నారు.