ప్రవక్తపై వ్యాఖ్యల నేపథ్యంలో చంపేస్తామని బెదిరింపులు.. నుపుర్ శర్మకు గన్ లైసెన్స్ జారీ..

By Sumanth KanukulaFirst Published Jan 12, 2023, 1:52 PM IST
Highlights

మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమెకు అధికారులు గన్ లైసెన్స్ జారీ చేశారు.
 

మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. నుపుర్ శర్మ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగిన నేపథ్యంలో బీజేపీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే పెద్ద ఎత్తున బెదిరింపులు వస్తున్న క్రమంలో.. తాజాగా నుపుర్ శర్మకు గన్ లైసెన్స్ జారీ చేయబడింది. తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ నుపుర్ శర్మ గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో ఢిల్లీ పోలీసు అధికారులు అధికారులు ఈ నిర్ణయం తీసుకనున్నారు. ఆమె తన వెంట పర్సనల్ గన్ కలిగి ఉండేందుకు లైసెన్స్ మంజూరు చేశారు. 

2022 మే 26న నుపుర్ శర్మ ఒక టీవీ చర్చ సందర్భంగా మహ్మద్ ప్రవక్త గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో హింసాత్మక ప్రదర్శనలకు దారితీసింది. ఆమెను వెంటనే అరెస్టు చేయాలని పలువురు డిమాండ్ చేశారు. ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఆమె తల నరికివేస్తానని బెదిరింపులు కూడా వచ్చాయి. కొన్ని ఇస్లామిక్ దేశాలు కూడా నుపుర్ శర్మ వ్యాఖ్యను ఖండిస్తూ ప్రకటనలు జారీ చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. 

అయితే ఆ తర్వాత నుపుర్ శర్మ వివాదాస్పద ప్రకటనను ఉపసంహరించుకున్నారు. ఎవరి మతపరమైన భావాలను దెబ్బతీయడం తన ఉద్దేశ్యం కాదని ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు నుపుర్ శర్మ ప్రకటనను సమర్ధించిన వారిని కూడా తల నరికేస్తానని బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలోనే అమరావతిలో 54 ఏళ్ల రసాయన శాస్త్రవేత్తను గొంతుకోసి హత్య చేశారు. సోషల్ మీడియాలో నూపుర్ శర్మకు మద్దతు ఇచ్చినందుకు ఉదయపూర్‌లోని తన దుకాణంలోకి ప్రవేశించే ముందు ఒక టైలర్ నరికి చంపబడ్డాడు. 

ఇదిలా ఉంటే.. మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు నుపుర్ శర్మపై దేశంలోని పలు ప్రాంతాల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబడ్డాయి. నుపుర్ శర్మకు బెదిరింపులు రావడంతో ఈ విషయాన్ని ఆమె న్యాయవాదులు సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే 2022 ఆగస్టులో  సుప్రీంకోర్టు నూపుర్ శర్మకు ప్రాణహాని ఉందని గుర్తించింది. తనపై నమోదైన పోలీసు కేసులన్నింటినీ కలిపివేయాలని నుపుర్ శర్మ చేసుకున్న విజ్ఞప్తి పట్ల సుప్రీంకోర్టు సమ్మతి తెలిపింది. ఆమెపై కేసులు నమోదైన అన్ని రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆమెపై ఉన్న అన్ని కేసులను కలిపి ఢిల్లీకి బదిలీ చేయాలని ఆదేశించింది. 

click me!