జమ్ము కశ్మీర్‌లో నాన్ లోకల్స్ కూడా ఓటేయవచ్చు.. సుమారు 20 లక్షల కొత్త ఓటర్లు!.. బీజేపీకి లబ్ది అని విమర్శలు

By Mahesh KFirst Published Aug 18, 2022, 2:01 PM IST
Highlights

జమ్ము కశ్మీర్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నాన్ లోకల్స్ కూడా ఓటు వేసే అవకాశాలు ఉన్నాయి. స్పెషల్ రివిజన్ తర్వాత తుది ఓటర్ల జాబితాలో కొత్తగా 20 లక్షల నుంచి 25 లక్షల మంది కొత్త ఓటర్లు చేరే అవకాశాలు ఉన్నాయని ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు. ఇందులో కశ్మీరేతరులూ ఉంటారని వివరించారు.

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లో కొత్తగా నాన్  లోకల్స్ కూడా ఓటు వేసే అవకాశం ఉన్నది. కొత్తగా 20 లక్షల నుంచి 25 లక్షల వరకు కొత్త ఓటర్లు చేరే అవకాశం ఉన్నదని జమ్ము కశ్మీర్ అధికారులు చెబుతున్నారు. ఆర్టికల్ 370 రద్దుతో ఈ మార్పు సాధ్యం అయింది. కాగా, ఈ మార్పులను జమ్ము కశ్మీర్ మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలు తీవ్రంగా వ్యతిరేకించారు

జమ్ము కశ్మీర్‌లో ఎన్నికైన ప్రభుత్వం లేక నాలుగేళ్లు గడిచింది. వచ్చే ఏడాది కొత్తగా ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019లో కేంద్ర ప్రభుత్వం జమ్ము కశ్మీర్ విషయమై కీలక నిర్ణయాలు తీసుకుంది. జమ్ము కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్ము కశ్మీర్, లడాఖ్‌లుగా విడగొట్టింది. 

ఆర్టికల్ 370 రద్దు తర్వాత చేపడుతున్న స్పెషల్ రివిజన్‌తో నాన్ లోకల్స్‌ కూడా జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వీలు కలుగుతున్నది. జమ్ము కశ్మీర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ హిర్దేశ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ, ఈ ప్రత్యేక రివిజన్‌ తర్వాత జమ్ము కశ్మీర్ ఓటర్ జాబితాలో కొత్తగా 20 లక్షల వరకు చేరవచ్చని అంచనా వేశారు. ఇందులో కశ్మీరేతరులూ ఉంటారని వివరించారు. జమ్ము కశ్మీర్ రీజియన్‌లో ఇప్పటికి సుమారు 76 లక్షల ఓటర్లు ఉన్నారు. ఈ రివిజన్‌తో మొత్తం ఓటర్ల సంఖ్య కోటికి చేరువ అవ్వొచ్చని తెలుస్తున్నది.

ఆర్టికల్ 370 రద్దుతో అంతకు ముందు కశ్మీర్‌లో ఓటు వేయలేకపోయిన వారు కూడా ఇప్పుడు ఓటు వేయచ్చని ఆయన తెలిపారు. తుది జాబితాలోకి కొత్తగా 20 లక్షల నుంచి 25 లక్షల మంది ఓటర్లు చేరవచ్చని అన్నారు. ఇందులో నాన్ కశ్మీరీలు కూడా ఉంటారని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లాగే ఎవరు అక్కడ నివసిస్తున్నా.. ఓటరు కార్డు పొంది ఓటు వేసే అర్హతను కలిగి ఉండొచ్చని చెప్పారు.

కాగా, ఈ మార్పును జమ్ము కశ్మీర్ ప్రధాన పార్టీలైన పీడీపీ, ఎన్‌సీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ నిర్ణయం కేవలం బీజేపీ లబ్ది కోసం తీసుకున్నదని ఆరోపించాయి.

నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ, ఈ నిర్ణయం బీజేపీ ఇన్‌సెక్యూరిటీ నుంచి వచ్చిందని తెలిపారు. జమ్ము కశ్మీర్ వాస్తవ ఓటర్ల నుంచి మద్దతు పొందలేమని బీజేపీ భయాల నుంచే ఈ నిర్ణయం వచ్చిందని, అందుకే తాము సీట్లు గెలుచుకోవడానికి తాత్కాలిక ఓటర్లను తెస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు వచ్చాక ఈ ఆటలేవీ సాగవని, జమ్ము కశ్మీర్ ప్రజలు తగిన సమాధానం చెబుతారని పేర్కొన్నారు.

ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికే కశ్మీరేతరులను ఓటింగ్‌కు అర్హులను చేస్తున్నారని మెహబూబా ముఫ్తీ ఆరోపణలు చేశారు. బయటి నుంచి ఓటర్లను దిగుమతి చేసే కుట్ర అని పేర్కొన్నారు. జమ్ము కశ్మీర్‌ను ఉక్కు పిడికిళ్లతో పాలించాలని, కశ్మీరీలను అణగదొక్కాలనేదే బీజేపీ అసలు లక్ష్యం అని ఆరోపించారు.

click me!