కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో తవ్వకాలు చేపడతారా?.. కేంద్ర మంత్రి క్లారిటీ

By Mahesh KFirst Published May 22, 2022, 5:24 PM IST
Highlights

ఢిల్లీలోని కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో తవ్వకాలు జరపాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను కేంద్రం ఆదేశించినట్టు వచ్చిన వార్తలను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి ఖండించారు. ఆ కథనాల్లో వాస్తవం లేదని, తాము ఎలాంటి తవ్వకాలు జరపాలనీ ఏఎస్ఐకి ఆదేశాలు జారీ చేయలేదని స్పష్టం చేశారు.
 

న్యూఢిల్లీ: కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో తవ్వకాలు జరపడంపై వచ్చిన వార్తలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. తవ్వకాలు జరపడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో తవ్వకాలు జరపాలని ఇంకా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీ చేయలేదని వివరించారు.

వారణాసిలోని జ్ఞానవాపసి వివాదం తరహాలోనే కుతుబ్ మినార్‌ను కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించలేదని, రాజా విక్రమాదిత్యుడు నిర్మించాడని ఏఎస్ఐ మాజీ రీజనల్ డైరెక్టర్ దరమ్ వీర్ శర్మ పేర్కొన్నారు. అంతేకాదు, అ కాంప్లెక్స్‌లో హిందూ దేవుళ్ల విగ్రహాలు సైతం బయటపడ్డాయనే వాదనలు కొందరు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర సాంస్కృతి శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ మే 21న కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌ సందర్శించారు. ఆయన ముగ్గురు చరిత్రకారులు, నలుగురు ఏఎస్ఐ అధికారులు, పరిశోధకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగానే ఆయన కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో తవ్వకాలు జరపాలని ఏఎస్ఐ అధికారులను ఆదేశించినట్టు కథనాలు వచ్చాయి.

తాజాగా, ఆ కథనాల్లో వాస్తవం లేదని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఢిల్లీలోని కుతుబ్ మినార్‌ను కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించలేదని, రాజా విక్రమాదిత్య నిర్మించాడని మాజీ ఆర్కియాలజీ రీజనల్ డైరెక్టర్ ధరమ్‌వీర్ శర్మ ఇటీవలే వెల్లడించారు. అది కూడా సూర్యుడిని పరిశీలించడానికి ఈ నిర్మాణం చేపట్టారని వివరించారు.

ఇది అసలు కుతుబ్ మినారే కాదని, సన్ టవర్ (అబ్జర్వేటరీ టవర్) అని ఆర్కియాలజీ మాజీ అధికారి అన్నారు. ఈ కుతుబ్ మినార్‌ ను ఐదవ శతాబ్దంలో రాజా విక్రమాదిత్య నిర్మించాడని, కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించలేదని వివరించారు. ఇందుకు సంబంధించి తన దగ్గర అనేక ఆధారాలు ఉన్నాయని తెలిపారు. పురావస్తు శాఖ తరఫున ఆయన చాలా సార్లు టవర్‌ను సర్వే చేశాడు.

ఈ టవర్ 25 ఇంచుల మేరకు ఒక వైపు వంగి ఉంటుందని ఆయన వివరించారు. ఎందుకంటే.. ఈ కుతుబ్ మినార్ ద్వారా సూర్యుడిని పరిశీలించే వారని చెప్పారు. జూన్ 21న సొలస్టైజ్ నుంచి తప్పించుకోవడం కోసం కుతుబ్ మినార్‌ ను ఇలా ఒక వైపు వంగినట్టుగా నిర్మించారని పేర్కొన్నారు. ఇదే శాస్త్రీయమైన నిజం అని చెప్పారు.

అందుకే స్వతంత్రంగా కనిపించే ఈ కుతుబ్ మినార్‌కు సమీపంలోని మసీదుకు సంబంధం లేదని వవిరించాడు. కుతుబ్ మినార్ ద్వారం ఉత్తరం వైపు ఉంటుంది. రాత్రి వేళ్లల్లో ఆకాశంలో ధ్రువ నక్షత్రాన్ని చూడటానికి దీన్ని ఉపయోగించుకున్నారని చెప్పారు.

click me!