పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుంటే నో పెట్రోల్.. నో డీజిల్!.. 25వ తేదీ నుంచి అమలు

By Mahesh KFirst Published Oct 1, 2022, 2:34 PM IST
Highlights

ఢిల్లీలో పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుంటే వాహనాలకు పెట్రోల్, డీజిల్‌ను పోయరు. ఈ నెల 25వ తేదీ నుంచి  ఈ నిబంధన అమలు కానుందని ఢిల్లీ రవాణా మంత్రి గోపాల్ రాయ్ వివరించారు. శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో ఈ నిర్ణయాన్ని ఆయన ప్రకటించారు.
 

న్యూఢిల్లీ: శీతాకాలం సమీపిస్తున్నదంటే ఢిల్లీ వాసులు గజగజ వణికిపోతారు. చలికి కాదు.. కాలుష్యాన్ని వాయువులను పీల్చి ఎక్కడ ప్రాణాల మీదికి తెచ్చుకుంటామో అని. కొన్నాళ్లుగా చలి కాలం వచ్చిందంటే... ఢిల్లీ మొత్తాన్ని కాలుష్య దుప్పటి కప్పేస్తున్నది. కొన్నిసార్లు అయితే సూర్యుడు కూడా కనిపించకుండా అంతా మబ్బుగా కాలుష్యం పేరి ఉండటాన్ని చూశాం. కాలుష్య తీవ్రత ప్రమాదకరంగా పెరిగిందని ఎన్నోసార్లు హెచ్చరికలు వెలువడటాన్ని చూశాం. ఇందుకోసం కేజ్రీవాల్ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకున్నా.. అవి స్వల్ప పరిధి మేరకే ఫలితాలు ఇచ్చాయి. సరి, బేసి నంబర్ల వాహనాలకు వేర్వేరు రోజుల్లో అనుమతి ఇవ్వడం మొదలు పలు చర్యలు తీసుకున్నారు. కానీ, ఫలితాలు ఆశించిన మేరకు లభించలేవు. చలి కాలం సమీపిస్తుండటంతో తాజాగా అరవింద్ కేజ్రీవాల్ మరోసారి వాయు కాలుష్యంపై నజర్ పెట్టింది.

వాయు కాలుష్యం పై పోరాడటానికి అరవింద్ కేజ్రీవాల్ 15 పాయింట్ల యాక్షన్ ప్లాన్‌ను శుక్రవారం ప్రకటించారు. వాహనాల నుంచి వెలువడే కాలుష్యంపై తాము ప్రత్యేక శ్రద్ధ తీసుకోబోతున్నట్టు వివరించారు. పదేళ్ల దాటిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాల పొల్యుషన్ సర్టిఫికేట్లను స్ట్రిక్ట్‌గా తనిఖీలు చేస్తామని తెలిపారు. తనిఖీల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.  

శనివారం ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ కీలక ప్రకటన చేశారు. దేశ రాజధానిలో పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుండా వాహనాలు బయటకు రావొద్దని తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుంచి పొల్యూషన్ సర్టిఫికేట్ లేని వాహనాలకు పెట్రోల్ బంక్‌లలో ఇంధనం లభించదని స్పష్టం చేశారు. పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ లేకుంటే.. ఢిల్లీలోని ఫ్యుయెల్ స్టేషన్‌లు ఆ వాహనాలకు పెట్రోల్ లేదా డీజిల్ పోయరని ఆయన వివరించారు.

నగరంలో రవాణా శాఖ తనిఖీలను పెంచనుంది. పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుండా ప్రయాణించే వారు రూ. 10 వేల భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి, ఢిల్లీ ప్రయాణికులు పొల్యూషన్ కంట్రోల్‌ను దగ్గర బెట్టుకుని రోడ్డు ఎక్కాల్సి ఉంటుంది.

click me!