ABP-CVoter Exit Poll: గోవాలో 2017 ఫలితాలే రిపీట్? కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ.. రెండూ మెజార్టీకి దూరమే

Published : Mar 07, 2022, 08:13 PM ISTUpdated : Mar 07, 2022, 08:16 PM IST
ABP-CVoter Exit Poll: గోవాలో 2017 ఫలితాలే రిపీట్? కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ.. రెండూ మెజార్టీకి దూరమే

సారాంశం

గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఇంచుమించు 2017 రిజల్ట్ సీన్ రిపీట్ కాబోతున్నట్టు ఏబీపీ సీవోటర్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. కాంగ్రెస్ కూటమి, బీజేపీలు దాదాపు సమాన సీట్లు గెలుచుకున్నప్పటికీ మెజార్టీ మార్క్‌ను ఈ రెండు పక్షాలు అందుకోలేవని తెలిపింది. దీంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉన్నదని అంచనా వేసింది.  

న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్(Exit Polls) అంచనాల్లో తమదైన ముద్ర వేసుకున్న ఏబీపీ సీవోటర్ ఎగ్జిట్ పోల్(ABP-CVoter Exit Poll).. గోవా అసెంబ్లీ ఎన్నికల(Goa Assembly Elections) ఫలితాలను అంచనా వేసింది. ఈ సారి కూడా ఇంచుమించు 2017 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే రిపీట్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ఎగ్జిట్ పోల్ ప్రకారం, గోవా అసెంబ్లీ ఫలితాల్లో ఏ పార్టీ మెజార్టీ మార్క్ అందుకోదని స్పష్టం చేసింది. కానీ, ఈ సారి ఆప్, టీఎంసీలు ఫలితాల అనంతర రాజకీయాలను రసవత్తరం చేసే అవకాశం ఉన్నది. 

ఏబీపీ సీవోటర్ ఎగ్జిట్ పోల్ ప్రకారం, బీజేపీ, కాంగ్రెస్ కూటమి మధ్య పోటీ హోరాహోరీగా ఉన్నది. కాంగ్రెస్ కూటమి కంటే.. బీజేపీ కొంత ముందంజలో ఉన్నా మెజార్టీకి మాత్రం ఆమడ దూరంలోనే ఉండిపోతుంది. బీజేపీ 13 నుంచి 17 స్థానాల్లో విజయఢంకా మోగించనుంది. కాగా, కాంగ్రెస్ కూటమి 12 నుంచి 16 స్థానాలను తన ఖాతాలో వేసుకోనుంది. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో బోణీ కొట్టలేకపోయిన ఆప్ ఈ సారి 4 నుంచి 8 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది.

ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈ నెల 10వ తేదీన ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఏడు విడతల పోలింగ్‌తో ముగియగా.. ఉత్తరాఖండ్, గోవా అసెంబ్లీ ఎన్నికలు గత నెల 14వ తేదీన సింగిల్ ఫేజ్‌లో ముగిశాయి. గోవా అసెంబ్లీ ఎన్నికలు, రాజకీయ వివరాలు ఇలా ఉన్నాయి.

పర్యాటక రాష్ట్రంగా పేర్గాంచిన గోవాలో 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఏ పార్టీ లేదా కూటమి అయినా 21 సీట్లు సాధిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఫిబ్రవరి 14న జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం 79%గా నమోదైంది. అత్యధికంగా సీఎం ప్రమోద్ సావంత్ పోటీ చేసిన సాంక్వెలిమ్‌ నియోజకవర్గంలో 89.64 శాతంగా రికార్డ్ అయింది. అయితే, ఈ సారి పోలింగ్ శాతం గత ఎన్నికల్లో(81.21శాతం) కంటే తగ్గింది.

గోవాలో అధికారంలో బీజేపీ ఉన్నది. సీఎంగా ప్రమోద్ సావంత్ ఉన్నారు. ఆయన గతంలో పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం సాంక్వెలిమ్ నుంచే మరోసారి బరిలోకి దిగారు. కాగా, గోవా మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత మనోహర్ పారికర్ మరణం తర్వాత ఆయన కుమారుడు ఉత్పల్ పారికర్ తండ్రి పోటీ చేసిన పనాజీ నుంచే బరిలోకి దిగారు. పనాజీ నుంచి బీజేపీ ఆయనకు టికెట్ నిరాకరించడంతో స్వతంత్రంగా పోటీ చేశారు. కాంగ్రెస్ సీఎం ఫేస్‌ను ఇంకా ప్రకటించలేదు. ఆప్ మాత్రం అమిత్ పాలేకర్‌ను సీఎం క్యాండిడేట్‌గా ప్రకటించింది.

రాష్ట్రంలోని మొత్తం 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివిధ పార్టీల నుంచి, స్వతంత్రంగా 301 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇక్కడ బీజేపికి కాంగ్రెస్, మహారాష్ట్రవాది గోమంత్ పార్టీ, టీఎంసీ, ఆప్ పార్టీలు పోటీ ఇస్తున్నాయి.

గోవా రాజకీయాల్లో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల బెడద ఎక్కువ. ఇక్కడ పార్టీల కంటే రాజకీయ నేతలకే ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది. నియోజకవర్గాలు చిన్నగా ఉండటంతో నేతలకే ప్రజలతో నేరుగా ఉండే సంబంధాలు ఎక్కువ.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 17 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కానీ, 13 సీట్లు గెలుపొందిన బీజేపీ అధికారాన్ని చేపట్టింది. తొలుత చిన్న పార్టీలతో జత కట్టి బీజేపీ అధికారాన్ని చేపట్టగా.. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచే పెద్ద మొత్తంలో ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 19కు చేరగా.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 2కు పడిపోయింది. ఇదిలా ఉండగా, తృణమూల్ కాంగ్రెస్  ఈ రాష్ట్రంపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ కూడా ఇక్కడ ప్రచారం చేయడం గమనార్హం. ఆప్ కూడా గోవాలో ప్రచారం ముమ్మరంగా చేపట్టింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu