లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి వరకు బీజేపీ రెండు జాబితాలు విడుదల చేసింది. ఇందులో 267 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. అయితే ఇందులో 21 శాతం మంది సిట్టింగ్ లకు టిక్కెట్ దక్కలేదు.
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తన అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను బుధవారం విడుదల చేసింది. రెండో జాబితాలో మొత్తం 72 మందికి చోటు దక్కింది. అయితే ఇందులో 30 స్థానాల్లో సిట్టింగ్ లకు అవకాశం ఇవ్వలేదు. ఆ స్థానాలకు కొత్త వారిని ఎంపిక చేసింది. ‘ఎన్డీటీవీ’ కథనం ప్రకారం.. బీజేపీ మొదట విడుదల చేసిన జాబితాలో 33 మందికి టిక్కెట్లు ఇవ్వలేదు. రెండో జాబితాలో అలాంటి పరిస్థితే కనిపించింది.
అయితే ఇప్పటి వరకు బీజేపీ మొత్తం 267 మంది పేర్లను ప్రకటించింది. మొత్తంగా 63 మంది సిట్టింగ్ ఎంపీలకు టిక్కెట్లు ఇవ్వలేదు. అంటే బీజేపీ ఇప్పటి వరకు 21 శాతం మంది సిట్టింగ్ లకు మరో సారి అవకాశం కల్పించలేదు. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులపై ఉన్న వ్యతిరేతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పార్టీకి క్షేత్రస్థాయి నుండి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా సిట్టింగ్ లకు ఛాన్స్ ఇవ్వలేదు.
2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 303 స్థానాలను గెలచుకుంది. అప్పటి కంటే మరో 67 సీట్లు అధికంగా గెలుచుకొని 370 టార్గెట్ రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో బీజేపీ పని చేస్తోంది. ఆ భారీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే పార్టీ అభ్యర్థుల ఎంపిక కూడా కీలకం. అందుకే వచ్చే లోక్ సభ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపిక విషయంలో బీజేపీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఈసారి ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని ఆ పార్టీ భావిస్తోంది.
పార్టీకి ఇబ్బంది తెచ్చే ప్రకటనలు చేసే వారు, పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించేవారికి టిక్కెట్ ఇవ్వకూడదని బీజేపీ గట్టి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ప్రగ్యా ఠాకూర్, రమేష్ బిధూరి, ప్రవేశ్ వర్మలకు టిక్కెట్ ఇవ్వలేదు. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని కొందరికి అవకాశం ఇవ్వలేదు.
కాగా.. బీజేపీ బుధవారం విడుదల చేసిన రెండో జాబితాలో మహారాష్ట్రలో 20, కర్ణాటకలో 20, గుజరాత్ లో 7, తెలంగాణలో 6, హర్యానాలో 6, మధ్యప్రదేశ్ లో 5, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ 2-2, దాద్రా నగర్ హవేలీ 1-1 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఢిల్లీలో 6 మంది సిట్టింగ్ ఎంపీలను బీజేపీ భర్తీ చేయగా, మనోజ్ తివారీకి రెండో సారి అవకాశం లభించింది.
కర్ణాటకలో ప్రకటించిన 20 మంది అభ్యర్థుల్లో 11 మంది ఎంపీలు కొత్త వారు కాగా.. 8 మంది మాత్రమేకి మరో సారి టిక్కెట్ వచ్చింది. మహారాష్ట్రలో 14 మందిలో ఐదుగురి సిట్టింగ్ లకు టిక్కెట్లు ఇవ్వలేదు. నాగ్‌పూర్‌కు చెందిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి టిక్కెట్ ఇచ్చారు. అలాగే గుజరాత్ లో 7 మంది సిట్టింగ్ లో ముగ్గురు మాత్రమే రెండో జాబితాలో టిక్కెట్ కేటాయించారు. వారిలో కేంద్ర మంత్రి దర్శనా జర్దోష్, ఆయన స్థానంలో ముఖేష్ దలాల్ ఉన్నారు.
రెండో జాబితాలో హర్యానాలో ప్రకటించిన 6 మంది అభ్యర్థుల్లో 3 మంది సిట్టింగ్ ఎంపీలు రిపీట్ కాగా 2 మందిని మార్చారు. సిట్టింగ్ ఎంపీ మరణించిన స్థానానికి కొత్త అభ్యర్థి పేరును ప్రకటించారు. తెలంగాణలో ఒక సిట్టింగ్ కు టిక్కెట్ నిరాకరించారు. అలాగే మధ్యప్రదేశ్‌లోని 5 గురిలో ఇద్దరు సిట్టింగ్ లకు మాత్రమే టిక్కెట్ కేటాయించారు.