‘‘ఒక దేశం- ఒకే విద్యుత్ రేటు’’.. నితీశ్ సరికొత్త డిమాండ్

By Siva KodatiFirst Published Feb 21, 2021, 10:11 PM IST
Highlights

విద్యుత్తు ధరల విషయంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఓ ఆసక్తికర ప్రతిపాదన తీసుకొచ్చారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా విద్యుత్ ధరలు ఉండటం వల్ల బిహార్ నష్టపోతోందని ఆయన పేర్కొన్నారు.

విద్యుత్తు ధరల విషయంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఓ ఆసక్తికర ప్రతిపాదన తీసుకొచ్చారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా విద్యుత్ ధరలు ఉండటం వల్ల బిహార్ నష్టపోతోందని ఆయన పేర్కొన్నారు.

అన్ని రాష్ట్రాలకు విద్యుత్తు రేటు ఒకే విధంగా ఉండాలని ఆయన సూచించారు. ‘ఒక దేశం-ఒకే విద్యుత్తు రేటు’ విధానాన్ని అమలు చేయాలని నితీశ్ కేంద్రాన్ని కోరారు. నీతీ ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ 6వ సమావేశంలో పాల్గొన్న నితీశ్ శనివారం ఈ డిమాండ్ చేశారు.

ఈ విధానాన్ని అమలు చేస్తే బిహార్ వంటి రాష్ట్రాలు లబ్ధి పొందుతాయని ఆయన చెప్పారు. ప్రస్తుత విధానంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే బీహార్‌ విద్యుత్తు అధిక ధరకు కొనాల్సి వస్తోందని నితీశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక బిహార్‌లో విద్యుత్తు వినియోగం పెరుగుదల గురించి మాట్లాడుతూ, 2005లో రాష్ట్రం కేవలం 700 మెగావాట్ల విద్యుత్తును మాత్రమే ఉపయోగించుకుందని నితీశ్ కుమార్ చెప్పారు. గత పదిహేనేళ్ళలో రాష్ట్రంలో పరిస్థితులు మారాయని, 2020 జూన్‌లో విద్యుత్తు వినియోగం 5,932 మెగావాట్లు అని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ విద్యుత్తు ప్లాంట్లు సరఫరా చేస్తున్న విద్యుత్తు ధర ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా ఉందని నితీశ్ కుమార్ గుర్తుచేశారు. విద్యుత్తు కోసం బిహార్‌‌ అధిక ధరలు చెల్లించాల్సి వస్తోందని చెప్పారు.

ప్రజలకు సహేతుకమైన ధరకు విద్యుత్తును అందించాలన్న లక్ష్యంతో విద్యుత్తు పంపిణీ కంపెనీలకు మరిన్ని నిధులు మంజూరు చేయవలసి వస్తోందని బిహార్ సీఎం తెలిపారు. దేశానికి ఒకే రేటు విధానాన్ని అనుసరిస్తే బాగుంటుందని  ఆయన స్పష్టం చేశారు.

ఇదే సమయంలో రైతుల ఆందోళనపై నితీశ్ కుమార్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలను ఆయన సమర్థించారు. ఈ చట్టాలు రైతులకు మేలు చేస్తాయని చెప్పారు. 

click me!