
పట్నా : బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత Nitish Kumar భారత రాష్ట్రపతి కాబోతున్నారా? అసలు ఆ పదవికి నితీశ్ సరిపోతారా? అనే ప్రశ్నలు మంగళవారం Bihar politicsల్లో కలకలం సృష్టించాయి. ప్రస్తుత రాష్ట్రపతి Ram Nath Kovind పదవీకాలం కొద్ది నెలల్లో ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రపతిగా నితీశ్ అనే వార్త ప్రాధాన్యం సంతరించుకుంది. ఢిల్లీలోని రాష్ట్రపతి పదవికి పట్నాలోని నితీష్ కుమార్ ను ముడి వేయడానికి ముంబైలో బీజం పడింది.
నితీష్ రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తే తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఎన్సీపీ నేత Nawab Malikవ్యాఖ్యానించారు. అయితే ముందుగా నితీష్ బీజేపీతో మైత్రి వదులుకోవాలని సూచించారు. దీంతో నిప్పు లేనిదే పొగరాదు అన్నట్లుగా నితీష్ ను రాష్ట్రపతిగా చేసే యత్నాలు ఆరంభమయ్యాయని బీహార్ నేతలు భావిస్తున్నారు. ఈ విషయంపై నితీశ్ ను మీడియా ప్రశ్నించగా.. అసలు అలాంటి ఆలోచనే తనకు లేదని చెప్పారు.
నితీష్ మిత్రపక్షం బిజెపి కూడా ఈ విషయమై ఎలాంటి కామెంట్లు చేయలేదు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం జూలైలో ముగుస్తుంది. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో పార్లమెంటు ఉభయ సభల సభ్యులతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు కూడా ఉంటారు. లోక్సభలో బీజేపీకి భారీ మెజార్టీ ఉన్నా రాష్ట్రపతిగా తనకు నచ్చిన అభ్యర్థిని ఎంపిక చేయాలంటే.. బీజేపీకి ఇతర పార్టీల మద్దతు అవసరం. అందుకే నితీష్ లాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తిని బీజేపీ నిలబెట్టవచ్చని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
మిశ్రమ స్పందన…
నితీష్ సొంత పార్టీ నేతలు తాజా ఊహాగానాలపై సంతోషం ప్రకటించగా, బద్ద శత్రువైన లాలూకు చెందిన ఆర్జెడి నేతలు ఈ విషయమై మిశ్రమ స్పందన వెలిబుచ్చారు. హత్య కేసులో నిందితుడిని రాష్ట్రపతి కుర్చీలొ ఎలా కూర్చోబెడతారు.. అని లాలూ పెద్దకొడుకు తేజ్ ప్రతాప్ ప్రశ్నించారు. ఎప్పటికైనా తన తండ్రి ప్రధాని అవుతాడు అన్నారు. అయితే ఒక బీహారీ రాష్ట్రపతి అయితే సంతోషిస్తామని ఆర్జేడీ నేత మృత్యుంజయ్ తివారి చెప్పారు. గత రెండు దఫాల రాష్ట్రపతి ఎన్నికల్లో సొంత కూటమికి వ్యతిరేకంగా నిలబడిన అభ్యర్థులకు మద్దతు ఇచ్చారని ఆర్జేడీ నేత శక్తి యాదవ్ గుర్తు చేశారు.
ఇటీవల ఢిల్లీ వెళ్లిన నితీశ్ ను రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కలిసి చర్చించడాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావిస్తూ.. పీఆర్ ఏజెన్సీ అండతో ఎవరైనా రాష్ట్రపతి గద్దెనెక్కితే దేశ పరిస్థితి ఇబ్బందుల్లో పడుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి పదవికి నితీష్ సరిపోతారని బీహార్ మాజీ సీఎం జీతన్ రామ్ మాంజీ అభిప్రాయపడగా, ఎల్ జెపీ నేత చిరాక్ పాశ్వాన్ మాత్రం నితీష్ పై నిప్పులు చెరిగారు.
బీజేపీ వ్యతిరేక కూటమి?
దేశంలో బీజేపీ కి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసే యత్నాలు ఆరంభమయ్యాయని.. ఇందులో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్, మహారాష్ట్ర సీఎం వద్దకు ఉద్దవ్ తో సమావేశం అయ్యారన్నారు. వీరితో అరవింద్ కేజ్రీవాల్, మమతాబెనర్జీలను కలిపి ఐక్య కూటమి నిర్మించాలన్నది ప్రతిపక్ష ప్రణాళిక అని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీరితో నితీష్, నవీన్ పట్నాయక్ చేరితే మరింత బలోపేతమవుతుందని వీరి విశ్లేషణ. కానీ కూటమిలో కాంగ్రెస్ ను చేర్చుకోవడం పైనే ప్రతిపక్షాల్లో విభేదాలున్నాయి.