6 రాష్ట్రాలు, 51 ప్రాంతాల్లో ఏకకాలంలో ఎన్ఐఏ దాడులు.. ఎందుకంటే ?

By Asianet News  |  First Published Sep 27, 2023, 1:17 PM IST

దేశంలోని ఆరు రాష్ట్రాల్లోని 51 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు నిర్వహిస్తోంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలతో పాటు దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఖలిస్తాన్ తో సంబంధాలున్న గ్యాంగ్ స్టర్ల హవాలా ఆపరేటర్లు, లాజిస్టిక్ కోఆర్డినేటర్లను అరెస్టు చేసేందుకు ఈ దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.


ఆరు రాష్ట్రాల్లోని, 51 ప్రాంతాల్లో ఏకకాలంలో జాతీయ దర్యాప్తు సంస్థ భారీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఖలిస్తాన్ తో సంబంధాలున్న గ్యాంగ్ స్టర్ల హవాలా ఆపరేటర్లు, లాజిస్టిక్ కోఆర్డినేటర్లను అరెస్టు చేసేందుకు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయని ‘టైమ్స్ నౌ’ నివేదించింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో లారెన్స్ బిష్ణోయ్, దవీందర్ బాంబిహా, అర్ష్ దల్లా ముఠాలకు చెందిన 51 చోట్ల అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 

అలాగే దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఎన్ఐఏ బృందం సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. పంజాబ్ లో 30, హరియాణాలో 8, దేశ రాజధాని ప్రాంతంలో 2 చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఎన్ ఐఏ సోదాలు చేస్తోంది. ‘‘ లారెన్స్, బాంబిహా, అర్ష్ దల్లా ముఠాలకు చెందిన 51 ప్రాంతాల్లో 3 కేసుల్లో (ఆర్సీ 37/2022/ఎన్ఐఏ/డీఎల్ఐ, ఆర్సీ 39/డీఎల్ఐ, ఆర్సీ 22/2023/ఎన్ఐఏ/డీఎల్ఐ) 6 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది.’’ అని ఎన్ఐఏ పేర్కొంది.

| NIA raids underway in Punjab's Bathinda

National Investigation Agency (NIA) is conducting raids across 6 states in 3 cases in 51 locations belonging to associates of Lawrence Bambiha and Arsh Dalla gangs: NIA pic.twitter.com/0YJqkq3mEO

— ANI (@ANI)

Latest Videos

కాగా..  గత వారం అమృత్ సర్, చండీగఢ్ లలో ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకుంది. దీంతో పాటు గ్యాంగ్ స్టర్-టెర్రర్ నెట్ వర్క్ కు సంబంధించిన రెండు కేసులను ఢిల్లీ పోలీసుల నుంచి ఎన్ ఐఏ స్వాధీనం చేసుకుంది. విదేశాల నుంచి తమ ముఠాలను నడుపుతూ దోపిడీ హత్యలు (కాంట్రాక్ట్ కిల్లింగ్), టార్గెట్ మర్డర్, కిడ్నాప్ లకు పాల్పడే గ్యాంగ్ స్టర్లపై ఈ రైడ్ కొనసాగిస్తున్నట్టు సమాచారం. 

కాగా.. యూకే, అమెరికా, కెనడా, దుబాయ్, పాకిస్థాన్ తదితర దేశాల్లో నివసిస్తున్న 19 మంది పరారీలో ఉన్న ఖలిస్థాన్ ఉగ్రవాదుల జాబితాను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విడుదల చేసింది. దర్యాప్తు సంస్థ వారి ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పరారీలో ఉన్న ఈ 19 మందిపై ఉగ్రవాద నిరోధక చట్టం యూఏపీఏ కింద చర్యలు తీసుకోనున్నారు.

నిషేధిత ఖలిస్తానీ అనుకూల సంస్థ సిక్కుస్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) సభ్యుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఆస్తులను ఎన్ఐఏ జప్తు చేసింది. అలాగే ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాది హర్వీందర్ సింగ్ సంధు అలియాస్ రిందా, లఖ్బీర్ సింగ్ సంధు అలియాస్ లాండా అరెస్టుకు దారితీసే సమాచారం ఇచ్చిన వారికి ఎన్ఐఏ రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది. నిషేధిత సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ)లో సభ్యుడైన ఇతడు భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

click me!