
దేశంలోని 70కి పైగా ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోదాలు కొనసాగిస్తుంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లలో ఎన్‌ఐఏ అధికారులు దాడులు జరుపుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున ప్రారంభమైన దాడులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఒక పంజాబ్‌లోనే 30కి పైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. గ్యాంగ్‌స్టర్, క్రిమినల్ సిండికేట్‌కు సంబంధించి నమోదైన కేసులకు సంబంధించి ఎన్‌ఐఏ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. లారెన్స్ బిష్ణోయ్, నీరజ్ బవానా గ్యాంగ్‌లలో భాగమైన డజన్ల కొద్దీ గ్యాంగ్‌స్టర్లను ఎన్‌ఐఏ విచారించిందని.. వారిని ప్రశ్నించిన సమయంలో సేకరించిన సమాచారం ఆధారంగా దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లోని ఆయుధాల సరఫరాదారుల ఇళ్లపై ఎన్‌ఐఏ అధికారులు దాడులు చేస్తున్నారు. గ్యాంగ్‌స్టర్‌లకు ఆయుధాల సరఫరాపై ఎన్‌ఐఏ అధికారులు వివరాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ కేసులకు సంబంధించి ఎన్‌ఐఏ సోదాలు జరపడం ఇది నాలుగోసారి.
ఇక, ఉగ్రవాదులు, గ్యాంగ్‌స్టర్లు, డ్రగ్స్ స్మగ్లర్ల సిండికేట్ ద్వారా ప్రజలలో భయాందోళనలు సృష్టించేందుకు పన్నిన కుట్రకు సంబంధించిన కేసులో లారెన్స్ బిష్ణోయ్‌ను 2022 నవంబర్ 24న ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. లారెన్స్ బిష్ణోయ్ భటిండా జైలులో ఉన్నప్పుడు అతని అరెస్టు జరిగింది.