ఎన్ఐఏ దూకుడు .. కర్ణాటకలో పలు చోట్ల దాడులు.. ఇద్దరు ఇస్లామిక్ స్టేట్ కార్యకర్తల అరెస్టు..

By Rajesh KarampooriFirst Published Jan 6, 2023, 4:57 AM IST
Highlights

కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) గురువారం దాడులు నిర్వహించింది. ఈ క్రమంలో శివమొగ్గ ISIS కుట్ర కేసుకు సంబంధించి ఇద్దరు కార్యకర్తలను అరెస్టు చేసింది. కర్ణాటకలోని దక్షిణ కన్నడ, శివమొగ్గ, దావణగెరె, బెంగళూరు జిల్లాల్లోని ఆరు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించి ఇద్దరు ఐఎస్ఐఎస్ కార్యకర్తలను అరెస్టు చేసింది. 

ఉగ్రవాదుల చర్యలను అరికట్టడాలనే ఉద్దేశ్యంతో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దూకుడు పెంచింది. గురువారం నాడు కర్ణాటకలోని ఆరు చోట్ల దాడులు నిర్వహించింది.మరోవైపు.. ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన ఇద్దరు కార్యకర్తలను కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరెస్టు చేసింది. ఈ మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారి మీడియాకు సమాచారం అందించారు. దక్షిణ కన్నడ, శివమొగ్గ, దావణగెరె, బెంగళూరు జిల్లాల్లో ఒక కేసుకు సంబంధించి సోదాలు నిర్వహించామని చెప్పారు. అదే సమయంలో మంగళూరు పేలుళ్ల కేసులోనూ ఎన్ఐఏ దాడులు నిర్వహించిందనీ, ఈ కేసులో మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. 

 నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద కార్యకలాపాలను మరింతగా పెంచింది. దేశ ఐక్యత, భద్రత, సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లే చర్యలను అడ్డుకునేందుకు కర్ణాటకలోని ఆరు చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గురువారం దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా ఐఎస్‌కి చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

అరెస్టయిన వారిని ఉడిపి జిల్లాకు చెందిన రేషన్ థాజుద్దీన్ షేక్, శివమొగ్గ జిల్లాకు చెందిన హుజైర్ ఫర్హాన్ బేగ్‌గా గుర్తించారు. ఈ దాడుల్లో నిందితుల ఇళ్ల నుంచి డిజిటల్ పరికరాలు, నేరారోపణ పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేయడం గమనార్హం. దీంతో ఇప్పుడు ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. ఈ కేసును మొదట సెప్టెంబరు 19, 2022 న శివమొగ్గ రూరల్ పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసి, నవంబర్ 15, 2022 న NIA తిరిగి నమోదు చేసింది.

మంగళూరు పేలుళ్ల కేసులో మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి అరెస్ట్ 

మంగళూరు ఆటో రిక్షా పేలుడు కేసులో మెకానికల్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని కేంద్ర దర్యాప్తు సంస్థ గురువారం అదుపులోకి తీసుకుంది. కళాశాల ఉద్యోగి ఒకరు మాట్లాడుతూ ..గురువారం ఉదయం ఎన్‌ఐఏ అధికారులు కళాశాలకు వచ్చారు. అనంతరం పేలుడు ఘటనకు సంబంధించి ఓ విద్యార్థిని అదుపులోకి తీసుకుని విచారించారు. అదుపులోకి తీసుకున్న విద్యార్థి కాలేజీలో   మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతున్నట్టు తెలిపారు.

ఈ పేలుడుకు ప్రధాన నిందితుడు మహ్మద్‌ షరీక్‌.. ఆయన శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి నివాసి కావడం గమనార్హం. నవంబర్ 19న ఆటోరిక్షాలో కుక్కర్‌లో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)ని తీసుకెళ్లాడు. అదే సమయంలో మంగళూరు శివార్లలో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో షరీక్ 45 శాతం కాలిన గాయాలు కాగా, ఆటోరిక్షా డ్రైవర్ కూడా గాయపడ్డాడు.

ప్రధాన నిందితుడు కర్ణాటకలోని మంగళూరులోని ఫాదర్ ముల్లర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిని ఉగ్రవాద ఘటనగా పేర్కొన్న పోలీసులు షరీఖ్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ యూఏపీఏ కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఎన్‌ఐఏతో విచారణ జరిపించాలని కర్ణాటక ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఆ తర్వాత కేంద్ర ఏజెన్సీ కేసు దర్యాప్తు చేపట్టింది.

click me!