
World Cities Summit-Singapore: "నేనేమీ క్రిమినల్ ను కాదు.. ఈ దేశ పౌరులచే ఎన్నికైన ఒక ముఖ్యమంత్రి.. " అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు తనపై రాజకీయ కక్షతో వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. వివరాల్లోకెళ్తే.. సింగపూర్ లో జరిగే ఒక గ్లోబల్ సమ్మిట్ కు రావాలని కేజ్రీవాల్ కు ఆహ్వానం అందింది. అయితే, ఆయన పర్యటనకు కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇవ్వలేదు. తన సింగపూర్ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం ఇంకా క్లియరెన్స్ ఇవ్వకపోవడంపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. ప్రభుత్వ తీరును తప్పుబట్టరు. ప్రధాని మోడీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. తన సింగపూర్ పర్యటనకు క్లియరెన్స్ ఇవ్వకపోవడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్టు కనిపిస్తోందని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే అరవింద్ కేజ్రీవాల్ తాను నేరస్థుడిని కాదని, సింగపూర్‌లో జరిగిన "వరల్డ్ సిటీస్ సమ్మిట్" లో పాల్గొనడం దేశానికి గర్వకారణంగా ఉంటుందని ఉద్ఘాటించారు.
"నేను నేరస్థుడిని కాదు, ప్రజల చేత రాష్ట్రానికి ఎన్నికైన ముఖ్యమంత్రిని" అని కేజ్రీవాల్ అన్నారు. సింగపూర్ ప్రభుత్వం తనను వరల్డ్ సిటీస్ సమ్మిట్‌కు ఆహ్వానించిందని, అక్కడ ఢిల్లీ మోడల్ గురించి ప్రపంచ నేతలకు వివరిస్తానని కేజ్రీవాల్ చెప్పారు. "నేను ఆ సమావేశానికి వెళ్లకుండా ఎందుకు నిషేధించబడ్డానో నాకు అర్థం కాలేదు. ఈ పర్యటన భారతదేశానికి మరింత కీర్తిని తెస్తుందని నేను భావిస్తున్నాను" అని కేజ్రీవాల్ అన్నారు.
దేశ అంతర్గత విభేదాలు ప్రపంచ వేదికపై ప్రతిబింబించకూడదని ఆప్ కన్వీనర్ అన్నారు. సింగపూర్ లో జరిగే వరల్డ్ సిటీస్ సమ్మిట్ పర్యటనకు సంబంధించిన ఆయన ప్రధాని మోడీ లేఖ రాసిన విషయాన్ని కూడా వెల్లడించారు. తన పర్యటనకు క్లియరెన్స్ ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. "గ్లోబల్ సమ్మిట్‌లో ఢిల్లీ మోడల్‌ను ప్రదర్శించమని సింగపూర్ ప్రభుత్వం మమ్మల్ని ఆహ్వానించింది. సమ్మిట్ సందర్భంగా ప్రపంచంలోని చాలా మంది పెద్ద నాయకుల ముందు ఢిల్లీ మోడల్‌ను ప్రదర్శించాలి. ఈ రోజు ప్రపంచం మొత్తం ఢిల్లీ మోడల్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నది. ఈ ఆహ్వానం దేశానికి గర్వకారణం, గౌరవప్రదమైనది" అని లేఖలో పేర్కొన్నారు.
"ఢిల్లీలోని ఆరోగ్యం, విద్య నమూనా ద్వారా ప్రపంచం స్ఫూర్తి పొందుతున్నందున ఇది భారతదేశానికి గర్వకారణం. నేను ఢిల్లీలోని పాఠశాలలు, ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్‌లు, ఉచిత విద్యుత్, ఇతర నమూనాలను ప్రదర్శిస్తున్నప్పుడు దేశం గర్విస్తుంది. నా సింగపూర్ పర్యటనలో ఆయా ప్రదర్శనలు దేశ గర్వాన్ని.. ఔన్నత్యాన్ని పెంపొందిస్తాయి" అని పేర్కొన్నారు. ఆగస్టు 1న జరిగే సదస్సులో కేజ్రీవాల్ మాట్లాడే అవకాశం ఉంది.