భారతదేశం ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున పాన్ యామ్ ఫ్లైట్ 73 హైజాక్ సమయంలో సెప్టెంబర్ 5, 1986న మరణించిన నీర్జా బానోత్ చేసిన త్యాగాన్ని గుర్తుంచుకోవడం కూడా ముఖ్యం.
భారతదేశం ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున పాన్ యామ్ ఫ్లైట్ 73 హైజాక్ సమయంలో సెప్టెంబర్ 5, 1986న మరణించిన నీర్జా బానోత్ చేసిన త్యాగాన్ని గుర్తుంచుకోవడం కూడా ముఖ్యం. నీర్జా అసాధారణ కథ భవిష్యత్తు తరాలకు స్పూర్తినిస్తూనే వున్నారు. సెప్టెంబర్ 7, 1963న చండీగఢ్‌లో జన్మించిన నీర్జా బానోత్ 22 ఏళ్ల వయసులోనే ఉగ్రవాదుల బారి నుంచి ప్రయాణీకులను రక్షించే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు. పాన్ అమెరికన్ వరల్డ్ ఎయిర్‌వేస్ (పాన్ ఆమ్)లో చేరారు. ఉద్యోగం పట్ల ఆమెకున్న అంకిత భావం, ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండగల సామర్ధ్యంతో నీర్జా అందరికీ ఇష్టమైన వ్యక్తిగా మారారు.
1986లో వదౌద్ మొహమ్మద్ హఫీజ్ అల్ టర్కీ, జమాల్ సయీద్ అబ్ధుల్ రహీమ్, మొహమ్మద్ అబ్ధుల్లా ఖలీల్ హుస్సేన్ ఆర్ రహయ్యాల్, మొహమ్మద్ అహ్మద్ అల్ మునావర్ అనే నలుగురు ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్ చేశారు. ముంబై నుంచి న్యూయార్క్‌కు వెళ్లాల్సిన ఈ విమానాన్ని ఉగ్రవాదులు కరాచీలో దించారు. 350 మంది ప్రయాణీకులను రక్షించేందుకు ఆమె ఎంతో సమయస్పూర్తిగా
వ్యవహరించారు.
హైజాకింగ్ సమయంలో విమానాన్ని విడిచిపెట్టాల్సిందిగా కాక్‌పిట్ సిబ్బందిని ఆమె రహస్యంగా హెచ్చరించింది. అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా తప్పించుకోవడానికి వారిక సహాయం చేసింది. బానోత్ ధైర్య సాహసాలు వృత్తిపరమైన విధులకు మాత్రమే పరిమితం కాలేదు. ముగ్గురు చిన్నారులను తుపాకీ కాల్పుల నుంచి రక్షించడంలో నీర్జా తన తెగువ చూపించింది. చివరికి వారిని కాపాడేందుకు తన జీవితాన్ని త్యాగం చేసింది. తన 23వ పుట్టినరోజుకు రెండు రోజుల ముందు కాల్పుల్లో మరణించింది.
నీర్జా బానోత్ సాహసాన్ని ప్రపంచ దేశాలు ప్రశంసించాయి. ఆమెకు మరణానంతరం అనేక అవార్డులు ప్రకటించారు. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం అశోక చక్ర కూడా ఇందులో వుంది. అంతేకాదు.. ఈ ఘటనతో ప్రపంచవ్యాప్తంగా విమానయాన భద్రతా విధానాల్లో మార్పులకు దారి తీసింది. నీర్జా జ్ఞాపకార్ధం ఆమె కుటుంబ సభ్యులు ‘‘నీర్జా బానోత్ పాన్ ఆమ్ ట్రస్ట్’’ని స్థాపించారు.