అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు నరేంద్ర గిరి అనుమానాస్పద మృతి

By telugu news teamFirst Published Sep 21, 2021, 8:16 AM IST
Highlights

 మానసిక సమస్యలతో పాటు శిష్యుల వేధింపులే తన ఆత్మహత్యకు కారణమని సూసైడ్‌ లెటర్‌లో రాశారు నరేంద్రగిరి.

అఖిల భారతీయ అఖాడా పరిషత్ (Akhil Bharatiya Akhada Parishad) అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి (Narendra Giri) మహరాజ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ (Prayagraj) లో ఉన్న బాఘంబరి మఠంలో ఆయన ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని కనిపించారు.

ఆయన మృతదేహం వద్ద ఐదు పేజీల సూసైడ్ నోట్ కూడా లభించిందని పోలీసులు చెబుతున్నారు. తన శిష్యులలో ఒకరైన ఆనంద్ గిరి ఇందుకు బాధ్యుడుగా మహంత్ నరేంద్ర గిరి అందులో పేర్కొన్నారు. ఫోరెన్సిక్ బృదంతో పాటు ఒక ప్రత్యేక బృందం ఘటనా స్థలికి చేరుకుని విచారణ ప్రారంభించింది. మానసిక సమస్యలతో పాటు శిష్యుల వేధింపులే తన ఆత్మహత్యకు కారణమని సూసైడ్‌ లెటర్‌లో రాశారు నరేంద్రగిరి.

నరేంద్రగిరి సూసైడ్‌ నోట్‌ (narendragiri Suicide Note) ఆధారంగా ఆయన శిష్యుడు ఆనంద్‌గిరిని ఉత్తరాఖండ్‌ లోని హరిద్వార్‌లో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే తనకు ఏం పాపం తెలియదని , స్వామీజీ ఆత్మహత్య చేసుకోలేదని , హత్య చేశారని ఆరోపించారు ఆనంద్‌గిరి. దీంతో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా హత్య చేసి ఉంటే, ఆ నోట్‌ ఎవరు రాశారని పోలీసులు ఆరా తీసే అవకాశం ఉంది. అటు నరేంద్రగిరి నోట్‌లో చెప్పినట్టు మానసిక సమస్యలు ఉంటే, వాటిని కూడా నిర్థారించుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తారు.

మరోవైపు మహంత్ నరేంద్ర గిరి ఇక లేరనే వార్త విషాదం నింపినట్టు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ‘ అఖిల భారతీయ అఖాడ పరిషత్ అధిపతి నరేంద్ర గిరి మరణనం ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరని లోటు. ఆ రాముడి పాదాలయ వద్ద ఆయనకు స్థానం లభించాలని, ఈ బాధను తట్టుకునే శక్తిని ఆయన అనుచరులకు ఇవ్వాలని రాముడిని ప్రార్థిస్తున్నా’ అంటూ యోగి ఆదిత్యనాథ్ ట్విట్టర్ ద్వారా సంతాపం తెలియజేశారు. 

click me!