
గువహతి: Nagalandలో Army కాల్పుల(Firing) ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ కాల్పుల్లో మొత్తం 14 మంది(Civilians) మరణించారు. ఈ ఘటనపై స్థానిక ప్రజలు కోపోద్రిక్తులయ్యారు. ఆర్మీపైనే దాడికి దిగారు. నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. దీనిపై స్థానిక ట్రైబల్స్(Tribes) ఇంకా ఆగ్రహంతోనే ఉన్నారు. తమకు పరిహారాలేమీ వద్దూ.. న్యాయం కావాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. వేగంగా తమకు న్యాయం అందించాలని డిమాండ్ కూడా చేశారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారు. ఆర్మీకి సహకరించకూడదనే(Non Cooperation) నిర్ణయం తీసుకున్నారు.
నాగాలాండ్‌లోని టాప్ ట్రైబల్ బాడీ కొన్యాక్ నాగా జాతి సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మోన్ జిల్లాలో ఈ జాతి ప్రాబల్యం ఎక్కువగా ఉన్నది. వీరు మిలిటరీ బలగాలతో సహాయ నిరాకరణకు పిలుపు ఇచ్చారు. వారం రోజుల కింద మరణించిన తమ ఆప్తుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు తమ ప్రాంతంలో ఆర్మీ కాన్వాయ్‌లు, పెట్రోలింగ్ కార్యకలాపాలను పూర్తిగా నిలిపేయాలని కొన్యాక్ నాగా ట్రైబ్ డిమాండ్ చేసింది. అలాగే, ఆర్మీ నుంచి ఏ విధమైన సహకారాలూ చేయకూడదని ప్రకటించింది. వారి నుంచీ సహాయం తీసుకోరాదనీ పేర్కొంది. అంతేకాదు, మోన్ జిల్లా పరిధిలో మిలిటరీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలూ నిర్వహించరాదని ఆర్మీకి తెలిపింది.
Also Read: Nagaland Firing: పొరపాటు జరిగింది.. ఉగ్రవాదులనే అనుమానంతోనే ఫైరింగ్.. లోక్‌సభలో అమిత్ షా
ఇంతటితో ఆగలేదు. మిలిటరీ బేస్ క్యాంపులకు, ఇతర అవసరాలకు భూములు ఇచ్చిన భూ యజమానులకూ సూచనలు చేసింది. భారత మిలటరీ బలగాలతో ఎలాంటి ప్రజా సంబంధాలు నెరపరాదని స్పష్టం చేసింది. ఇక్కడ నడిపే ప్రతి వాహనంపైనా నల్ల జెండాలు ఎగరేయాలని తెలిపింది. మోన్ జిల్లాలో ప్రతి వ్యక్తి నల్ల రంగు బ్యాడ్జీలు ధరించాలని పేర్కొంది. బాధితులకు న్యాయం జరిగే వరకు ఎలాంటి వినోదాలు, విహారాలు, ఇతర ఎంటర్‌టైన్‌మెంట్ కార్యకలాపాలు చేయరాదని వివరించింది. అయితే, ఇప్పటికే ముహూర్తాలు ఖరారైన పెళ్లిళ్లు, చర్చీ కార్యక్రమాలకు మినహాయింపు ఉన్నదని తెలిపింది. నాగాలాండ్‌లో మిలిటరీపై వ్యతిరేకత ఇదే తొలిసారి కాదు. గతంలోనూ మిలిటరీపట్ల స్థానికులు నిరసనలు చేసిన సందర్భాలు ఉన్నాయి.
నాగాలాండ్ సరిహద్దు జిల్లా మోన్‌లో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు ఈ నెల 4వ తేదీన ఆర్మీకి సమాచారం అందిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో తెలిపారు. ఆ సమాచారం ఆధారంగానే 21 మంది కమాండోలు అనుమానిత ప్రాంతంలో నిఘా వేసి ఉన్నారని చెప్పారు. అదే సమయంలో అక్కడికి ఓ వాహనం వచ్చిందని, దాన్ని ఆపాలని ఆర్మీ సిగ్నల్ ఇచ్చినా ఆపకుండా వెళ్లడానికి ప్రయత్నించారని, దీనితో ఆర్మీలో అనుమానాలు ఏర్పడ్డాయని చెప్పారు. ఆ వాహనంలో ఉగ్రవాదులు పారిపోతున్నట్టు అనుమానించి కాల్పులు జరిపారని వివరించారు. ఈ ఘటనలో వాహనంలోని ఎనిమిది మందిలో ఆరుగురు మరణించారని, ఆ తర్వాత వారు ఉగ్రవాదులు కాదని ఆర్మీకి తెలిసిందని చెప్పారు.
Also Read: Sonia Gandhi : కేంద్రపై నిప్పులు చెరిగిన సోనియా.. రైతు మద్దతుకు కట్టుబడి ఉన్నాం..
ఈ విషయం ప్రజలకు చేరగానే వారు ఆర్మీ యూనిట్‌పై దాడికి దిగారని, వారి రెండు వాహనాలకు నిప్పు పెట్టారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఫలితంగా ఒక జవాను ప్రాణాలు కోల్పోయాడని, ఈ క్రమంలోనే అక్కడి జవాన్లు ప్రాణ రక్షణలో భాగంగా మరోసారి కాల్పులు జరిపారని వివరించారు. దీంతో మరో ఏడుగురు పౌరులు మరణించారని తెలిపారు. మరికొందరు గాయాపడ్డారని చెప్పారు. ఈ ఘటనపై ఆర్మీ కూడా పశ్చాత్తాపాన్ని ప్రకటించిందని పేర్కొన్నారు.