మైసూరు మహారాజా యదువీర్ వడియార్ : బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం

By Siva Kodati  |  First Published Apr 2, 2024, 4:43 PM IST

మైసూరు మహారాజా యదువీర్ కృష్ణదత్త వడియార్ ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల ద్వారా రాజకీయాల్లో అరంగేట్రం చేయనున్నారు. సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ సింహా స్థానంలో బీజేపీ ఆయనను మైసూర్ సెగ్మెంట్ నుంచి అభ్యర్ధిగా నిలబెట్టింది. 31 ఏళ్ల యదువీర్ అమెరికాలో చదువుకున్నారు. 2015 మే 28న వడియార్ రాజవంశానికి 27వ రాజుగా ఆయనకు పట్టాభిషేకం జరిగింది. పాత మైసూరు ప్రాంతంలో (దక్షిణ కర్ణాటక) రాజకుటుంబానికి ఇప్పటికీ గణనీయమైన గౌరవం, అభిమానం వున్నాయి. ఈ కారణంగా కాంగ్రెస్ దూకుడుకు యదువీర్‌తో కళ్లెం వేయొచ్చని కమలనాథులు భావిస్తున్నారు. 


2024 అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక సాంస్కృతిక రాజధాని మైసూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి వడియార్ రాజవంశీకుడు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ పోటీ చేయనున్నారు. ఏళ్ల తర్వాత రాజ కుటుంబం నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి కావడంతో ప్రజల్లో ఆసక్తి నెలకొంది. యదువీర్ గురించి నెటిజన్లు ఆన్‌లైన్‌లో జల్లెడ పడుతున్నారు. 32 ఏళ్ల యదువీర్ మైసూర్‌ను పాలించిన 25వ చివరి మహారాజా జయరామచంద్ర వడియార్ మనవడు. 

యదువీర్ వడియార్ బాల్యం , విద్యాభ్యాసం :

Latest Videos

వడియార్ రాజవంశ చివరి వారసుడు శ్రీకంఠదత్త నరసింహరాజ వడియార్, ప్రమోదా దేవి దంపతులకు పిల్లలు లేకపోవడంతో యదువీర్ గోపాల్ రాజ్ ఉర్స్‌ను దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత అతనికి యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ అని పేరు పెట్టారు. యదువీర్ తన పాఠశాల విద్యను బెంగళూరులోని విద్యానికేతన్ పాఠశాలలో అభ్యసించారు. అనంతరం ఉన్నత విద్య కోసం యూఎస్ఏలోని మసాచుసెట్స్ విశ్వవిద్యాలయానికి వెళ్లాడు. ఆంగ్ల సాహిత్యం, ఆర్ధిక శాస్త్రంలో డిగ్రీ పొందారు యదువీర్. 

యదువీర్ వడియార్ పట్టాభిషేకం :

మే 28, 2015న ఆయనకు రాజ కుటుంబ సాంప్రదాయాల ప్రకారం మైసూర్ మహారాజాగా పట్టాభిషేకం నిర్వహించారు. దీంతో వడియార్ రాజవంశానికి 27వ రాజుగా బాధ్యతలు స్వీకరించారు. గిటార్, వీణను వాయించడం, టెన్నిస్ ఆడటం, గుర్రపు పందాలను యదువీర్ ఇష్టపడతారు. రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్ రాజకుటుంబానికి చెందిన త్రిషికా కుమారి వడియార్‌ను యదువీర్ వివాహం చేసుకున్నారు. త్రిషిక తండ్రి హర్షవర్థన్ సింగ్ బీజేపీ రాజ్యసభ ఎంపీ. 

మైసూరు రాజకుటుంబానికి రాజకీయాలు కొత్త కాదు. గతంలో శ్రీకంఠదత్త నరసింహరాజ వడియార్ మైసూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ప్రాతినిథ్యం వహించారు. శ్రీకంఠదత్త ఎక్కువ కాలం కాంగ్రెస్ సభ్యుడిగానే వుండగా.. అనంతరం బీజేపీలో చేరారు. శ్రీకంఠదత్త తండ్రి జయచామరాజేంద్ర వడియార్ .. మైసూరు చివరి మహారాజుగా కీర్తిగడించారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆయన రాజ్ ప్రముఖ్, గవర్నర్‌గా వున్నారు. పాత మైసూరు ప్రాంతంలో (దక్షిణ కర్ణాటక) రాజకుటుంబానికి ఇప్పటికీ గణనీయమైన గౌరవ, అభిమానాలు వున్నాయి. 

సొంతిల్లు, కారు లేదన్న యదువీర్ :

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా మైసూరు కొడుగు లోక్‌సభ నియోజవర్గానికి యదువీర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తుల విలువ రూ.4.99 కోట్లుగా ప్రకటించారు. ఆయనకు సొంత ఇల్లు, భూమి, కారు లేవని యదువీర్ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. భార్య త్రిషిక కుమారి వడియార్‌కు రూ.1.04 కోట్లు, వారి సంతానం పేరిట రూ.3.64 కోట్ల విలువైన ఆస్తులు వున్నాయని చెప్పారు. మొత్తం ఆస్తుల్లో రూ.3.39 కోట్ల విలువైన బంగారు , వెండి నగల రూపంలో తన పేరు మీదున్నట్లు యదువీర్ వడియార్ తెలిపారు. భార్యకు రూ.1.02 కోట్ల విలువైన ఆభరణాలు, తన సంతానానికి రూ.24.50 లక్షల విలువైన ఆభరణాలు వున్నట్లు వెల్లడించారు. 

click me!