ఇందిరా గాంధీ వర్థంతి సందర్భంగా ఆమెను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్మరించుకున్నారు. తన నానమ్మే తనకు బలమని చెప్పారు. భారత్ ను ఎప్పుడూ రక్షించుకుంటానని ఆయన ‘ఎక్స్’ లో పోస్టు చేశారు.
తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 39వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆమెను స్మరించుకున్నారు. ‘‘నా బలం.. నా నానమ్మ ! మీరు భారతదేశం కోసం సర్వం త్యాగం చేశారు. ఆ దేశాన్ని నేను ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటాను. మీ జ్ఞాపకాలు ఎప్పుడూ నాతో, నా హృదయంలో ఉంటాయి’’ అని రాహుల్ గాంధీ ఎక్స్ (ట్విట్టర్) లో పోస్ట్ చేశారు.
मेरी शक्ति, मेरी दादी!
जिस भारत के लिए आपने अपना सर्वस्व बलिदान कर दिया, उसकी हमेशा रक्षा करूंगा। आपकी यादें हमेशा साथ हैं, दिल में। pic.twitter.com/SmpmqM13bo
ఇందిరాగాంధీ 39వ వర్ధంతి సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని శక్తి స్థల్ వద్ద కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నివాళులర్పించారు. కాగా.. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కూడా తన నానమ్మను ‘జాతిమాత’ అని గుర్తు చేసుకున్నారు. ‘సాటిలేని ధైర్యసాహసాలకు, పోరాటానికి ప్రతీకగా, ప్రజాస్వామ్య సామ్యవాదానికి మార్గదర్శకురాలిగా నిలిచిన నానమ్మ దివంగత ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆమెకు సెల్యూట్’అని వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు. ‘‘కఠిన నిర్ణయాలు తీసుకోవాలనే సంకల్పంతో పాటు, మాతృత్వం గురించి చాలా సరళమైన, సున్నితత్వం కూడా మీకు ఉంది. మీరు నిజంగా జాతిమాత’’ అని ఆయన పేర్కొన్నారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కూడా భారత మాజీ ప్రధానికి నివాళులర్పించారు.
అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తన నివాళి సందేశంలో.. బలమైన, ప్రగతిశీల భారతదేశాన్ని నిర్మించడంలో ఇందిరాగాంధీ ముఖ్యమైన పాత్ర పోషించారని పేర్కొన్నారు. ‘‘భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి, మా ఐకాన్ అయిన ఇందిరాగాంధీకి ఆమె వర్ధంతి సందర్భంగా వినయపూర్వక నివాళి. ఆమె బలమైన సంకల్పం, సమర్థవంతమైన నాయకత్వం, ప్రత్యేకమైన పని శైలి, దూరదృష్టితో బలమైన, ప్రగతిశీల భారతదేశాన్ని నిర్మించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు’’ అని ఖర్గే ఎక్స్ లో పోస్ట్ చేశారు.
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భారత మాజీ ప్రధానిని తొలిసారి కలిసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘శ్రీమతి ఇందిరాగాంధీ వర్థంతి సందర్భంగా ఆమెను స్మరించుకుంటున్నాను. 1975లో ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన డజను మందితో ప్రధాని ఆమె ఇంట్లో చర్చ నిర్వహించినప్పుడు విద్యార్థి నాయకుడిగా ఆమెను తొలిసారి కలిశాను. రెండు నెలల తర్వాత స్విస్ యూత్ మ్యాగజైన్ కోసం ఆమెను ఇంటర్వ్యూ చేయగలిగాను. తిరువనంతపురంలో ఆమె స్మృతికి నివాళులర్పిస్తున్నాను’’ అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.
కాగా.. 1917 నవంబర్ 19న భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ దంపతులకు జన్మించిన ఇందిరాగాంధీ 1966 జనవరి నుంచి 1977 మార్చి వరకు, 1980 జనవరి నుంచి 1984 అక్టోబర్ 31న హత్యకు గురయ్యే వరకు దేశానికి ప్రధానిగా సేవలు అందించారు. ఆమె భారతదేశానికి మొదటి, ఏకైక మహిళా ప్రధానిగా నిలిచారు.