అత్యాచారాలు, దోపిడీల్లో ముస్లింలు నెంబర్ 1 - ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ వివాదాస్పద వ్యాఖ్యలు

By Asianet News  |  First Published Oct 28, 2023, 10:45 AM IST

Badruddin Ajmal : ముస్లింలు అత్యాచారాలు, దోపిడీలు, లూటీల్లో నెంబర్ 1గా ఉన్నారని ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ అన్నారు. దీనికి చదువు లేకపోవడమే కారణమని అన్నారు. ముస్లిం యువతీ, యువకులు చదువుకోవాలని సూచించారు.


Badruddin Ajmal : అస్సాం ముస్లిం నేత, ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలలో నేరాల రేటు ఎక్కువగా ఉందని అన్నారు. దోపిడీలు, అత్యాచారాలు వంటి నేరాల్లో ముస్లింలు నెం.1గా ఉన్నామని అజ్మల్ వ్యాఖ్యానించారు. జైలుకు వెళ్లడంలో కూడా తామే నెంబర్ 1 అని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

అస్సాంలోని గోల్పారా జిల్లాలో అక్టోబర్ 20న జరిగిన పూర్వ విద్యార్థుల సమావేశానికి అజ్మల్ హాజరై మాట్లాడారు. ముస్లింలలో పెరుగుతున్న నేరాల రేటుతో ముడిపడి ఉన్న సమాజంలోని విద్యాపరమైన లోపాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘దోపిడీ, లూటీ, అత్యాచారం వంటి నేరాల్లో మనమే నెం.1గా ఉన్నాం. జైలుకు వెళ్లడంలో కూడా మనమే నెం.1. మన పిల్లలకు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లడానికి సమయం దొరకదు. కానీ జూదం ఆడటానికి, ఇతరులను మోసం చేయడానికి తగినంత సమయం దొరుకుతుంది. ఇది విచారకరం.’’ అని అన్నారు.

Latest Videos

undefined

అందరూ చంద్రుడు, సూర్యుడి వద్దకు వెళ్తున్నారని, కానీ జైలుకు ఎలా వెళ్లాలనే దానిపై మనం పీహెచ్ డీ చేస్తున్నామని చెప్పారు. ‘‘అబ్దుర్ రెహమాన్, అబ్దుర్ రహీం, అబ్దుల్ మజీద్, బద్రుద్దీన్, సిరాజుద్దీన్, ఫక్రుద్దీన్ ఇలా ఎవరు మెజారిటీలో ఉన్నారో పోలీస్ స్టేషన్ లోకి వెళితే తెలుస్తుంది కదా. ముస్లిం యువతకు విద్య, ఉపాధి ప్రాముఖ్యతను తెలియజేయాలి’’ అని అజ్మల్ అన్నారు. 

అయితే బద్రుద్దీన్ అజ్మల్ వ్యాఖ్యలపై కొన్ని వర్గాల నుండి విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ ఆయన తన వైఖరికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదని, నేరాలకు పాల్పడే ధోరణికి.. విద్య లేకపోవడమే కారణమని ఆయన శుక్రవారం పునరుద్ఘాటించారు. ‘ఇండియా టీవీ’తో ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజంలో విద్య లేకపోవడం నేను చూశాను. మా పిల్లలు చదవడం లేదు. ఉన్నత చదువులకు వెళ్లడం లేదు. కనీసం మెట్రిక్యులేషన్ కూడా పూర్తి చేయటం లేదు. యువతకు విద్య ఆవశ్యకతను వివరించడానికే నేను అలా చెప్పాను’’ అని అన్నారు. 

పురుషులు మహిళలను చూసేటప్పుడు లేదా వారితో సంభాషించేటప్పుడు దురుద్దేశాలు కలగకూదని అన్నారు. మహిళలను చూసి లైంగికంగా ఉత్తేజితులవుతారని చెప్పే అబ్బాయిలకు, ఇస్లాం ప్రవర్తించడానికి తగిన మార్గం ఉందని చెబుతుందని తెలిపారు. ‘‘మార్కెట్ లో లేదా ఇతర ప్రదేశంలో మహిళలను చూసినప్పుడు మనం దూరంగా ఉండాలని చెప్పాలనుకుంటున్నాను. మన కుటుంబాల్లో కూడా మహిళలున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వారి తల్లులు, సోదరీమణుల గురించి ఆలోచిస్తే, వారికి అనుచిత ఆలోచనలు రావు’’ అని బద్రుద్దీన్ అజ్మల్ అన్నారు.

కాగా.. సుగంధ ద్రవ్యాల వ్యాపారి అయిన బద్రుద్దీన్ అజ్మల్ నేతృత్వంలోని ఏఐయూడీఎఫ్ అస్సాంలోని బెంగాలీ మాట్లాడే ముస్లింలలో ఆధిపత్యం కలిగి ఉంది. 126 మంది సభ్యులున్న అస్సాంలో అసెంబ్లీలో ఏఐయూడీఎఫ్ కు 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బద్రీద్దీన్ అజ్మల్ కూడా 2009 నుంచి లోక్ సభ ఎంపీగా కొనసాగుతున్నారు. 

click me!