ప్రియుడితో కలిసి మహిళ మాస్టర్ ప్లాన్.. భర్త మృతి కేసులో షాకింగ్ విషయాలు.. అత్తను కూడా అలానే చంపేసిందా?

By Sumanth KanukulaFirst Published Dec 4, 2022, 10:15 AM IST
Highlights

మహారాష్ట్ర రాజధాని ముంబైలో మృతిచెందిన ఓ వ్యక్తి కేసులో వెలుగులోకి వచ్చిన విషయాలు పోలీసులను సైతం ఆశ్చర్యపరిచాయి. స్లో పాయిజన్‌తో అతడిని కట్టుకున్న భార్యే.. ఆమె ప్రియుడితో కలిసి అనుమానం రాకుండా హత్య చేసినట్టుగా గుర్తించారు. 

మహారాష్ట్ర రాజధాని ముంబైలో మృతిచెందిన ఓ వ్యక్తి కేసులో వెలుగులోకి వచ్చిన విషయాలు పోలీసులను సైతం ఆశ్చర్యపరిచాయి. స్లో పాయిజన్‌తో అతడిని కట్టుకున్న భార్యే.. ఆమె ప్రియుడితో కలిసి అనుమానం రాకుండా హత్య చేసినట్టుగా గుర్తించారు.  నిందితులిద్దరిపై ఐపీసీ సెక్షన్‌ 302, 328, 120(బీ) కింద కేసు నమోదు చేసిన ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వివరాలు.. కవిత, కమల్‌కాంత్ భార్యభర్తలు. అయితే వీరు కొన్నేళ్ల క్రితం విడిపోయారు. అయితే కవిత హితేష్‌ జైన్‌తో ప్రేమలో ఉంది. కమల్‌కాంత్, హితేష్‌లు చిన్ననాటి స్నేహితులు. ఇద్దరు కూడా బిజినెస్ ఫ్యామిలీస్‌కు చెందినవారు. 

అయితే పిల్లల భవిష్యత్తు గురించి చెబుతూ.. కవిత శాంతాక్రజ్‌లోని కమల్‌కాంత్ ఇంటికి తిరిగి వచ్చింది. ఇంతలోనే కమల్‌కాంత్ తల్లి కడుపు నొప్పితో బాధపడుతూ హఠాత్తుగా మరణించారు. ఆ తర్వాత కొన్ని నెలలకు కమల్‌కాంత్‌కు కూడా కడుపునొప్పి వచ్చింది. అతడి ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. అయితే కమల్‌కాంత్‌కు ఆస్పత్రిలో చికిత్స అందించిన వైద్యులు.. అతని రక్తంలో ఆర్సెనిక్, థాలియం చాలా ఎక్కువ స్థాయిలో పరీక్షల్లో గుర్తించారు. రక్తంలో అసాధారణమైన లోహ పదార్థాలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పరిస్థితి విషమించడంతో కమల్‌కాంత్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 19న మరణించారు.

ఈ ఘటనకు సంబంధించి శాంతాక్రజ్‌లోని పోలీసులు మొదట ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేశారు. అయితే ఆ తర్వాత కుట్ర కోణం అనుమానంతో.. కేసు దర్యాప్తును ముంబై పోలీసుల క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించారు. ఈ క్రమంలోనే దర్యాప్తు చేపట్టిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. కవితతో సహా కుటుంబ సభ్యుల వాంగ్మూలాలతో సేకరించారు. కమల్‌కాంత్ అన్ని వైద్య నివేదికలను.. అలాగే అతని డైట్‌కు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. ఈ క్రమంలోనే పోలీసులు సంచలన విషయాలు గుర్తించారు. కమల్‌కాంత్ మృతి వెనక కుట్ర కోణం ఉందని గుర్తించారు. హితేష్‌తో కలిసి కవిత భర్తను తొలగించేందుకు కుట్ర పన్నినట్టుగా గుర్తించారు. ఇందుకోసం చాలా కాలంగా కమల్‌కాంత్‌ తినే పానీయాల్లో ఆర్సెనిక్‌, థాలియంను ఎవరికి తెలియకుండా చాలా తెలివిగా కలిపినట్టుగా కనుగొన్నారు. ఈ లోహాలు శరీరం లోపల రక్తంలో ఉంటాయని.. కానీ అది సాధారణం కంటే ఎక్కువగా ఉంటే విషంగా మారతాయని.. కమల్‌కాంత్ విషయంలో ఇదే జరిగిందని పోలీసులు తెలిపారు. 

కవితను, హితేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్తి కోసమే కవిత ప్రియుడితో కలిసి ఈ విధంగా చేసినట్టుగా తెలుస్తోంది. అయితే కమల్‌కాంత్ తల్లికి కూడా విషప్రయోగం జరిగిందా అనే కోణంలో పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. కమల్‌కాంత్ తల్లి కూడా అతడికి మాదిరిగా అనారోగ్యం లక్షణాలతో మరణించడంతో పోలీసులు ఆ దిశగా విచారణ జరుపుతున్నారు. 

click me!