
మహారాష్ట్రలోని నవీ ముంబైలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఆరెంజ్ పండ్ల బాక్సుల్లో దాచిపెట్టి అక్రమంగా తరలిస్తున్న రూ.1,476 కోట్ల విలువైన 198 కిలోల హై ప్యూరిటీ క్రిస్టల్ మెథాంఫెటమైన్ (ఐస్), 9 కిలోల హై ప్యూరిటీ కొకైన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు పట్టుకున్న యాంఫెటమైన్, కొకైన్‌లలో ఇదే పెద్ద మొత్తమని అధికారులు చెబుతున్నారు.
ఇక, క్రిస్టల్ మెథాంఫేటమిన్ అనేది సింథటిక్ డ్రగ్, చాలా అడిక్టివ్. క్రిస్టల్ మెథాంఫేటమిన్ అధిక స్వచ్ఛత స్థాయిని కలిగి ఉంటుంది. దీర్ఘకాలిక, తీవ్రమైన శారీరక ప్రభావాలను కలిగి ఉండవచ్చు. ధూమపానం లేదా డ్రగ్‌ను ఇంజెక్ట్ చేసుకునే వారు తీవ్రమైన అనుభూతిని అనుభవిస్తారు. గరిష్టంగా 12 గంటలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఆ ప్రభావం ఉంటుంది.
ఇక, దక్షిణాఫ్రికా నుంచి వాలెన్సియా ఆరెంజ్‌ల మధ్య డ్రగ్స్‌ను అక్రమంగా తరలిస్తున్నారని.. స్మగ్లర్లు ముంబైని ట్రాన్సిట్ పాయింట్‌గా మార్చుకుని యూరప్ దేశాలకు లేదా యుఎస్‌కు సరఫరా చేస్తున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇక, డీఆర్‌ఐ అధికారులు ఇందుకు సంబంధించి దిగుమతిదారుని అరెస్టు చేశారు. అతని ప్రస్తుతం విచారిస్తున్నారు. ఈ రాకెట్‌లో పాల్గొన్న కస్టమ్స్ హౌస్ ఏజెంట్ మరియు సిండికేట్ కోసం వెతుకుతోంది.
అసలేం జరిగిందంటే..
ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల ఆధారంగా 10-12 రోజుల పాటు అధికారులు నిఘా నిర్వహించారు. అధికారులు నవీ ముంబైలో కొన్ని కోల్డ్ స్టోరేజీలలో నుంచి పండ్ల సరకుల కోసం చూస్తున్నారు. సెప్టెంబర్ 30న అధికారులు దిగుమతి చేసుకున్న నారింజలను తీసుకువెళుతున్న ఒక ట్రక్కును వాషిలో అడ్డుకున్నారు. పరిశీలనలో.. వాలెన్సియా నారింజలను తీసుకెళ్తున్న డబ్బాల్లో డ్రగ్స్ దాచిపెట్టినట్లు గుర్తించారు.