చిన్ననాటి స్నేహితురాలు రాధిక‌తో అనంత్ అంబానీ నిశ్చితార్థం.. ఆమె బ్యాగ్రౌండ్ ఇదే..

By Sumanth KanukulaFirst Published Dec 29, 2022, 4:19 PM IST
Highlights

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ నిశ్చితార్థం జరిగింది.

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ నిశ్చితార్థం జరిగింది. వీరేన్ మర్చంట్, శైలా మర్చంట్ కుమార్తెల రాధిక మర్చంట్‌తో అనంత్ అంబానీ నిశ్చితార్థం (రోకా) జరిగింది. రాజస్థాన్‌ నాథ్‌ద్వారాలోని లార్డ్ శ్రీనాథ్‌జీ ఆలయంలో ఇరుకుటుంబాలకు చెందిన సన్నిహితులు, స్నేహితులు సమక్షంలో ఈ నిశ్చితార్థ వేడుకను నిర్వహించారు. కాబోయే వధూవరులను ఆలయ పూజారులు ఆశీర్వదించారు. 

అనంత్, రాధికలు.. శ్రీనాథ్‌జీ ఆశీర్వాదాలను కోరుతూ ఆలయంలో రోజంతా గడిపారు. ఆలయంలో సాంప్రదాయ రాజ్-భోగ్-శ్రీంగార్ వేడుకల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత  కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఈ సంతోషకరమైన సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకన్నారు. అనంత్, రాధికలు చిన్ననాటి స్నేహితులు. వీరు చాల కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ముఖేష్ అంబానీ కుటుంబంలో జరిగిన పలు ఫంక్షన్‌లో రాధిక కనిపించారు.


ఇక, అనంత్-రాధికల నిశ్చితార్థానికి సంబంధించి ఒక ప్రకటన కూడా వెలువడింది. ‘‘అనంత్, రాధిక ఒకరికొకరు కొన్నేళ్లుగా తెలుసు. ఈ రోజు వేడుక రాబోయే నెలల్లో జరిగే వారి వివాహం కోసం లాంఛనప్రాయ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. రాధిక, అనంత్ కలిసి వారి ప్రయాణాన్ని ప్రారంభించినందున ఇరు కుటుంబాలు ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలు, శుభాకాంక్షలను కోరుకుంటాయి’’ అందులో పేర్కొన్నారు. 

ముఖేష్ అంబానీ సన్నిహితుడు, రాజ్యసభ సభ్యులు పరిమల్ నత్వానీ ట్విట్టర్ వేదికగా అనంత్, రాధికలకు శుభాకాంక్షలు  తెలియజేశారు. ‘‘ప్రియమైన అనంత్, రాధికల రోకా వేడుక నాధ్‌ద్వారాలోని శ్రీనాథ్‌జీ ఆలయంలో జరిగింది. వారికి హృదయపూర్వక అభినందనలు. లార్డ్ శ్రీనాథ్ జీ ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను’’ అని ఆయన ట్వీట్ చేశారు.

అనంత్ యూఎస్‌లోని బ్రౌన్ యూనివర్శిటీ నుంచి తన చదువును పూర్తి చేశారు. అప్పటి నుంచి జియో ప్లాట్‌ఫారమ్‌లు, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ బోర్డులలో సభ్యునిగా ఉండటంతో పాటుగా.. వివిధ హోదాలలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో పనిచేశారు. అనంత్ ప్రస్తుతం రియల్ ఇండస్ట్రీస్ ఇంధన వ్యాపారానికి నాయకత్వం వహిస్తున్నారు. 

ఇక, రాధిక న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. బోర్డ్ ఆఫ్ ఎన్‌కోర్ హెల్త్‌కేర్‌లో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆమె ఎనిమిదేళ్లు భరతనాట్యంలో శిక్షణ పొందారు. ఆమె శ్రీ నిభా ఆర్ట్స్ గురు భావన థాకర్ శిష్యురాలు. ఈ ఏడాది జూన్ 5న ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లోని గ్రాండ్ థియేటర్‌లో ఆమె భరతనాట్య అరంగేట్రం కార్యక్రమం నిర్వహించబడింది. రాధికకు అనంత్ తల్లి నీతాకు మంచి బాండింగ్ ఉందని చెబుతారు. 
 

click me!