
Karnataka assembly polls: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్త భారత్ జోడో యాత్రను చేపట్టారు. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కొనసాగే ఈ యాత్ర ప్రస్తుతం కర్నాటకలో ఉంది. వచ్చే ఏడాది కర్నాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రస్తుతం రాహుల్ గాంధీ యాత్రను ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్ జోడో యాత్ర తరహాలో రాష్ట్రవ్యాప్త యాత్రలను సైతం చేపట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాంగ్రెస్ దేశవ్యాప్త భారత్ జోడో యాత్ర కర్ణాటక గుండా వెళుతుండగా, వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు సమాజంలోని అన్ని వర్గాలకు చేరువయ్యేందుకు రాష్ట్రంలోనూ ఇదే తరహా పాదయాత్రలు నిర్వహిస్తామని ఆ పార్టీ ఆదివారం తెలిపింది. రాబోయే కొద్ది నెలల్లో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని కవర్ చేస్తూ మూడు యాత్రలు నిర్వహిస్తామని భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న కర్ణాటక కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా తెలిపారు.
వారు విభజిస్తున్నారు.. మేమే ఏకం చేస్తాం..
“మేము రాష్ట్రంలో (కర్నాటక) ప్రతి నియోజకవర్గాన్ని, అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ మూడు యాత్రలు చేపడతాము. ఈ 40 పర్సెంట్ కమీషన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడానికి ప్రజల ముందుకు వెళ్తాము” అని రణదీప్ సూర్జేవాలా తెలిపారు. ఈ క్రమంలోనే ఆయన అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ విభజించాలనుకునే భారతదేశాన్ని కాంగ్రెస్ ఏకం చేస్తుందని చెప్పిన ఆయన.. సమాజంలో శాంతి సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుందని నొక్కి చెప్పారు. "సమాజాన్ని కులం, మతం, మతాల ప్రాతిపదికన విభజించడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. ఎన్నికల ప్రయోజనాల కోసం పార్టీ ఒక వర్గాన్ని మరొక వర్గానికి వ్యతిరేకంగా ఊసిగొల్పుతోంది.. అనేక రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి" అని ఆయన అన్నారు. బీజేపీ ఈ మతపరమైన విభజన లక్ష్యం ఓట్లను సంపాదించడం మాత్రమేనని ఆయన ఆరోపించారు.
పంటలకు మద్దతు ధర కల్పిస్తాం..
కాగా, కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర ఆదివారం నాటికి 32వ రోజుకు చేరుకుని 700 కిలోమీటర్లకు పైగా పూర్తి చేసుకుంది. సెప్టెంబరు 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమైన యాత్ర 3,500 కిలోమీటర్లు పూర్తి చేసుకుని 12 రాష్ట్రాల గుండా జమ్మూ కాశ్మీర్‌లో ముగుస్తుంది. “మేము కలిసి వుంచడానికి ప్రయత్నం చేస్తున్నాం.. వారు (బీజేపీ) దానిని విచ్ఛిన్నం చేస్తున్నారు. ద్వేషాన్ని వ్యాప్తి చేయడం ద్వారా బీజేపీ సమాజాన్ని విడదీస్తుంది. అయితే, మేము ప్రజలను ప్రేమ, ఆప్యాయతతో ఏకం చేయడానికి ప్రయత్నిస్తాము. అవి మత సామరస్యాన్ని నాశనం చేస్తాయి.. సమాజంలో ప్రేమ-సోదరభావాన్ని వ్యాప్తి చేయడానికి మేము కృషి చేస్తాము”అని సుర్జేవాలా అన్నారు. స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్, ఈస్టిండియా కంపెనీ చేసినట్లే సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. కర్ణాటకలో కొబ్బరికి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కల్పిస్తామనీ, ఎంఎస్పీ కింద రాగుల కొనుగోళ్లను పెంచుతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని తెలిపారు. అయితే, రైతులు ఇబ్బందులు పడుతున్న బీజేపీ సర్కారు మాత్రం ఏమి చేయడం లేదని ఆయన విమర్శించారు.
బీజేపీ విమర్శలు..
ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో ఆ పార్టీ ఎప్పటికీ అధికారంలోకి రాదనీ, రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర'కు విలువ లేదని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అగ్రనేత బీఎస్ యడియూరప్ప ఆదివారం అన్నారు. “ఒకటి రెండు చోట్ల మినహా భారతదేశంలో మీ (రాహుల్ గాంధీ) పార్టీ ఉనికి తగ్గిపోతోంది. కర్ణాటకలో ఒకరకంగా ఊపిరి పీల్చుకుంటున్నారు. కాబట్టి, ఆయన (రాహుల్ గాంధీ) తన మనసుకు ఏది అనిపిస్తే అది మాట్లాడుతున్నారు, కానీ దాని వల్ల ప్రయోజనం లేదు ”అని యడ్యూరప్ప రామనగరలోని హరిసంద్ర గ్రామంలో మీడియాతో అన్నారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై భారత్ జోడో యాత్ర ప్రభావం ఎలా ఉంటుందన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ‘‘కర్ణాటకలో కాంగ్రెస్ ఎప్పటికీ అధికారంలోకి రాదు. రాష్ట్ర పర్యటనకు, భారత్ జోడో యాత్రకు ఎలాంటి విలువ లేదు' అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్‌లో పర్యటించి అనేక మంది మహిళా అభ్యర్థులను నిలబెట్టారనీ, అయినప్పటికీ కాంగ్రెస్ రెండు సీట్లు గెలవలేకపోయిందని యడియూరప్ప అన్నారు.