
Monkeypox disease: 2020లో వెలుగులోకి వచ్చిన కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. కోవిడ్-19 నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచ దేశాలకు మరో భయం పట్టుకుంది. అదే మంకీపాక్స్. ఎక్కువగా ఆఫ్రికా దేశాల్లో కనిపించే మంకీపాక్స్ కేసులు ఇటీవల ఇతర దేశాల్లో వెలుగులోకి రావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా వైరస్ లా విజృంభిస్తుందనే భయాందోళనలు ఉన్నాయి. తాజాగా భారత్ లోకి మంకీపాక్స్ ప్రవేశించింది. కేరళలో మొదటి కేసును గుర్తించారు. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను హెచ్చరించింది. భారత్ లో మొదటి కేసు గుర్తించిన తర్వాత ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) నిపుణులు దీనిపై స్పందిస్తూ.. దేశంలో మంకీపాక్స్ వ్యాప్తి తక్కువగానే ఉంటుందని పేర్కొంటూనే.. ఇది పిల్లలకు ప్రాణాంతకమంటూ హెచ్చరించింది.
AIIMSలోని మెడిసిన్ విభాగం డాక్టర్ పీయూష్ రంజన్ ANIతో మాట్లాడుతూ.. మంకీపాక్స్ ఇన్ఫెక్టివిటీ తక్కువగా ఉంటుంది. అయితే ఇది పిల్లలలో ప్రాణాంతకం కావచ్చు. కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్‌కి ఎక్కువ ట్రాన్స్‌మిసిబిలిటీ ఉంది. అయితే మంకీపాక్స్ ఇన్‌ఫెక్షన్ సోకిన వ్యక్తితో ఎక్కువ కాలం బహిర్గతం అయిన తర్వాత వస్తుంది. కాబట్టి కోవిడ్‌లో ఇన్‌ఫెక్షన్ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. సోకిన వ్యక్తి చాలా మందికి సోకవచ్చు. కానీ మంకీపాక్స్ వ్యాధి తక్కువగా ఉంటుందన్నారు. అలాగే, మంకీపాక్స్ లక్షణాలను గురించి వివరిస్తూ.. మంకీపాక్స్ లక్షణాలు మశూచి, చికెన్‌పాక్స్ లాంటివని తెలిపారు. ప్రారంభంలో రోగులకు జ్వరం రావడంతో పాటు శోషరస కణుపుల శరీరంపై విస్తరిస్తాయని చెప్పారు. 1-5 రోజుల తర్వాత రోగి ముఖం, అరచేతులు, అరికాళ్ళపై దద్దుర్లు వస్తాయని తెలిపారు. అంధత్వానికి దారితీసే కార్నియాలో దద్దుర్లు ఉండవచ్చన్నారు.
మంకీపాక్స్ కేసులు దేశంలో వెలుగుచూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే మంకీపాక్స్ వ్యాధి నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. మంకీపాక్స్ బారినపడ్డ వ్యక్తులతో సంబంధాలను నివారించుకోవాలని పేర్కొంది. చనిపోయిన, ప్రాణాలతో ఉన్న అడవి జంతువులకు దూరంగా ఉండటం మంచిదని సూచించింది. మంకీపాక్స్ సోకిన వ్యక్తులను ఇప్పటికే కలిసి ఉంటే స్థానికంగా ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో సమాచారం అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మంకీపాక్స్ ను ఎదుర్కొవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగానే ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే మంకీపాక్స్ వైరస్ ను గుర్తించడానికి దేశవ్యాప్తంగా ఉన్న 15 వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నొస్టిక్ లేబొరేటరీలు మంకీపాక్స్ ను ఎదుర్కొనేందుకు సంసిద్ధతకు సహాయం చేయడానికి పూణేలోని ICMR -NIV ద్వారా రోగనిర్ధారణ పరీక్షలో ఇప్పటికే శిక్షణ పొందాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలియజేసింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుండి మూడు రోజుల క్రితం కేరళకు చేరుకున్న ఒక ప్రయాణికుడికి వైరల్ వ్యాధికి పాజిటివ్ పరీక్షించి తర్వాత గురువారం నాడు భారతదేశం తన మొదటి మంకీపాక్స్ కేసును నివేదించింది. కేరళలోని కొల్లాం జిల్లాలో మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణ అయిన నేపథ్యంలో ప్రజారోగ్య చర్యలను ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ఆరోగ్య అధికారులతో సహకరించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ఉన్నత స్థాయి మల్టీ-డిసిప్లినరీ బృందాన్ని కేరళకు తరలించింది.