కేసీఆర్‌కు స్టాలిన్ షాక్: కాంగ్రెస్ ఫ్యాక్టర్, కేసీఆర్‌కు అందని ఆహ్వానం

Published : Mar 02, 2023, 10:21 AM IST
కేసీఆర్‌కు స్టాలిన్ షాక్: కాంగ్రెస్ ఫ్యాక్టర్, కేసీఆర్‌కు అందని ఆహ్వానం

సారాంశం

డీఎంకే అధ్యక్షులు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యత కోరుతూ స్టాలిన్ చేసిన ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 

డీఎంకే అధ్యక్షులు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. థర్డ్ ఫ్రంట్ ఆలోచనలను తిరస్కరించడంతో పాటుగా.. కాంగ్రెస్‌ లేకుండా కూటమిని ఏర్పాటు చేయాలన్న ప్రయత్నం అర్దరహితం అని అన్నారు. అలాగే ఎన్నికల తర్వాత కూటమి ఏర్పాటు వంటి ఆలోచనలు కూడా సరికావని చెప్పారు. బీజేపీని వ్యతిరేకించే అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపై నిలబడాలని కూడా స్టాలిన్ పిలపునిచ్చారు. బుధవారం(మార్చి 1) తన 70వ  జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నైలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో స్టాలిన్ ప్రసంగించారు. జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యత కోరుతూ స్టాలిన్ చేసిన ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 

‘‘కాంగ్రెస్ లేని కూటమిని తిరస్కరించాలి. అది విజయవంతం కాదు. ఎన్నికల తర్వాత పొత్తు కూడా ఆచరణ సాధ్యం కాదు. థర్డ్‌ ఫ్రంట్‌ గురించి మాట్లాడటం అర్థరహితం. ఈ సరళమైన ఎన్నికల అంకగణితాన్ని అర్థం చేసుకుని ఏకతాటిపై నిలబడాలని బీజేపీని వ్యతిరేకించే అన్ని రాజకీయ పార్టీలను నేను వినమ్రంగా అభ్యర్థిస్తున్నాను’’ అని స్టాలిన్ పేర్కొన్నారు. ‘‘2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎవరు అధికారంలోకి రాకూడదు అనేది కీలకం. ఎన్నికల తర్వాత ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది కాదు’’ అని స్టాలిన్ స్పష్టం చేశారు. 

జాతీయ స్థాయిలో ఐక్యత కోసం రాష్ట్ర రాజకీయాలను అనుమతించకుండా చూసుకోవాలని ప్రాంతీయ పార్టీలకు స్టాలిన్ పిలుపునిచ్చారు. ‘‘అలా జరగని పక్షంలో మనం నష్టపోతాం’’ అని స్టాలిన్ హెచ్చరించారు. ఇది తన పుట్టినరోజు మాత్రమే కాదని.. భారతదేశంలో కొత్త రాజకీయాలకు కొత్త నాంది పలికినందుకు సంతోషంగా ఉందని స్టాలిన్ అన్నారు. నిర్మాణాత్మక కార్యక్రమం ఆధారంగా భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ ప్లీనరీలో ఆమోదించిన తీర్మానాన్ని ఉత్తమ జన్మదిన కానుకగా ఆయన అభివర్ణించారు. దేశంలోని భిన్నత్వం, ప్రజల ఐక్యతను కాపాడేందుకు బీజేపీ వ్యతిరేక పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన ఆవశ్యకతను భారత ఉపఖండం మొత్తానికి తీసుకెళ్లి పార్లమెంటు ఎన్నికల్లో విజయానికి పునాది వేయాలని కోరారు. 

కేసీఆర్‌కు అందని ఆహ్వానం..!
అయితే ఈ బహిరంగ సభకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత, జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా, సమాజ్‌వాదీ పార్టీ నేత, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌, బీహార్‌ ఉప ముఖ్యమంత్రి, ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్‌ హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్‌లకు ఆహ్వానం అందలేనట్టుగా తెలుస్తోంది. 

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌.. కేంద్రంలోని అధికార బీజేపీతో సత్సబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు. మరోవైపు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇందుకోసం బీఆర్ఎస్‌తో రంగంలోకి కూడా దిగారు. ఆయన కాంగ్రెస్‌ను కలుపుకుపోవడానికి సిద్దంగా లేనట్టుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే కేసీఆర్ పలు విపక్ష పార్టీలతో చర్చలు జరుపుతున్నప్పటికీ.. అందులో చాలా పార్టీలు కాంగ్రెస్‌కు మిత్రపక్షాలుగా ఉన్నవే. ఎన్సీపీ, ఆర్‌జేడీ, డీఎంకే.. ఈ పార్టీలన్నీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి ముందుకు సాగుతామనే సంకేతాలను పంపిస్తున్నాయి. మరోవైపు ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ కూడా విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా మాత్రమే బీజేపీని ఎదురించగలమనే భావనతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. 

తాజాగా స్టాలిన్‌ జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. కాంగ్రెస్‌ లేకుండా కూటమి సాధ్యం కాదని స్టాలిన్ తేల్చిచెప్పారు. ఎన్నికల తర్వాత కూటమి ఏర్పాటు కూడా సరికాదని అన్నారు. తద్వారా కేసీఆర్‌కు ఒక రకంగా స్టాలిన్‌ షాక్ ఇచ్చారనే చెప్పాలి. ఈ పరిణామాల నేపథ్యంలో.. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్‌తో కలిసొచ్చేవారు ఎవరనేది కూడా చర్చనీయాంశంగా మారింది. 

స్టాలిన్‌ను జాతీయ నేతగా.. 
ఇదే వేదికపై నుంచి ప్రసంగించిన ఫరూక్ అబ్దుల్లా.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపై నిలబడి గెలిస్తే డీఎంకే అగ్రనేత ప్రధాని అయ్యే అవకాశాలున్నాయని, ఆయన జాతీయ వేదికపైకి రావాలని కోరారు. ప్రధాని ఎంపిక గురించి మరచిపోయి వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంపై మాత్రమే దృష్టి పెట్టాలని కాంగ్రెస్‌కు సూచించారు. ప్రధాన మంత్రి కాదని.. దేశం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?