KTR: కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని కీలకమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు కుంగడం కలకలం రేపింది. ఈ అంశంపై కేసీఆర్ సర్కార్‌ను విపక్షాలు తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నాయి.
KTR: బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నిర్మించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ప్రాజెక్ట్ లోని కీలకమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు కుంగడం కలకలం రేపింది. ఈ తరుణంలో బ్యారేజ్ నిర్మాణంలో లోపాలపై కేసీఆర్ సర్కార్‌ను విపక్షాలు తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నిపుణుల బృందానికి ఆగమేఘాల మీద మేడిగడ్డకు పంపింది.
ఈ సందర్భంలో తెలంగాణ భవన్ లో బుధవారం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగిన అంశంపై నిపుణుల నుంచి నివేదిక వచ్చాకే మాట్లాడతానని మంత్రి స్పష్టం చేశారు. బ్యారేజ్ లోని పిల్లర్లు కుంగడానికి గల కారణాలను నిపుణులు అన్వేషిస్తున్నారని, వారు ఏం చెబుతారో వేచి చూడాలని అన్నారు. ఈ ఇష్యూను కాంగ్రెస్, బీజేపీ లు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రధాని మోడీ స్వరాష్ట్రం గుజరాత్ లో కేబుల్ బ్రిడ్జి కూలిపోయి.. 130మంది మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. అయినా ఆ ఘటనపై ఎందుకు మాట్లాడరని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తే.. గత తొమ్మిదిన్నరేళ్లుగా విపక్షాలు విమర్శిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
undefined
ఖర్గే నీ గౌరవం కాపాడుకో..
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ను టార్గెట్ చేసి మాట్లాడారు. ఖర్గే అంటే గౌరవం ఉందని, ఆ గౌరవాన్ని కాపాడుకోవాలని మంత్రి కేటీఆర్ హితవు పలికారు. ఖర్గే సొంతరాష్ట్రం కర్ణాటకలో రైతులు కరెంటు కోతలు తిప్పలు పడుతున్నారు. వారి కనీసం ఐదుగంటల కరెంటు ఇవ్వడం లేదని విమర్శించారు. రైతులను అక్కడి కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదని అన్నారు. అక్కడ హామీలు అమలు చేయని కాంగ్రెస్ .. తెలంగాణలో అధికారంలోకి వస్తే.. ఎలా హామీలను అమలు చేస్తుందని ప్రశ్నించారు.
రైతుల కష్టాలను అర్థం చేసుకోలేని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. తెలంగాణను ఉంచుతదా.. ముంచుతదా? అని ప్రశ్నించారు. గ్రహపాటునో.. పొరపాటునో కాంగ్రెస్ పార్టీకి ఓ ఓటు వేస్తే.. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లేనని హెచ్చరించారు. 24 గంటల కరెంటు కావాలో.. 3 గంటల కరెంటు కావాలో రైతులే ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. 11 సార్లు అవకాశం ఇచ్చినా పని చేయని కాంగ్రెస్ మళ్లీ చాన్స్ ఇస్తే ఏం చేస్తారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చేతిలోకి రాష్ట్రంలో పోతే.. ప్రజలు ఆగమవుతారని మంత్రి కేటీఆర్ అన్నారు.