Karnataka Hijab Row: అల్లరిమూకను ఎదిరించి నిలిచింది.. ఆ యువతికి సెల్యూట్ : అసదుద్దీన్ ఒవైసీ

Siva Kodati |  
Published : Feb 08, 2022, 05:22 PM IST
Karnataka Hijab Row: అల్లరిమూకను ఎదిరించి నిలిచింది.. ఆ యువతికి సెల్యూట్ : అసదుద్దీన్ ఒవైసీ

సారాంశం

కర్ణాటక(Karnataka)లో హిజాబ్ వివాదం(Hijab Row) ముదురుతోంది. ఈ నేపథ్యంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్  ఒవైసీ స్పందించారు. యువకులను ఎదిరించిన యువతికి వందనాలంటూ ఆమెను ప్రశంసించారు. అలాగే అలాంటి ధైర్యవంతురాలిని కన్న తల్లిదండ్రులకు ఒవైసీ అభినందనలు తెలియజేశారు. 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటకలోని హిజబ్ వ్యవహారంపై ఎంఐఎం అధినేత (aimim) హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (asaduddin owaisi) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యువకులను ఎదిరించిన యువతికి వందనాలంటూ ఆమెను ప్రశంసించారు. అలాగే అలాంటి ధైర్యవంతురాలిని కన్న తల్లిదండ్రులకు ఒవైసీ అభినందనలు తెలియజేశారు. అల్లరిమూకను ఎదిరించి ఆమె ధైర్యంగా ముందుకు వెళ్లిందని ఒవైసీ ప్రశంసించారు. అందరూ ఆమెలా ధైర్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. 

మరోవైపు కర్ణాటక(Karnataka)లో హిజాబ్ వివాదం(Hijab Row) ముదురుతోంది. విద్యా సంస్థలోకి హిజాబ్ ధరించి రావడాన్ని నిరసిస్తూ కొందరు విద్యార్థులు కాషాయ వర్ణపు కండువాలను ధరించి కాలేజీకి వచ్చారు. తొలిసారిగా గత నెల ఉడిపిలోని ఓ ప్రభుత్వ కాలేజీలో ఈ వివాదం రాజుకుంది. కాలేజీ యూనిఫామ్ నిబంధనలను అతిక్రమించి ముస్లిం విద్యార్థులు హిజాబ్ ధరించి వస్తున్నారని ఇంకొందరు విద్యార్థులు వాదనలకు దిగారు. క్రమంగా అది పెద్ద వివాదంగా మారింది. క్రమంగా ఇది రాష్ట్రవ్యాప్తంగా మంటలు రాజేసింది. ఇది రెండు వర్గాల మధ్య వైరంగా మారుతున్నది. ప్రస్తుతం ఈ వివాదం హైకోర్టుకు చేరిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా, ఓ వీడియో ఇప్పుడు మరిన్ని ఆందోళనలు కలిగిస్తున్నది. శిమోగా జిల్లాలోని ఓ కాలేజీలో జాతీయ జెండా ఎగరేసే పోల్‌కు త్రివర్ణ పతాకానికి బదులు కాషాయ జెండా(Saffron Flag)ను ఎగరేశారు. ఓ విద్యార్థి కాలేజీ ఆవరణలోని జెండా ఎగరేసే పోల్ ఎక్కాడు. అక్కడ కాషాయ జెండాను ఎగరేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ పోల్‌పై కాషాయ జెండా ఎగరేస్తుండగా అక్కడు గుమిగూడి ఉన్న మెజార్టీ స్టూడెంట్లు కేకలు వేస్తూ చిందులు వేశారు.

శిమోగాలో ఇవాళ 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం రాళ్లు విసిరేసుకున్న ఘటన రిపోర్ట్ కావడంతో అధికారులు అప్రమత్తమై 144 సెక్షన్ విధించారు. బగల్‌కోట్‌లో ఈ వివాదం కారణంగా రెండు వర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్లు విసిరేసుకున్నారు. ఈ ఘటన హింసాత్మకంగా మారుతుండటంతో పోలీసులు లాఠీ చార్జ్ చేయక తప్పలేదు.

త్రివర్ణ పతాకం స్థానంలో కాషాయ జెండా ఎగరేసిన ఘటనపై కర్ణటాక కాంగ్రెస్ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ స్పందించారు. కర్ణాటకలోని కొన్ని విద్యా సంస్థల్లో పరిస్థితులు చేయి దాటిపోయాయని పేర్కొన్నారు. ఒక చోటనైతే.. జాతీయ జెండాకు బదులు కాషాయ జెండా ఎగరేశారని వివరించారు. ఈ వివాదంతో సున్నిత పరిస్థితులు ఏర్పడ్డ విద్యాసంస్థలు కనీసం వారం పాటు కాలేజీలను క్లోజ్ చేయడం ఉత్తమం అని తాను భావిస్తున్నట్టు ట్వీట్ చేశారు. శాంతియుత వాతావరణం ఏర్పడ్డ తర్వాత ఆ విద్యాసంస్థలను మళ్లీ తెరుచుకోవాలని పేర్కొన్నారు. విద్యా బోధనను ఆన్‌లైన్‌లోనే కొనసాగించుకోవచ్చని వివరించారు.

కాగా, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నిన్న స్పందించారు. భారత రాజ్యాంగాన్ని ఉటంకిస్తూ తమ ప్రభుత్వ వైఖరిని సమర్థించుకున్నారు. స్కూల్స్, కాలేజీల్లో పాటించాల్సిన ఏకరీతి విధానాలపై రాజ్యాంగం స్పష్టంగా పేర్కొన్నదని సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో పాటించాల్సిన యూనిఫార్మిటీ గురించి రాజ్యాంగంలో ప్రత్యేక రూల్స్ ఉన్నాయని వివరించారు. ఎడ్యుకేషన్ యాక్ట్‌లో వీటిని స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. విద్యా సంస్థల్లో అవలంబించాల్సిన విధానాలను ఈ చట్టాలు స్పష్టంగా వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ విషయమై తాము ఓ నోటిఫికేషన్ జారీ చేశామని చెప్పారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu