
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ వివాదం(Karnataka Hijab Row) ముదురుతున్నది. ఉడిపిలోని కాలేజీలో బద్ధలైన ఈ వివాదం క్రమంగా ఇతర జిల్లాలకూ పాకింది. ఈ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి. ఈ వివాదం ఇప్పుడు హైకోర్టు(High Court) ముందుకు చేరింది. ఉన్నత న్యాయస్థానం ఈ వివాదంపై వాదనలు వింటున్నది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కళాశాలలు, పాఠశాలలను మూడు రోజులు మూసేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా సీఎం బసవరాజ్ బొమ్మై(CM Basavaraj Bommai) ట్విట్టర్‌లో వెల్లడించారు.
కర్ణాటకలో హిజాబ్ వివాదంపై హైకోర్టు వాదనలు వింటున్న సంగతి తెలిసిందే. ఈ రోజు వాదనలు విన్నది. రేపు కూడా ఈ వాదనలు కోర్టులో కొనసాగనున్నాయి. ఈ వాదనలు వింటూనే హైకోర్టు విద్యార్థులకు, ప్రజలకు కొన్ని సూచనలు చేసింది. శాంతి భద్రతలను కాపాడాలని విద్యార్థులు, ప్రజలను హైకోర్టు కోరింది. ప్రజల్లో చైతన్యం, సత్ప్రవర్తన ఉంటుందని, అవి వారి నడవడికలోనూ అమలు చేస్తారని భావిస్తున్నట్టు పేర్కొంది.
కోర్టు ఈ వివాదంపై వాదనలు విని.. విచారణ వాయిదా వేయడానికి ముందు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ట్వీట్ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల, కళాశాల యాజమాన్యాలతోపాటు కర్ణాటక ప్రజలు శాంతి సామరస్యాన్ని కాపాడాలని తాను అప్పీల్ చేస్తున్నట్టు ట్వీట్ చేశారు. వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీలను మూసేయాల్సిందిగా తాను ఆదేశాలు జారీ చేసినట్టు వివరించారు. ఇందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండగా, ఓ వీడియో ఇప్పుడు మరిన్ని ఆందోళనలు కలిగిస్తున్నది. శిమోగా జిల్లాలోని ఓ కాలేజీలో జాతీయ జెండా ఎగరేసే పోల్‌కు త్రివర్ణ పతాకానికి బదులు కాషాయ జెండా(Saffron Flag)ను ఎగరేశారు. ఓ విద్యార్థి కాలేజీ ఆవరణలోని జెండా ఎగరేసే పోల్ ఎక్కాడు. అక్కడ కాషాయ జెండాను ఎగరేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ పోల్‌పై కాషాయ జెండా ఎగరేస్తుండగా అక్కడు గుమిగూడి ఉన్న మెజార్టీ స్టూడెంట్లు కేకలు వేస్తూ చిందులు వేశారు.
శిమోగాలో ఇవాళ 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం రాళ్లు విసిరేసుకున్న ఘటన రిపోర్ట్ కావడంతో అధికారులు అప్రమత్తమై 144 సెక్షన్ విధించారు. బగల్‌కోట్‌లో ఈ వివాదం కారణంగా రెండు వర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్లు విసిరేసుకున్నారు. ఈ ఘటన హింసాత్మకంగా మారుతుండటంతో పోలీసులు లాఠీ చార్జ్ చేయక తప్పలేదు.