రాత్రంతా జాతర.. తిరువనంతపురంలో మిడ్ నైట్ షాపింగ్ కాన్సెప్ట్.. నేడే ట్రయల్.. 24 గంటల షాపింగ్‌కు నాంది

By Mahesh KFirst Published Jul 6, 2022, 1:08 PM IST
Highlights

కేరళ రాజధాని తిరువనంతపురం ఇక రాత్రిళ్లూ జిగేల్‌మనబోతున్నది. ఇక్కడ 24 గంటల షాపింగ్ సౌకర్యం అందుబాటులోకి రాబోతున్నది. నేడు లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ ట్రయల్ రన్ చేపడుతున్నది. 
 

తిరువనంతపురం: ఆధునిక సంస్కృతిలో షాపింగ్ ప్రధాన అంశం. షాపింగ్ లేకుండా ప్రస్తుత సమాజ గతిని, రీతిని వివరించలేం. అంతగా షాపింగ్ ప్రజల్లోకి చొచ్చుకెళ్లింది. ఇది వ్యాపారులకు ఎంతో ఊరటనిచ్చే విషయం. మరికొంత ఆలోచిస్తే.. వ్యాపారాన్ని పెంచుకోవడంలో వారి ప్రయత్నాలు సఫలం అవుతున్నాయనీ చెప్పుకోవచ్చు. లైఫ్ స్టైల్ మారుతున్నట్టు.. ఉద్యోగ సమయాలూ మారుతున్నట్టూ అందరికీ అందుబాటులో ఉండేలా కొన్ని సంస్థలు రాత్రి పూటా షాపింగ్ కోసం తలుపులు తెరిచే ఉంటున్నాయి. ముఖ్యంగా ముంబయి, కోల్‌కతా, బెంగళూరు వంటి మెగా సిటీల్లో రాత్రిళ్లూ షాపింగ్ చేసే సౌలభ్యాలు ఉన్నాయి. నిద్రించని నగర జాబితాలోకి అంటే.. 24 గంటలూ మెలకువతో ఉండే నగరంగా కేరళ రాజధాని తిరువనంతపురం కూడా చేరుతున్నది. ఇక్కడ కూడా లులు అనే షాపింగ్ మాల్ రాత్రి పూట కూడా షాపింగ్‌ను అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకుంది. ఈ రోజు అంటే 6వ తేదీ అర్ధరాత్రి నుంచి 7వ తేదీ అర్ధరాత్రి వరకు లులు షాపింగ్ మాల్‌ను తెరిచి ట్రయల్ రన్ చేపట్టనుంది.

లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ తిరువనంతపురం నగరంలో రాత్రంతా.. పొద్దంతా షాపింగ్ కోసం తలుపులు తెరిచే ఉంచనుంది. నేడు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నది. త్వరలోనే పూర్తిస్థాయిలో 24 అవర్స్ షాపింగ్‌ను అందుబాటులోకి తేనుంది. నైట్ లైఫ్ యాక్టివ్, వైబ్రంట్‌గా మార్చనుంది. ఇది పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే.. రాత్రిపూట కూడా మహిళలు భయం లేకుండా షాపింగ్ చేసే రోజులు వస్తాయని భావిస్తున్నారు. రాత్రిపూట అమ్మాయి గడప దాటొద్దనే ఒకప్పటి అడ్డుగోడలను వారు బద్ధలు చేసే అవకాశాలు ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. 

మైడ్ నైట్ షాపింగ్‌ను ఎంకరేజ్ చేయడం తమ తొలి ప్రాధాన్యం అని లులు గ్రూప్ రీజినల్ డైరెక్టర్ జాయ్ సదానందన్ తెలిపారు. ఇలా చేస్తే ప్రజలు కూడా రాత్రిళ్లు షాపింగ్‌ను తక్కువ ట్రాపిక్ రద్దీతో విజయవంతంగా, సులభతరంగా చేసుకోగలుగుతారని వివరించారు. తాము తొలిగా ఒక రోజు ట్రయల్ చేయాలని అనుకుంటున్నామని, ఆ తర్వాత మరికొన్ని రోజులు చేస్తామని, అనంతరం పూర్తిస్థాయిలో 24 అవర్స్ షాపింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఇందులో చాలా ఆటంకాలు, అంతరాయాలు ఏర్పడవచ్చని, వాటిని అధిగమిస్తామని వివరించారు.

రాత్రిపూట షాపింగ్ కాబట్టి.. రక్షణకు సంబంధించి తగిన ఏర్పాటు చేస్తామని, అధికారులు మఫ్టీల్లో యాక్టివ్‌గా ఉంటారని వివరించారు. అలాగే, కేఎస్ఆర్‌టీసీ ఒక డబుల్ డెక్కర్ బస్సునూ మిడ్ నైట్ షాపింగ్ టైమ్‌లో నడుపుతుందని తెలిపారు. అలాగే, ఆన్‌లైన్ ట్యాక్సీ సేవలూ కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని చెప్పారు.

ఇతర నగరాల్లోనూ మిడ్ నైట్ షాపింగ్ సంప్రదాయాన్ని తేవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నదని, ఇందుకు అనుగుణంగానే లులు మాల్ తొలిగా ఈ ట్రయల్ రన్ చేపడుతున్నది.

click me!