UP Assembly Election 2022: యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలోంచి త‌ప్పుకున్న మాయావ‌తి !

By Mahesh RajamoniFirst Published Jan 11, 2022, 2:30 PM IST
Highlights

UP Assembly Election 2022: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌ల హ‌డావిడి మొద‌లైంది. అన్ని పార్టీలు ముమ్మ‌రంగా ఎన్నిక‌ల ప్రచారం సాగిస్తున్నాయి. అయితే, ఒక‌ప్పుడు రాష్ట్రంలో పాల‌న సాగించిన బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ కాస్త వెనుక‌బ‌డిన‌ట్టు క‌నిస్తున్న‌ది. ఇక ప్ర‌స్తుతం జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల బ‌రిలోంచి బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి త‌ప్పుకున్నద‌నీ, ఆమె పోటీ చేయ‌డం లేద‌ని ఆ పార్టీ వ‌ర్గాలు పేర్కొన్నాయి. 
 

UP assembly election 2022: దేశంలో ఈ ఏడాది జ‌ర‌గ‌బోయే ప‌లు రాష్ట్రాల ఎన్నిక‌ల న‌గారా మోగింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Election 2022) కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవ‌లే  షెడ్యూల్ విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను సీఈసీ సుశీల్ చంద్ర ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో..  ఉత్తరప్రదేశ్ శాసనసభ గడువు మే నెలతో ముగియ‌నుంది. మొత్తం 400 కు పైగా అసెంబ్లీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఫిబ్రవరి 10, ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 20, ఫిబ్రవరి 23, ఫిబ్రవరి 27, మార్చి 3,  మార్చి 7 తేదీల్లో మొత్తం 7 దశల్లో ఓటింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల హ‌డావిడి మొద‌లైంది. రాష్ట్రంలోని ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల‌న్ని ఎన్నిక‌ల ప్ర‌చారంలో వేగం పెంచాయి. ఈ ఎన్నిక‌ల‌ను అన్ని పార్టీలు అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావిస్తున్నాయి. యూపీ (UP assembly election)లో త‌మ‌దే విజ‌య‌మంటే.. త‌మ‌దే గెల‌పు అంటూ ప్ర‌ధాన పార్టీలు ధీమా వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ విష‌యంలో బ‌హుజ‌న్ స‌మాజ్ (Bahujan Samaj Party-BSP) పార్టీ కాస్త వెనుక‌బ‌డిన‌ట్టు క‌నిపిస్తున్న‌ది. 

ఈ క్ర‌మంలో బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ  నేత‌లు కీల‌క విష‌యం వెల్ల‌డించారు. Bahujan Samaj Party చీఫ్ మాయావ‌తి.. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే  ఉత్త‌ర‌ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం లేద‌ని ఆ పార్టీ పార్ల‌మెంట్ స‌భ్యులు స‌తీశ్ చంద్ర మిశ్రా తెలిపారు. మంగ‌ళ‌వారం నాడు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... ఈ విష‌యం వెల్ల‌డించారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి, BSP అధినేత్రి మాయావ‌తి ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం లేదు. ఆమెతో పాటు తాను కూడా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం లేద‌ని ఎంపీ స‌తీశ్ చంద్ర మిశ్రా వెల్ల‌డించారు. ఈ ఎన్నిక‌ల్లో స‌మాజ్‌వాదీ కానీ, బీజేపీ పార్టీలు గానీ గెల‌వ‌బోవ‌ని అన్నారు. స‌మాజ్‌వాదీ పార్టీకి పోటీ చేయ‌డానికి అభ్య‌ర్థులే లేర‌ని అన్నారు. స‌మాజ్ వాదీ పార్టీ వ‌ద్ద 400 మంది అభ్య‌ర్థులు లేరు, అలాంట‌ప్పుడు వాళ్లు ఎలా 400 సీట్లు గెలుస్తారంటూ  ఎంపీ స‌తీశ్ చంద్ర ప్ర‌శ్నించారు.  త్వ‌ర‌లో జ‌రిగే యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స‌మాజ్‌వాదీ పార్టీ గానీ, బీజేపీ గానీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌లేవ‌ని అన్నారు. ఈ ఎన్నిక‌ల్లో తాము జ‌య‌కేత‌నం ఎగుర‌వేసి.. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని స‌తీశ్ చంద్ర పేర్కొన్నారు. 

ఎన్నిక‌ల బ‌రిలో నిల‌ప‌బోయే అధ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌డానికి బ‌హుజ‌న్ స‌మాజ్ (Bahujan Samaj Party-BSP) పార్టీ  ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించిన రెండు రోజుల త‌ర్వాత ఆ పార్టీ ఈ ప్ర‌క‌టన చేసింది. 2017లో జరిగిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (Elections) 403 స్థానాలకు గానూ 19 సీట్లను బ‌హుజ‌న్ సమాజ్ పార్టీ  గెలుచుకుంది. సమాజ్‌వాదీ పార్టీ 47 స్థానాల్లో విజ‌యం సాధించింది. కాంగ్రెస్ కేవలం 9 స్థానాలు మాత్రమే సాధించింది.ఇక బీజేపీ 312 స్థానాల‌ను గెలుపొంది.. అధికార పీఠం ద‌క్కించుకుంది. ఇక రెండో సారి అధికారంలోకి రావాల‌ని ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

click me!