
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (Uttar Pradesh Assembly election) వేళ కీలక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నేడు నాలుగో దశ పోలింగ్ జరుగుతుండగా.. మరో మూడు దశల పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే ఈ సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah), బీఎస్పీ అధినేత్రి మయావతి (Mayawati) పరస్పరం ప్రశంసలు కురిపించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అమిత్, మయావతి మాట్లాడిన తీరు పలు ఊహగానాలకు తావిచ్చే విధంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలేం జరిగిందంటే.. అమిత్ షా న్యూస్18 ఇంటర్ప్యూలో మాట్లాడుతూ.. మాయవతి తన ఔచిత్యం పోగొట్టుకోలేదని అన్నారు.
‘బీఎస్పీ తన ఔచిత్యాన్ని నిలబెట్టుకుంది. వారికి ఓట్లు పడతాయని నమ్ముతున్నాను. ఆ ఓట్లు ఎన్ని సీట్లుగా మారుతాయో నాకు తెలియదు. కానీ ఓట్లు మాత్రం వస్తాయి’ అని షా అన్నారు. దళిత, ముస్లిం ఓట్లు బీఎస్పీకి వెళ్లడం వల్ల బీజేపీ ప్రయోజనం పొందుతుందా? అనే ప్రశ్నకు అమిత్ షా స్పందిస్తూ.. ఇది బీజేపీకి లాభమా, నష్టమా.. అనేది తనకు తెలియదన్నారు. ఇది స్థానాన్ని (నియోజకవర్గాన్ని) బట్టి ఇది ఉంటుందన్నారు. అయితే మాయావతి పని అయిపోయిందనడం సరైనది కాదని చెప్పారు. మాయావతి ఔచిత్యానికి తెరపడిందని చెప్పలేమని అన్నారు.
అయితే మాయావతితో ఎన్నికల తర్వాత పొత్తుకు అవకాశం గురించి అడిగిన ప్రశ్నకు అమిత్ షా స్పందిస్తూ.. పొత్తు అవసరం లేదన్నారు. తాము పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. మంచి పని చేయడానికి అన్ని పార్టీల మద్దతు అవసరమని.. సమాజ్ వాదీ పార్టీ కూడా అవసరమని చెప్పారు. ప్రతిపక్షాల సృజనాత్మక మద్దతు ఎల్లప్పుడూ అవసరమని అన్నారు. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎవరితోనూ పొత్తు అవసరం లేదని చెప్పుకొచ్చారు.
ఇక, అమిత్ షా కామెంట్స్‌పై స్పందించాలని విలేకర్లు అడగ్గా.. నిజాన్ని అంగీకరించడం ఆయన గొప్పతనం అని చెప్పారు. ఇప్పటివరకు జరిగిన మూడు దశల పోలింగ్‌లో బీఎస్పీ.. దళితులు, ముస్లింల మద్దతు మాత్రమే కాకుండా అగ్రవర్ణ, వెనుకబడిన తరగతుల ఓట్లను కూడా పొందిందని చెప్పారు.
403 స్థానాలున్న యూపీ అసెంబ్లీలో 300కు పైగా సీట్లు వస్తాయని బీజేపీ చెప్పడంపై మాయావతి స్పందిస్తూ.. దానికి కాలమే సమాధానం చెబుతుందని అన్నారు. బీజేపీ, సమాజ్ వాదీ పార్టీలు కాకుండా బీఎస్పీ విజయం సాధించవచ్చు.. ఎవరికి తెలుసు? అని చెప్పారు. మరోవైపు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌పై మాయవతి తీవ్ర విమర్శలు చేశారు. యూపీ ఓటర్లు ఎస్పీని తిరస్కరించడం.. ఆ పార్టీ అధికారంలోకి వస్తే గూండారాజ్ వస్తుందని ప్రజలకు తెలసని వ్యాఖ్యానించారు.