ఇన్‌ఫార్మర్లనే అనుమానంతో ఇద్దరిని కాల్చిచంపిన మావోయిస్టులు

By Mahesh RajamoniFirst Published Oct 17, 2022, 2:13 PM IST
Highlights

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ జిల్లాలో సోమవారం మావోయిస్టులు నాలుగు వాహనాలకు నిప్పుపెట్టారు. మరో ఘటనలో ఇన్‌ఫార్మర్లనే అనుమానంతో ఇద్దరిని కాల్చిచంపారు. 
 

Maoists kill two villagers in Bastar: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి మావోయిస్టులు రెచ్చిపోయారు. ఇన్‌ఫార్మర్లనే అనుమానంతో ఇద్దరిని కాల్చిచంపారు. పోలీసులు దీనిపై కేసు నమోదుచేసుకుని విచారణ జరుపుతున్నారు. వివరాల్లోకెళ్తే.. బస్తర్ ప్రాంతంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఇద్దరు వ్యక్తులను హతమార్చారనీ, వారిలో ఒకరి సోదరుడు ఇన్‌ఫార్మర్‌గా అనుమానించారని పోలీసులు సోమవారం తెలిపారు. ఈ సంఘటన గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవిలో చోటుచేసుకుంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలించేందుకు పోలీసు బృందాన్ని రంగంలోకి దింపారు. అలాగే, ఆదివారం నుంచి మరో గ్రామస్థుడు మావోయిస్టుల అదుపులో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పెదకోర్మ, పుస్నార్ గ్రామాల్లో మావోయిస్టులు ఇద్దరిని హతమార్చినట్లు మాకు ప్రాథమిక సమాచారం ఉందని బస్తర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్‌రాజ్ పీ వెల్ల‌డించిన‌ట్టు హిందూస్తాన్ టైమ్స్ నివేదించింది. మృతుల్లో ఒకరు సీపీఐ (మావోయిస్ట్) గంగలూరు ఏరియా కమిటీ కార్యదర్శి దినేష్ మొడియం సోదరుడు రాజు పొడియామిగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. గ్రామస్థుడు దులా కొడ్మే హత్య ధృవీకరించబడుతోందని ఐజీ చెప్పారు.  కాగా, బీజాపూర్‌లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ గాయపడ్డారు. టార్రెమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టార్రెమ్-చినగెలూర్ రహదారిపై ఆదివారం రాత్రి ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది, ఈ సమయంలో సబ్-ఇన్‌స్పెక్టర్ రాజేష్ సూర్యవంశీ స్వల్పంగా గాయపడ్డారు.

మైనింగ్ పనిలో ఉన్న వాహనాలను త‌గుల‌బెట్టిన మావోయిస్టులు

చ‌త్తీస్‌గఢ్‌లోని కంకేర్ జిల్లాలో సోమవారం మావోయిస్టులు నాలుగు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. సిక్సోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్ర‌యివేటు సంస్థకు చెందిన చార్గావ్ ఇనుప ఖనిజం గని వద్దకు తెల్లవారుజామున మావోయిస్టుల బృందం చేరుకుని అక్కడ ఆగి ఉన్న రెండు ట్రక్కులను, అనేక స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలను (ఎస్‌యూవీ) తగులబెట్టిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. నాలుగు వాహనాల్లో రెండు ట్రక్కులు, ఒక ఎస్‌యూవీ మైనింగ్‌కు సంబంధించిన పనిలో నిమగ్నమై ఉన్నాయని తెలిపారు. వాహనాలను తగులబెట్టిన తర్వాత మావోయిస్టులు అడవిలోకి పారిపోయారని అధికారులు తెలిపారు. సోమ‌వారం ఉదయం పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. నిందితులను పట్టుకోవడానికి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు అధికారి తెలిపారు. గతంలో కూడా మావోయిస్టులు ఈ ప్రాంతంలో మైనింగ్ సంబంధిత పనుల్లో నిమగ్నమైన వాహనాలను తగులబెట్టారు.

ఇరువర్గాల మధ్య కాల్పులు

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో శనివారం సాయంత్రం పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులున్నార‌నే సమాచారం మేరకు ఈ ఆపరేషన్‌ చేపట్టారు. బండపాల్ అడవుల్లోకి జవాన్లు చేరుకోగానే నక్సలైట్లు కాల్పులు ప్రారంభించారు. జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) సిబ్బంది ఎదురుకాల్పులు జ‌రిపారు. దీంతో నక్సలైట్లు పారిపోయారు. ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లినట్లు స‌మాచారం. ఆ ప్రాంతంలో ఇంకా భ‌ద్రాత సిబ్బంది ఉన్నారు. నారాయణపూర్ జిల్లా పీఎస్ ఎడ్కా దేవర్‌గావ్ సమీపంలో నక్సలైట్లు గుమిగూడినట్లు సమాచారం అందిందనీ, ఆ తర్వాత ఆపరేషన్ ప్రారంభించామని ఐజీ సుందర్‌రాజ్‌ తెలిపారు. నారాయణపూర్ నుండి DRG జవాన్ల బృందాన్ని పంపించారు. దేవర్‌గావ్‌ను ఆనుకుని ఉన్న అడవికి సైనికులు చేరుకోగానే నక్సలైట్లు కాల్పులు ప్రారంభించారు. సైనికులు కూడా ఎదురుకాల్పులు జ‌రిపారు. అరగంట పాటు ఇరువైపులా కాల్పులు జరిగాయి. బలగాలు విజృంభించడం చూసిన మావోయిస్టులు అటవీప్రాంతాన్ని అవకాశంగా తీసుకుని పారిపోయారు.

click me!