ఈ మావోయిస్టు ప్రభావిత గ్రామంలో ప్రజలు ప్రతిరోజు జన గణ మన ఆలాపిస్తున్నారు. ఎందుకంటే?

By Mahesh KFirst Published Sep 18, 2022, 5:55 PM IST
Highlights

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు చెందిన ముల్చేరా అనే గ్రామ ప్రజలు రోజు ఉదయం 8.45 గంటలకు జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నారు. ఆగస్టు 15 నుంచి ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారు. తమది మావోయిస్టు ప్రభావిత గ్రామం అనే ముద్రను తొలగించుకోవాలని వారు భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ముంబయి: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య చాలా ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఇప్పటికీ గడ్చిరోలి అంటే మావోయిస్టు ప్రభావిత జిల్లాగానే చూస్తుంటారు. కానీ, ఈ జిల్లాలోని ముల్చేరా గ్రామస్తులకు ఇది నచ్చడం లేదు. తమది మావోయిస్టు ప్రభావిత గ్రామంగా పిలవడాన్ని ఒప్పుకోవడం లేదు. అందుకే ఆ ముద్రను తొలగించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రతి రోజు జాతీయ గీత ఆలాపన చేస్తున్నారు. ఆగస్టు 15 నుంచి ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారు.

గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్ దీని గురించి మాట్లాడారు. ‘ఇది మంచి కార్యక్రమం. ప్రతి రోజు ఉదయం జాతీయ గీతాన్ని ఆలపించడం ద్వారా గ్రామస్తులు అంతా సంఘటితంగానే ఉన్నామనే అనుభూతి పొదుతున్నారు’ అని వివరించారు.

రాష్ట్ర రాజధాని ముంబయి నుంచి 900 కిలోమీటర్ల దూరంలో ఈ ముల్చేరా గ్రామం ఉన్నది. సుమారు 2,500 జనాభా గల ఈ గ్రామంలో ట్రైబల్స్, పశ్చిమ బెంగాల్ నుంచి తరలి వచ్చిన వారు ఉన్నారు. 

ప్రతి రోజు ఉదయం 8.45 గంటలకు గ్రామంలోని ప్రతి ఒక్కరు షాప్ ఓనర్లు, ఇతరులు అందరూ తమ పనులు పక్కనపెట్టి జాతీయ గీతాలపనలో భాగస్వామ్యం అవుతారు. గ్రామానికి రెండు బస్సులు వస్తాయి. ఈ బస్సులు కూడా ఆ సమయానికి ఆగుతాయి. ప్రయాణికులు, డ్రైవర్లు, కండక్టర్లు అందరూ జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. ప్రతి రోజు ఉదయం పోలీసులు రెండు లౌడ్ స్పీకర్లతో రౌండ్లు వేస్తారు. ఆ తర్వాత ఒక నిమిషం పాటు జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. పోలీసుల లౌడ్ స్పీకర్లు రాగానే జాతీయ గీతం ప్రారంభం అవుతుందనే సంకేతం ప్రజలకు వెళుతుంది. 

1992లో సంతోష్ అన్న అనే అనుమానిత మావోయిస్టు కమాండర్, ప్రాణాలు  కాపాడుకోవడానికి అడ్డుగా పెట్టుకున్న ఓ బాలిక ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ముల్చేరా సమీపంలో జరిగిన తొలి ఎన్‌కౌంటర్ ఇదే. అప్పటి నుంచి ఈ గ్రామంలో మావోయిస్టులు ఉన్నారనే అనుమానాలు ఉంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గ్రామస్తులు ఈ కొత్త పద్ధతిని అవలంభిస్తున్నట్టు తెలుస్తున్నది.

click me!