సాగు చట్టాలు: సుప్రీం కమిటీ.. ప్యానెల్ నుంచి ఒకరు నిష్క్రమణ

By Siva KodatiFirst Published Jan 14, 2021, 4:32 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై అధ్యయనంతో పాటు రైతులతో చర్చల కోసం సుప్రీంకోర్టు నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై అధ్యయనంతో పాటు రైతులతో చర్చల కోసం సుప్రీంకోర్టు నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో తొలి సమావేశం కూడా జరగకుండానే ఈ కమిటీకి షాక్ తగిలింది. ఈ ప్యానెల్‌లో సభ్యుడిగా వున్న భారతీయ కిసాన్‌ సంఘం (బీకేయూ) అధ్యక్షుడు భూపీందర్‌సింగ్‌ మాన్‌ తాను కమిటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

ఈ కమిటీలో సభ్యుడిగా నామినేట్‌ చేసినందుకు సుప్రీంకోర్టుకి కృతజ్ఞతలు తెలిపిన మాన్‌.. రైతుల ప్రయోజనాలతో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ఇందుకోసం ఎలాంటి పదవినైనా త్యాగం చేస్తానని భూపీందర్ స్పష్టం చేశారు.    

కాగా, వివాదాస్పదంగా మారిన మూడు వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు మంగళవారం స్టే విధించిన విషయం తెలిసిందే. తదుపరి తీర్పు వచ్చే వరకు స్టే కొనసాగుతుందని సుప్రీం వెల్లడించింది.

ఇదే సమయంలో రైతులతో చర్చలు జరిపేందుకు అనిల్‌ ఘన్వాట్‌, అశోక్‌ గులాటి, భూపీందర్‌సింగ్‌ మాన్‌, ప్రమోద్‌ కుమార్‌ జోషీలతో కూడిన నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ 10 రోజుల్లోగా తొలి సమావేశం నిర్వహించాలని ఆదేశించింది.

అయితే సుప్రీం తీర్పు వచ్చిన కొద్దిసేపటికే రైతులు ఈ కమిటీపై పెదవి విరిచారు. ఈ ప్యానెల్‌లోని నలుగురు సభ్యులూ సాగు చట్టాలకు అనుకూలురేనంటూ రైతు సంఘాలు, విపక్షాలు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తంచేశాయి. ఈ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని, అప్పటిదాకా తమ ఉద్యమాన్ని విరమించేది లేదని రైతుసంఘాలు కేంద్రానికి అల్టీమేటం జారీ చేశాయి. 

click me!