ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా భార్య 103 రోజుల తర్వాత తన భర్తతో భేటీ అయ్యారు. ఆ భేటి గురించి హృదయపూర్వక నోట్‌ను ట్విట్టర్ లో షేర్ చేశారు.
ఢిల్లీ : తన భర్త కళ్ళల్లో చెదరని నిశ్చలత చూశానని మనీష్ సిసోడియా భార్య సీమా భావోద్వేగానికి గురయ్యారు..ఆమె మాట్లాడుతూ.. ‘రాజకీయ క్రీడలో నా భర్త జైలు పాలయ్యారు. 13 రోజుల తర్వాత అతనిని కలిశాను. నేల మీదే పడుకోవడం.. విపరీతమైన వేడి బాధ.. ఈగలు, దోమల బాధలు…అన్ని వైపుల నుంచి కమ్మేసినా.. మనీష్ కళ్ళల్లో తన ఆశయ సాధన కోసం అదే నిశ్చలత కనిపించింది. అని ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గురించి అతని భార్య తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలతో మనీష్ సిసోడియా ఈడి, సిబిఐ కేసులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తీహార్ జైల్లో గత మూడు నెలలుగా బందీగా ఉన్నారాయన. బెయిల్ కోసం అతను చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో.. భార్య సీమ అనారోగ్యంతో ఉండడంతో.. ఆమెను, ఇతర కుటుంబ సభ్యులను వారి ఇంట్లో కలిసేందుకు ఢిల్లీ హైకోర్టు గతవారం మనీష్ సిసోడియాకు అనుమతినిచ్చింది.
మద్యం మత్తులో చిత్రహింసలు.. తట్టుకోలేక భార్య ఆత్మహత్య, షాక్ అయి పురుగుల మందు తాగి భర్త మృతి...
దీనికోసం పలు షరతులు కూడా విధించింది. ఆ షరతులన్నింటికీ అంగీకరించి ఈ అవకాశాన్ని మనీష్ సిసోడియా దక్కించుకున్నారు. ఇంటికి వచ్చిన మనీష్ సిసోడియాతో భార్య సీమ బెడ్రూంలో మాట్లాడుతుంటే పోలీసులు బయట పొంచి ఉండి తమ సంభాషణ విన్నారని.. సీమ తెలిపింది. మనిష్ సిసోడియా 7 గంటల పాటు కుటుంబ సభ్యులతో గడిపారు. అయినా, ఏ క్షణంలో కూడా మనోనిబ్బరం కోల్పోలేదని.. చెదిరిపోలేదని ఆ విషయాన్ని తాను గమనించానని ట్విట్టర్లో సీమ ఓ ఉత్తరాన్ని బుధవారం పోస్ట్ చేశారు.
జైలులో మనీష్ సిసోడియా రోజువారీ కార్యకలాపాలను వివరిస్తూ, " ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యా చరిత్రను అధ్యయనం చేయడంలో మునిగిపోయాడు. విద్య కోసం తమను తాము అంకితం చేసుకున్న వివిధ దేశాల నాయకుల కథలను లోతుగా పరిశోధిస్తున్నాడు. వారి కృషి ఎలా ఉందో చదువుతున్నారు. మా సమావేశంలో ఈ విషయాల గురించి మాట్లాడుకున్నాం. నా ఆరోగ్యం గురించి చర్చించాం" అన్నారు.