
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ విచారణకు హాజరుకావడానికి మరింత సమయం కావాలని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కోరారు. ఈ మేరకు ఆయన సీబీఐ అధికారులకు లేఖ కూడా రాశారు. ఇక, ఈ కేసుకు సంబంధించి మరోసారి సిసోడియాకు నోటీసులు జారీ చేసిన సీబీఐ.. ఈ రోజు విచారణకు హాజరుకావాల్సిందిగా అందులో పేర్కొంది. అయితే సిసోడియా మాత్రం ఈరోజు విచారణకు హాజరుకాకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి చివరి నాటికి తాను సీబీఐ కార్యాలయానికి వెళ్తానని చెప్పారు.
ఈ రోజు ఉదయం సిసోడియా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను ఎప్పుడూ సీబీఐకి సహకరిస్తాను. అయితే ఢిల్లీకి ఇది చాలా కీలకమైన సమయం.. మేము బడ్జెట్‌ను సిద్ధం చేసి ఫిబ్రవరి చివరి నాటికి కేంద్ర ప్రభుత్వానికి పంపాలి. నన్ను అరెస్టు చేస్తారని నాకు తెలుసు అందుకే బడ్జెట్‌ను ఖరారు చేసేందుకు సమయం ఇవ్వాలని సీబీఐని కోరాను. ఫిబ్రవరి చివరి నాటికి వారు ఎప్పుడూ పిలిచిన నేను సీబీఐ కార్యాలయానికి వెళ్తాను’’ అని చెప్పారు.
అయితే సీబీఐ ముందు హాజరు కావడానికి మరింత సమయం కావాలని మనీష్ సిసోడియా చేసిన అభ్యర్థనను అధికారులు అంగీకరించకపోవచ్చని ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. ఈరోజు ఉదయం ఢిల్లీలోని సీబీఐ కార్యాలయాన్ని సందర్శిస్తానని మిస్టర్ సిసోడియా నిన్న సాయంత్రం ధృవీకరించారని ఆ వర్గాలు తెలిపాయి. అయితే ఉదయం 8.45 గంటల ప్రాంతంలో సీబీఐకి ఒక లేఖ అందిందని.. అందులో ఏజెన్సీ ముందు హాజరు కావడానికి కనీసం వారం రోజుల సమయం కావాలని కోరినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఇక, మనీష్ సిసోడియాను గత ఏడాది అక్టోబర్ 17న సీబీఐ తొలిసారిగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఆయన ఇంటితో పాటు బ్యాంక్ లాకర్లలో కూడా సోదాలు జరిగాయి.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 గత ఏడాది ఆగస్టులో రద్దు చేయబడింది. ఇందులో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు రావడంతో వాటిపై దర్యాప్తు చేయాల్సిందిగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐని కోరారు. ఈ కేసుకు సంబంధించి సిసోడియా, ఇతరులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ కేసులో సీబీఐ మూడు నెలల క్రితమే చార్జిషీట్ దాఖలు చేసింది. అయితే మనీష్ సిసోడియాను ఛార్జ్ షీట్‌లో నిందితుడిగా పేర్కొనలేదు. ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేసిన వ్యాపారులు విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్‌పల్లి సహా ఏడుగురు నిందితులుగా చార్జిషీట్‌లో పేర్కొన్నారు. అయితే మనీష్ సిసోడియా నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన బ్యాంకు లాకర్లను కూడా తెరిచిచూశారు. ఇక, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి తమపై వస్తున్న ఆరోపణలను ఆప్ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే.