Manipur violence: మణిపూర్ హింసాకాండపై సుప్రీంకోర్టులో విచారణ జరపనుంది. గత వారం మణిపూర్ లో గిరిజనులు, మైతీ కమ్యూనిటీ సభ్యుల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. మణిపూర్ హింసాకాండపై దాఖలైన పిటిషన్లపై సోమవారం విచారణ జరగనుంది. మణిపూర్ హింసలో ఇప్పటివరకు 54 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
SC to hear pleas on Manipur violence: గత వారం రోజులుగా వరుస హింసాత్మక ఘటనలు చెలరేగిన మణిపూర్ జిల్లాల్లో జనజీవనం నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తోంది. అయితే, ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా కొనసాగుతున్నాయి. షెడ్యూల్డ్ తెగ కేటగిరీలో చేర్చాలనే డిమాండ్ పై మైతీ కమ్యూనిటీ, అక్కడి గిరిజనుల మధ్య ఘర్షణలు చెలరేగడంతో ఈశాన్య రాష్ట్రం జాతి హింసతో దద్దరిల్లింది. ఈ అంశం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది, మణిపూర్ పరిస్థితిపై దాఖలైన పిటిషన్లపై సోమవారం విచారణ జరగనుంది. మణిపూర్ లో పోరాడుతున్న గ్రూపులతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జీ.కిషన్ రెడ్డి తెలిపారు.
మణిపూర్ హింసాత్మక పరిస్థితుల తాజా వివరాలు ఇలా ఉన్నాయి..
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం మణిపూర్ పరిస్థితిపై దాఖలైన పిటిషన్లను విచారించనుంది. మైతీ కమ్యూనిటీకి షెడ్యూల్డ్ తెగల హోదా అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే దాఖలు చేసిన మూడు పిటిషన్లు, మణిపూర్ లో ఇటీవల జరిగిన హింసపై సిట్ దర్యాప్తు కోసం గిరిజన సంస్థ దాఖలు చేసిన పిల్ సహా మూడు పిటిషన్లను సుప్రీం ధర్మాసనం విచారించనుంది.
చర్చలకు ముందుకు రావాలని కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జీ.కిషన్ రెడ్డి కోరారు. "శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకునేందుకు ముందుకు రండి. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు రైతుల సమస్యను చూశారు. శాంతియుతంగా ఉన్నప్పుడు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాం. సమస్య పరిష్కారం కాకపోవడంతో వారి డిమాండ్ కు అంగీకరించి, ఆ బిల్లులను (మూడు వ్యవసాయ చట్టాలు) ఉపసంహరించుకున్నాం. కాబట్టి ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం లేదు" అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
హింస కారణంగా నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వారికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. "మనమందరం సంయమనం పాటించాలి. హింస ద్వారా కాకుండా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి. హింస ద్వారా ఏమీ సాధించలేమని గుర్తించండి" అని కేంద్ర మంత్రి అన్నారు.
మణిపూర్ లో మైతీ కమ్యూనిటీకి, గిరిజనులకు మధ్య ఘర్షణలు చెలరేగినప్పటి నుంచి 23,000 మందిని హింసాత్మక ప్రాంతాల నుంచి రక్షించి సైనిక శిబిరాలకు తరలించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆర్మీ, అస్సాం రైఫిల్స్ సిబ్బందిని రంగంలోకి దింపారు. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ప్రతిరోజూ మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 3 గంటల వరకు కర్ఫ్యూను సడలించాలని జిల్లా మేజిస్ట్రేట్లు, డిప్యూటీ కమిషనర్లను రాష్ట్ర హోంశాఖ ఆదేశించింది. చురాచంద్ పూర్ లో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజలు ఆహారం, మందులు వంటి నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు వీలుగా ఆంక్షలను సడలించారు. సోమవారం ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో కర్ఫ్యూను ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సడలించనున్నారు.
మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ బీజేపీని డిమాండ్ చేశారు. మణిపూర్ హింసాకాండ కొనసాగుతున్నందున, మితవాద భావాలున్న భారతీయులందరూ తమకు వాగ్దానం చేసిన సుపరిపాలన ఏమైందని తమను తాము ప్రశ్నించుకోవాలని శశిథరూర్ ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెచ్చిన ఏడాదికే మణిపూర్ ఓటర్లు తీవ్ర ద్రోహానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. "రాష్ట్రపతి పాలనకు సమయం ఆసన్నమైంది. రాష్ట్ర ప్రభుత్వం వారు ఎన్నుకున్న పనిని నెరవేర్చడం లేదు" అని మాజీ కేంద్ర మంత్రి అన్నారు.