Manipur Election 2022 : నేడు మణిపూర్ అసెంబ్లీకి మొదటి దశ ఎన్నిక‌లు.. 38 స్థానాలకు 173 మంది అభ్య‌ర్థుల పోటీ

Published : Feb 28, 2022, 04:48 AM IST
Manipur Election 2022 : నేడు మణిపూర్ అసెంబ్లీకి మొదటి దశ ఎన్నిక‌లు.. 38 స్థానాలకు 173 మంది అభ్య‌ర్థుల పోటీ

సారాంశం

60 స్థానాలు ఉన్న మణిపూర్ అసెంబ్లీకి నేడు మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మొదటి దశలో ఐదు జిల్లాల పరిధిలోని 38 నియోజకవర్గాల్లో సోమవారం ఎన్నికలు నిర్వహించనున్నారు. మార్చి 5వ తేదీన మిగిలిన స్థానాలకు రెండో దశ ఎన్నికలు ఉంటాయి.   

Manipur Election News 2022 : మ‌ణిపూర్ (Manipur) అసెంబ్లీకి నేడు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ రాష్ట్రంలో రెండు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు నిర్వహించాలని కేంద్ర ఎన్నిక‌ల సంఘం భావించింది. ఇందులో భాగంగానే సోమ‌వారం మొద‌టి ద‌శ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు. దీని కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మణిపూర్ లోని ఇంఫాల్ ఈస్ట్ (mphal East), ఇంఫాల్ వెస్ట్ (Imphal West), బిష్ణుపూర్ (Bishnupur), చురచంద్‌పూర్ (Churachandpur), కాంగ్‌పోక్పి (Kangpokpi) అనే ఐదు జిల్లాల్లో నేడు ఎన్నిక‌లు ఉండ‌నున్నాయి. ఈ ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. కోవిడ్-19 పాజిటివ్, క్వారంటైన్‌లో ఉన్న ఓటర్ల‌కు చివరి గంటలో ఓటు వేయడానికి అనుమ‌తి ఇచ్చారు. 

రాష్ట్ర ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ఐదు జిల్లాల ప‌రిధిలో ఉన్న 38 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 173 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో 15 మంది మహిళలు ఉన్నారు. 173 మంది అభ్య‌ర్థుల్లో 39 మంది అభ్యర్థులపై నేరారోపణలు ఉన్నాయి. ప్ర‌స్తుతం ఎన్నిక‌లు జ‌రిగే 38 నియోజ‌క‌వ‌ర్గాల‌కు బీజేపీ 38 మంది అభ్యర్థులను, కాంగ్రెస్ 35 మంది, జనతాదళ్ యునైటెడ్ 28 మంది అభ్యర్థులను నిలబెట్టాయి.

ఎన్నిక‌ల నేప‌థ్యంలో మణిపూర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రాజేష్ అగర్వాల్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నిక‌ల్లో మొత్తం 12,09,439 మంది ఓటర్లు ఉన్నార‌ని చెప్పారు. ఇందులో 5,80,607 మంది పురుషులు, 6,28,657 మంది మహిళలు, 175 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నార‌ని తెలిపారు. దీంతో పాటు 10,041 మంది పీడబ్ల్యూడీ ఓటర్లు, 251 మంది శతాబ్ది ఓటర్లు అన్నార‌ని చెప్పారు. వీరంతా  1,721 పోలింగ్ బూత్ లలో త‌మ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని అన్నారు. 

ఈశాన్య రాష్ట్ర‌మైన మ‌ణిపూర్ లో ఎన్నిక‌ల ప్ర‌చారం శనివారంతో ముగిసింది. 60 మంది సభ్యులున్న మ‌ణిపూర్ అసెంబ్లీకి నేడు 38 స్థానాల‌కు, మార్చి 5వ తేదీన 22 స్థానాలకు రెండో ద‌శ‌లో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. కాగా ఈ ఎన్నిక‌ల్లో నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP), నాగా పీపుల్స్ ఫ్రంట్ (NPF), లోక్ జనశక్తి పార్టీ (LJP) మద్దతుతో 2017లో మణిపూర్‌లోబ బీజేపీ (BJP) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, ఈసారి బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. మొత్తం 60 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తోంది.

మరోవైపు కాంగ్రెస్ (Congress) ఆరు రాజకీయ పార్టీల కూటమిని ఏర్పాటు చేసి దానికి మణిపూర్ ప్రోగ్రెసివ్ సెక్యులర్ అలయన్స్ (MPSA) అని పేరు పెట్టింది. MPSAలో సంకీర్ణ భాగస్వాములలో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), ఫార్వర్డ్ బ్లాక్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (RSP), జనతాదళ్ (సెక్యులర్) ఉన్నాయి.

2017 మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 28 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది, ఆ తర్వాత బీజేపీ 21 సీట్లతో సరిపెట్టుకుంది.నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP), నాగా పీపుల్స్ ఫ్రంట్ (NPF), చెరో నాలుగు సీట్లు గెలుచుకున్నాయి. లోక్ జనశక్తి పార్టీ (LJP) ఒక్క నియోజకవర్గాన్ని మాత్రమే గెలుచుకోగలిగింది. మొత్తం ఓట్లలో బీజేపీకి 36.28 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 35.11 శాతం ఓట్లు వచ్చాయి. తర్వాత, బీరెన్ సింగ్ నాయకత్వంలో ఎన్‌పీపీ, ఎన్‌పీఎఫ్, ఎల్ జేపీలతో కలిసి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?