
ముంబై : Hidden Treasure వేటలో కొందరు విచక్షణ కోల్పోతున్నారు. మనుషులను బలిస్తే ఎన్నడూ చూడనంత సంపద లభిస్తుందనే కట్టుకథలను నమ్మి సొంత వారిని Human Sacrifice ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అలాంటి ఘటన మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో వెలుగుచూసింది. గుప్తనిధుల కోసం 18 ఏళ్ల కుమార్తెనే బలిచ్చేందుకు సిద్ధమయ్యాడో తండ్రి. బాలిక సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలిక తండ్రి, తాంత్రికుడితో పాటు మరో ఏడుగురిని అరెస్టు చేశారు. బాబుల్గావూన్ తహసీల్ లోని మద్ని గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు బంధువుల ఇంటి వద్ద ఉంటూ చదువుకుంటుంది.
ఇటీవలే తన సొంత ఊరికి వచ్చింది. ఈ క్రమంలో తండ్రి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఆ తర్వాత తాంత్రికుడితో కలిసి ఇంట్లో క్షుద్రపూజలు చేయడం ప్రారంభించాడు. కుమార్తెను సజీవంగా ఖననం చేసేందుకు ఏప్రిల్ 25న ఇంట్లోనే పెద్ద గొయ్యి కూడా తవ్వాడు. ఈ విషయాన్ని గుర్తించిన బాలిక ఎలాగోలా తన స్నేహితురాలికి సమాచారం చేరవేసింది. ఈ విషయాన్ని స్నేహితురాలు పోలీసులకు తెలియజేసింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికను రక్షించారు. క్షుద్ర పూజలు చేస్తున్న బాలిక తండ్రితోపాటు, తాంత్రికుడు, మరో ఏడుగురిని అరెస్టు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇలాంటి గుప్తనిధుల సంఘటనలు తెలంగాణలో ఈ ఫిబ్రవరిలో ఓ రెండు వెలుగులోకి వచ్చాయి. ఫిబ్రవరి 8 న సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలో చెమ్నారిగూడెంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. ఇంట్లో దోషం ఉందని, పూజలు చేయకపోతే ప్రాణ నష్టం కలుగుతుందని నమ్మించి శేషాచార్యులు అనే వ్యక్తి ఈ ఘటనలకు పాల్పడుతున్నాడు. అంతే కాకుండా ఇంట్లో బంగారం ఉందని, వెలికి తీస్తానని నమ్మిస్తూ మోసం చేస్తున్నాడు. ఇళ్లల్లో గుంతలు తీసి పూజలు చేస్తున్నాడు. తీరా తాము మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటున్నారు. చివరికి జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ కు ఫిర్యాదు చేసి, తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
కాగా, ఫిబ్రవరి 2న సూర్యాపేటజిల్లా, మాడుగులలో నకిలీ స్వామి అవతారం ఎత్తి ప్రజలను మోసం చేస్తున్న ముగ్గురు బురిడీ బాబాలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. సీఐ కృష్ణ మోహన్ కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం నాగులపాటి గ్రామానికి చెందిన పర్వతం స్వామి అలియాస్ నాగరాజు స్వామి, పర్వతం సైదులు అలియాస్ సహదేవ స్వామి, సిరసాల బక్కయ్య కలిసి స్వామి అవతారం ఎత్తి ‘మీ ఇంట్లో గుప్తనిధులు తీస్తాం, మేము మంత్రాలు చదివితే సర్వ రోగాలు మాయం అవుతాయి, మేమిచ్చే నిమ్మకాయ నీరు తాగితే సంతానం కలుగుతుందని’ ప్రజలను మోసం చేస్తున్నారు.
మండలంలోని కలకొండ, అన్నెబోయిన్పల్లి, అందుగుల, పరిసర గ్రామాల్లో ప్రజలకు మాయమాటలు చెప్పి లక్షల రూపాయలు వసూలు చేశారు. ప్రజల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి.. వారి వద్ద నుంచి సుమారు రూ.13 లక్షలు స్వాధీనం చేసుకుని…రిమాండ్ కు పంపినట్లు చెప్పారు.