
లక్నో: అప్పునకు బదులు మహిళతో అక్రమ సంబంధం నెరుపుతూ వచ్చిన అ వ్యక్తి ప్రాణాలు అర్థాంతరంగా ముగిశాయి. వివాహేతర సంబంధం కారణంగా అతని ప్రాణాలు అనంతవాయువుల్లో కలిశాయి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ కు చెందిన వినోద్ కుమార్, ప్రీతి దంపతులు ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ కు వలస వచ్చారు. అదే ప్రాంతానికి చెందిన త్యాగి అనే వ్యక్తి వద్ద ప్రీతి పెళ్లికి ముందు 40 వేల రూపాయలు అప్పు తీసుకుంది. వివాహమైన తర్వాత దంపతులు ఇద్దరు కలిసి మరో లక్ష రూపాయలు తీసుకున్నారు.
కాలం గడుస్తున్నా అప్పు తీర్చకపోవడంతో తనతో సంబంధం పెట్టుకోవాలని, తన కోరిక తీర్చాలని ప్రీతిని త్యాగి బలవవంతం చేశాడు. దీంతో ఏడాది కాలంగా వారిద్దరి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతూ వస్తోంది. ఈ విషయం ప్రీతి భర్త వినోద్ కు తెలిసింది. దాంతో త్యాగిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు ప్రీతి కూడా సమ్మతించింది.
జనవరి 4వ తేదీన త్యాగిని విందుకు పిలిచారు. అతనితో మితిమీరి మద్యం తాగించారు. అతను నిద్రలోకి జారుకున్న తర్వాత దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఆ తర్వాత శవాన్ని సూట్ కేసులో పెట్టి విజయ్ నగర్ లోి డ్రైనేజీ కాలువలో పడేశారు.
స్నేహితుడి ఇంటికని చెప్పి వెళ్లిన త్యాగి మర్నాడు కూడా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు సాగించారు. డ్రైనేజీ కాలువలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న త్యాగి శవాన్ని గుర్తించారు. అతడి సెల్ ఫోన్ సిగ్నల్స్, ఎటీఎం విత్ డ్రాయల్స్, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు జరిపి వినోద్, ప్రీతిలను అదుపులోకి తీసుకున్నారు.