ఓటు వేయొద్దన్నా వేసినందుకు కాల్చి చంపారు

By Siva KodatiFirst Published May 22, 2019, 11:31 AM IST
Highlights

తాము పోలింగ్‌లో పాల్గొనవద్దని పిలుపునిచ్చినా ఓటు వేసినందుకు ఓ వ్యక్తిని దుండగులు కాల్పి చంపారు. 

తాము పోలింగ్‌లో పాల్గొనవద్దని పిలుపునిచ్చినా ఓటు వేసినందుకు ఓ వ్యక్తిని దుండగులు కాల్పి చంపారు. దేశం మొత్తం ఎన్నికల నిర్వహణ ఒక ఎత్తైతే జమ్మూకశ్మీర్‌లో మరో ఎత్తు. అందుకే ఎన్నికల సంఘం సైతం ఇక్కడ పటిష్టమైన ఏర్పాట్లు చేసింది.

అంతెందుకు ఒక్క అనంతనాగ్ లోక్‌సభ స్ధానానికి మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించారంటే పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు. సార్వత్రిక ఎన్నికలలో ఓటింగ్‌ను బహిష్కరించాలంటూ ఉగ్రవాదులు, వేర్పాటువాదులు హెచ్చరించడంతో పోలింగ్ రోజున ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాలేదు.

కొన్ని గ్రామాల్లో అయితే కనీసం ఒక్క ఓటు కూడా పోల్ కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఓ కుటుంబం ఓటు వేసింది. కుల్గాంలోని జుంగల్‌పొరా గ్రామంలో ఏప్రిల్ 29న ఎన్నికలు జరిగాయి..500 కుటుంబాలున్న ఈ గ్రామంలో కేవలం 7 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి.

ఇందులో 5 ఓట్లు పీడీపీ కార్యకర్త మహ్మద్ జమాల్ కుటుంబసభ్యులవే... పోలింగ్ రోజున ఆరోగ్యం బాలేకపోవడంతో ఆయన ఓటు వేసేందుకు వెళ్లలేకపోయాడు.. అయినప్పటికీ కుటుంబసభ్యులను మాత్రం తప్పకుండా ఓటు వేయాలని సూచించారు.

అయితే గత ఆదివారం జమాల్ తన ఇంట్లో ఉండగా.. ఓ దుండగుడు కిటికీలోంచి ఆయనపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన జమాల్‌ను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

ఓటు వేశామన్న కక్షతోనే తమ ఇంటి పెద్దను చంపినట్లు జమాల్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడింది ఉగ్రవాదులా లేక స్థానికులా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. 
 

click me!